
ఇప్పటికే రెండు రైలు సర్వీసుల్ని ఆపేసిన పాకిస్తాన్ తాజాగా ‘‘దోస్త్’’ బస్సు సర్వీసును కూడా నిలిపేస్తామని ప్రకటించింది. లాహోర్ నుంచి ఢిల్లీకి వెళ్లే ‘దోస్త్’ (ఫ్రెండ్షిప్) బస్సు సర్వీసును సోమవారం నుంచి రద్దుచేస్తున్నట్టు పాకిస్తాన్ కమ్యూనికేషన్ మంత్రి మురాద్ సయీద్ శనివారం చెప్పారు. ఢిల్లీలోని అంబేద్కర్ స్టేడియం టెర్మినస్ నుంచి పాకిస్తాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ( పీటీడీసీ) బస్సు సర్వీసు మాత్రం యథావిధిగా శనివారం ఉదయం ఆరుగంటలకు లాహోర్‌కు బయల్దేరింది. ఈ బస్సులో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. లాహోర్ నుంచి ఢిల్లీకి వచ్చే డీటీసీ బస్సులో మాత్రం ముగ్గురు ప్యాసింజర్లు ఉన్నట్టు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధికారి చెప్పారు. జమ్మూకాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ రద్దుచేయడంతో పాకిస్తాన్ మనదేశంతో ఇప్పటికే డిప్లమోటిక్ సంబంధాలను రద్దుచేసుకుంది. ట్రేడ్ ఒప్పందాలను కూడా సస్పెండ్ చేసింది. బుధవారం సమావేశమైన నేషనల్ సెక్యూరిటీ కమిటీ (ఎన్ఎస్సీ) మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే లాహోర్ – ఢిల్లీ బస్సు సర్వీసుల్ని సస్పెండ్చేసినట్టు మంత్రి సయీద్ చెప్పారు.
చివరి స్టేషన్‌కు చేరుకున్న థార్ ఎక్స్‌ప్రెస్
రాజస్థాన్ బోర్డర్ గుండా ఇండియాలోని జోథ్‌పూర్ నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి తిరిగే థార్ ఎక్స్ ప్రెస్ ఇండియా బోర్డర్లో ఉన్న చివరి స్టేషన్ మునబావోకు శనివారం ఉదయం చేరుకుంది. రైల్లో 165 మంది ప్రయాణికులున్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ తర్వాత వాళ్లంతా ఇంటర్నేషనల్ బోర్డర్లోని జీరోపాయింట్ చేరుకున్నారు. ప్యాసింజర్లలో 81 మంది ఇండియన్లు ఉన్నారు. వీళ్లంతా పాకిస్తాన్‌లోని తమ బంధువులను కలుసుకోవడానికి వెళ్తున్నారు. వీసా పరిమితి దాటిపోవడంతో 84 మంది పాకిస్తానీలు సొంత దేశానికి వెళ్లిపోతున్నారు. కరాచీ నుంచి బయల్దేరాల్సిన థార్ ట్రైన్ ఇప్పటికే జీరో పాయింట్‌కి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం అక్కడి నుంచి అది బయల్దేరుతుందని నార్త్ వెస్టర్న్ రైల్వే ప్రతినిధి చెప్పారు.
జోథ్‌పూర్ భగత్ కి కోఠి స్టేషన్ నుంచి కరాచీకి శుక్రవారం రాత్రి బయల్దేరిన ఈ రైలు మునబావో స్టేషన్‌కు శనివారం ఉదయం 6.55 గంటలకు రీచ్ అయింది. అయితే థార్ ఎక్స్ ప్రెస్ సర్వీసుల్ని సస్పెండ్ చేస్తున్నట్టు పాక్ రైల్వేమంత్రి షేక్ రషీద్ అహ్మద్ శుక్రవారమే ప్రకటించారు. 13 ఏళ్లలో సుమారు నాలుగు లక్షలమంది థార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్టు అంచనా. థార్ ఎక్స్‌ప్రెస్ కోసం 133 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌ను 13 బిలియన్ రూపాయలతో నిర్మించారు. ఇప్పుడు దీన్ని థార్ బొగ్గు ప్రాజెక్టుకు ఉపయోగించనున్నట్టు పాక్ అధికారులు చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టడంతో సంజౌతా ఎక్స్ ప్రెస్ సర్వీసుల్ని కూడా పాక్ రద్దుచేస్తున్నట్టు గురువారంనాడే ప్రకటించింది.