సాధువుల హ‌త్య కేసు: నిందితుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఇద్దరు సాధవులు హత్యకు గురైన కేసుకు సంబంధించి ఓ వార్త క‌ల‌క‌లం రేపుతోంది. గ‌త నెల ఏప్రిల్ 16 న కల్పవృక్ష గిరిరాజ్(70), సుశీల్ గిరిరాజ్(35) అనే ఇద్ద‌రు సాధువులతో పాటు మరో డ్రైవర్‌ను కొంతమంది సమూహంగా వచ్చి రాళ్లు, కర్రలతో కొట్టి దారుణంగా చంపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వందమందిని అదుపులోకి తీసుకోగా, తాజాగా మరో 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆ నిందితుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఒక్కసారిగా వాడా పోలీస్‌స్టేషన్‌లో కలకలం రేగింది.

నిందితుల్లో ఒకరు అస్వస్థతకు గురవ్వడంతో పాల్గర్ రూరల్ అస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే అతడిని జేజే ఆస్పత్రిలోని ప్రత్యేక జైల్ వార్డ్ కు తరలించి ఐసోలేషన్ లో ఉంచారు. అయితే వాడా పోలీస్ స్టేషన్ లో ఈ నిందితుడితో పాటు మరో 20 మందిని పోలీసులు ఒకే గదిలో ఉంచారు. దీంతో ఆ గదిలో ఉన్న మిగతా 20 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సాధువులను హత్య చేసిన అనంతరం నిందితులు అడువుల్లోకి పారిపోయారు. అయితే వారి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రోన్లను ఉపయోగించి వారి జాడ కనిపెట్టారు. ఇక ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో 9 మంది మైనర్లు, ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Hindu sadhus

Latest Updates