ఇరుక్కున్న ఇమ్రాన్ చేయగలిగింది ఇంతే!

‘కాశ్మీర్​కోసం ఎంతకైనా తెగిస్తాం’ అని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అనడాన్ని ఇండియా సహా ఇరుగు పొరుగు దేశాలన్నీ లైట్​గా తీసుకున్నాయి.  కాశ్మీర్​ ప్రాంతం మీది ఎప్పుడయ్యిందో చెప్పమని ఇండియా గట్టిగా అడిగేసరికి నోరు బందయ్యింది. ఇంతకీ, ఇమ్రాన్​ మాటలు సహజంగా వచ్చాయా, లేక సైన్యం స్క్రిప్ట్​ని ఆయన చదివారా అనే అనుమానాలు వచ్చాయి. నిస్సందేహంగా అవి పాక్​ మిలిటరీ మాటలే! దేశంలో ఆర్థిక, సామాజిక పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయినందున… ఇండియా బూచిని చూపించి పబ్బం గడుపుకోవాలని భావిస్తోంది.

బాగు పడాలంటే అప్పు చేయాలి, లేదా యుద్ధం చేయాలి అనే ఫార్ములాతోనే పాకిస్థాన్​ సాగుతోంది. ప్రపంచ దేశాలన్నీ శాంతి, సుస్థిరత కోరుకుంటున్నందున ఇప్పటికిప్పుడు అప్పులిచ్చి ఆదుకునే పరిస్థితి లేదు. ఇరుగుపొరుగు దేశాలలో రక్తం పారిస్తున్న మిలిటెంట్​ సంస్థలు పాక్​లోనే తలదాచుకుంటున్నాయని సాక్ష్యాలతో రుజువైంది. సైన్యం మద్దతుతో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న మాజీ క్రికెటర్​ ఇమ్రాన్​ ఖాన్​ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైంది. అధ్వాన్నంగా మారిన ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని చక్కబెట్టడమే ఆయన ఫస్ట్​ టార్గెట్​. స్వతహాగా క్రికెటర్​ కావడం, నాన్​–కన్వెన్షనల్​ పొలిటికల్​ లీడర్​ కావడం, పూర్తిగా వెస్ట్రన్​ లైఫ్​స్టయిల్​తో ఉండడం ఇమ్రాన్ ప్రత్యేకతలు. ఆయన అధికారంలోకి వచ్చాక, ఆ తర్వాతకూడా ఇండియాపై పెద్దగా వ్యతిరేకత చూపలేదు. అయితే, రానురాను సైన్యం వత్తిడి పెరగసాగింది.

ఇండియాని బూచిగా చూపించకపోతే పాక్​లో సైన్యానికి మనుగడ ఉండదు. పుల్వామాలో మిలిటెంట్​ దాడితో ఇండియా వైఖరిలో పూర్తి మార్పు వచ్చింది. ఇకపైనా మిలిటెన్సీ విషయంలోనూ, దానిని ఎంకరేజ్​ చేస్తున్న దేశం విషయంలోనూ మునుపటిలా ఊరుకునేది లేదన్న సంకేతాన్ని స్పష్టంగా పంపించింది. మొట్టమొదట పాక్​ని మోస్ట్​ ఫేవర్డ్​ నేషన్​ జాబితా నుంచి తొలగించింది. అక్కడి వస్తువు దిగుమతిపై కొన్ని కట్టుబాట్లు పెట్టింది. ఇక్కడి నుంచి వెళ్లే ఎగుమతులపై సుంకాన్ని పెంచింది. కాశ్మీర్​లో అమలవుతున్న ఆర్టికల్​–370ని రద్దు చేసేసింది. ఇవన్నీ పాక్​ ఆర్థిక మూలాలను కుదిపేశాయి.

అక్కడ ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థనుసైతం సైన్యమే నడిపిస్తుంది. ప్రధానమంత్రి ఎవరయినా సైనిక ప్రయోజనాలే ముఖ్యం.  ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ చీఫ్​గా ఉన్న పిటిఐకి పాకిస్థాన్‌‌ సైన్యం, గూఢచారి సంస్థ ఐఎస్‌‌ఐతో పాటు అక్కడి మిలిటెంట్​ నెట్‌‌వర్క్‌‌కూడా గట్టి మద్దతు ఇచ్చాయన్నది బహిరంగ రహస్యం. ఇమ్రాన్‌‌ ఏం మాట్లాడాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మిలిటరీ స్క్రిప్ట్​ ప్రకారం నడుచుకోవలసిందే.

డాలర్కి 157 పాక్ రూపాయలు!

ఇమ్రాన్​ అధికారంలోకి వచ్చేనాటికే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారి ఉంది. ఇటీవల డాలర్​ విలువ చాలా రెట్లు పెరిగింది. కేవలం 12 నెలల్లోనే పాక్​ రూపాయి విలువ డాలర్​కి 123 నుంచి 157 రూపాయలకు పడిపోయింది.  వచ్చే మార్చి నాటికి డాలర్​కి 250 రూపాయలకు పడిపోవడం ఖాయమని ఫైనాన్షియల్​ ఎనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌‌) ఇదివరకే ఒకసారి బెయివుట్‌‌ ప్యాకేజీతో దివాళా అంచు నుంచి పైకి లాగింది.  తాజాగా 600 కోట్ల డాలర్లతో (పాక్​ రూపాయల్లో 94,500 కోట్లు) మరో బెయిలవుట్​ ప్యాకేజీని ప్రకటించాల్సి వచ్చింది. స్టేట్​ బ్యాంక్‌‌ ఆఫ్​ పాకిస్థాన్​ (పాక్‌‌ రిజర్వ్‌‌ బ్యాంక్‌‌)లో ఫారిన్​ ఎక్చేంజీ నిల్వలు అడుగంటిపోయాయి.


చైనా పెట్టుబడులతో భారం

చైనా ‘ఒన్​ బెల్డ్​–ఒన్​ రోడ్’​ పేరుతో వాణిజ్య విస్తరణకు దిగింది. పాకిస్థాన్‌‌లో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్టులపై  పెట్టుబడి పెడుతోంది. పాక్​లో పూర్తిగా మ్యాన్​ఫాక్చరింగ్​, ప్రొడక్షన్​ వ్యవస్థలు కుదేలైపోవడంతో దిగుమతులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తోంది. ఇక్కడి టెక్స్​టైల్​ మార్కెట్​కి చైనా తయారీ చౌక బట్టలు గట్టి పోటీ ఇస్తున్నాయి. చైనా పెట్టుబడులు తెల్లఏనుగులా మారుతున్నాయన్న భయం ఉంది. అసలు ఇమ్రాన్‌‌ అధికారంలోకి వచ్చేసరికే బిజినెస్​ రేటింగ్‌‌ కొనప్రాణంతో ఉంది. ఇప్పుడు ‘చైనా పాకిస్థాన్​ ఎకనమిక్​ కారిడార్​ (సిపీఈసీ)’ పేరుతో మరింత భారం పెరగనుంది.

Latest Updates