కిలో టమాటా రూ.300: పెళ్లిలో గోల్డ్ బదులు టమాటా నగలు

ఈ ఫొటోలో యువతిని చూడండి. పెళ్లిలో బంగారు నగల బదులు టమాటా నగలు వేసుకుని సిగ్గు ఒలకబోస్తోంది. ఏంటని అడిగితే.. ‘మేం డబ్బున్నోళ్లం.. అందుకే గోల్డ్ బదులు టమాటా నగలు వేసుకున్నాం’ అని గారంగా చెబుతోంది. ఆ టమాటాలను టచ్ చేయబోతే ‘చంపేస్తా జాగ్రత్త’ అంటూ బెదిరిస్తోంది కూడా! ఏంటబ్బా.. టమాటా రేటు బంగారంతో పోటీపడే అంతగా ఎప్పుడు పెరిగిందా అనుకుంటున్నారా? అసలు కథ వేరే ఉందిలే!

ఇమ్రాన్‌పై పాక్ యువతి సెటైరికల్ వీడియో

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సెటైరికల్‌గా చేసిన వీడియో ఇది. పాకిస్థాన్‌కు చెందిన ఓ చానల్ దీన్ని ప్రసారం చేసింది. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం పరిస్థితిని ఎద్దేవా చేస్తూ దీన్ని చేశారు. ఓ యువతి పెళ్లిలో టమాటాలతో చేసిన నగలు వేసుకుని ఉండగా రిపోర్టర్ వెళ్లి ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో అది. అందులో ఆమె తాము బాగా డబ్బున్నోళ్లమని అందుకే గోల్డ్ బదులు ఈ నగలు వేసుకున్నానని చెబుతుంది. తమ చుట్టాలు, అన్నయ్యలు కూడా లండన్ నుంచి వస్తూ బాక్సుల్లో టమాటాలు తెచ్చారని రిపోర్టర్‌కి వివరిస్తుంది. ఆ రిపోర్టర్ టమాటాలను టచ్ చేయబోతే.. ‘ఏయ్ చంపేస్తా’ అంటూ హెచ్చరిస్తుంది

ఈ వీడియోను నైలా ఇనాయత్ అనే మహిళా జర్నలిస్టు తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. భారత్ సరిహద్దుకు ఆనుకుని ఉండే వాఘాలో నివసించే నైలా.. గతంలోనూ చాలా సార్లు ఇమ్రాన్‌పై సెటైర్లు వేసిందామె. ఈ టమాటా నగల వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో  వైరల్ అవుతోంది.  రెండ్రోజుల్లో 33 వేల మందిపైగా ఈ వీడియోను చూశారు. 2600 మంది లైక్ కొట్టారు. 900 మందికి పైగా రీ ట్వీట్ చేశారు.

టమాటా కిలో రూ.300

ఆదిత్య 369 సినిమాలో టైమ్ మెషీన్‌లో హీరో, హీరోయిన్ భవిష్యత్తులోకి వెళ్లిపోయినప్పుడు కనిపించే ఓ సీన్‌ను గుర్తు తెచ్చేలా మారాయి అక్కడి పరిస్థితులు. ఓ మహిళ ఫోన్ చేసి.. ‘ఇవాళ టమాటా రేటు చీప్‌గా ఉంది. కిలో టమాటా కేవలం రూ.1500 మాత్రమే. ఆఫీస్ నుంచి వస్తూ తీరుకురండి’ అని తన భర్తకు చెబుతుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనలో ఆ దేశం ఇంచుమించుగా అలాంటి పరిస్థితుల అంచులకు వెళ్లోంది. ప్రస్తుతం అక్కడ కిలో టమాటా రూ.300 పైనే ఉంది. దీనిపై సెటైర్లు వేస్తూ ఈ వీడియో చేశారు.

Related News: ఇమ్రాన్ కెప్టెన్సీలోనూ బాకిస్థానే!

Latest Updates