కరోనా మానవ హక్కుల సమస్యగా మారుతోంది..

  • ఆందోళన వ్యక్తం చేసిన యునైటెడ్ నేషన్స్
  • ప్రజా హక్కులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు

న్యూయార్క్: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మానవ సమస్యగా మారిందని, ఇపుడు అది మానవ హక్కుల సంక్షోభంగా మారుతోందని యునైటెడ్ నేషన్స్ (యూఎన్)సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. కరోనాపై పోరాటం సమయంలో ప్రజా సేవలందించడంలో వివక్ష జరుగుతోందని ఆయన దృష్టికి వచ్చినట్లు గురువారం వీడియో మెస్సేజ్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, మానవ హక్కులను గౌరవించాలని ప్రపంచ దేశాలకు సూచించారు. అత్యవసర అధికారులు అవసరమే అయినప్పటికీ.. పెరుగుతున్న జాతీయవాదం, అధికారవాదం మానవ హక్కుల ప్రాధాన్యతను వెనక్కి నెట్టివేయగలదని, కరోనా సాకుతో ఇతర ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూడటం మంచిదికాదని హెచ్చరించారు. మానవ హక్కులకు ప్రాధాన్యతనివ్వడంతోనే కరోనా కష్ట కాలం నుంచి బయటపడవచ్చునని చెప్పారు. ఇలాంటి కఠిన సమయంలో మానవ హక్కులను గుర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ గురువారం ఓ నివేదికను విడుదల చేస్తున్నట్లు గుటెరస్ చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి, ప్రాథమిక సేవలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వాలకు సూచించారు. వాటిపై ప్రభావం చూపేవారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Latest Updates