ఇలాంటి పేరెంట్ అవ్వొద్దు

పిల్లలు అప్పుడప్పుడు కొన్ని సరదా పనులు చేస్తుంటారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఐదేళ్ల పాప తమ్ముడికి అమ్మ అయిపోతుంది. అచ్చం అమ్మలాగానే టవల్‌‌ను పైటలా వేసుకుని అమ్మలా యాక్ట్ చేస్తుంది. ఇలాంటివి  ప్రతీ ఇంట్లో చూస్తూనే ఉంటాం.  పిల్లలు పెద్దవాళ్లని అనుకరించడం మామూలే. అయితే ఇది చూడడానికి ముచ్చటేసినా దీని వెనుక అర్థం చేసుకోవాల్సింది కూడా చాలా ఉంది. పిల్లలు ప్రతిది తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు.  అందుకే తల్లిదండ్రులు తమ ప్రభావం పిల్లలపై ఎంతుందో గమనించాలి. పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి.
ప్రవర్తనలో ఏవైనా నెగెటివ్ షేడ్స్ ఉన్నాయేమో చూసుకోవాలి.


పేరెంటింగ్‌‌లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు పిల్లల్ని అతి గారాబంగా పెంచితే.. మరి కొందరు అంతగా పట్టించుకోకుండా వదిలేస్తుంటారు.  పిల్లల్ని ఎలా అయినా పెంచొచ్చు. కానీ పేరెంట్స్‌‌లో ఉండే కొన్ని లక్షణాలు మాత్రం పిల్లలపై చాలా నెగెటివ్ ఎఫెక్ట్‌‌ చూపుతాయి. వాటినే ‘టాక్సిక్ ఎలిమెంట్స్’ అంటారు. ఇవి ఎవరిలో ఉంటే వాళ్లు టాక్సిక్ పేరెంట్స్ కిందకు వస్తారు.

టాక్సిక్ అంటే ‘విషపూరితం’ అని అర్థం.  అవి తెలియకుండానే పిల్లల మీద కొన్ని నెగెటివ్ ప్రభావాల్ని చూపుతాయి. టాక్సిక్ పేరెంటింగ్ అంటే మరీ క్రూరమైన ప్రవర్తన అని అనలేం కానీ ‘ఎమోషనల్లీ అన్‌‌హెల్దీ బిహేవియర్’ అనొచ్చు. ఈ తరహా పేరెంటింగ్..  పిల్లల్లో  కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్‌‌కి కారణం అవ్వొచ్చు. అందుకే  వీటిని ముందే గుర్తించి మార్చుకుంటే సరిపోతుంది. ముందుగా ఏది టాక్సిక్ బిహేవియర్ కిందకు వస్తుందో చూద్దాం..

ఫెయిల్ అవ్వొద్దు
కొంతమంది పిల్లలని గారాబంగా కాకుండా వాళ్ల పనులు వాళ్లే చూసుకోగలగాలి అని వదిలేస్తుంటారు. ఇది కొంతవరకు పర్వాలేదు. కానీ ప్రతి విషయంలో ఇది కుదరదు. పిల్లలు టీనేజ్  వయసులో ఉంటే.. కొంతవరకు అర్థం చేసుకునే వీలుంటుంది కానీ పదేళ్ల లోపు  వయసున్నప్పుడు వాళ్ల పనులని తల్లిదండ్రులే చూసుకోవాలి.  ముఖ్యంగా పిల్లలకు ‘మా పేరెంట్స్ ఉన్నారు’ అనే ధైర్యం ఇవ్వాలి. ఎక్కడికెళ్లినా పేరెంట్స్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఈ విషయంలో పేరెంట్స్ ఫెయిల్ అయితే..  పిల్లల్లో పెద్దయ్యాక అభద్రతా భావానికి కారణం అవుతారు.

విమర్శించొద్దు
చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అదే పనిగా తిడుతుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ‘నీకు ఆ పని చేతకాద’ని క్రిటిసైజ్ చేస్తుంటారు. ఇది కూడా పిల్లల్లో కాన్ఫిడెన్స్ తగ్గించే పనే.  తప్పు చేసినపుడు మందలించడం వేరు,  క్రిటిసైజ్ చేయడం వేరు. మందలిస్తే భయంతో ఆ పని జాగ్రత్త గా చేసే వీలుంటుందేమో గానీ, పదే పదే ‘నీకు ఆ పని చేతకాదు’ అనడం వల్ల ఆ మాటలు పిల్లలపై ఎక్కువ నెగెటివ్ ప్రభావాన్ని చూపుతాయి.

జోకులెందుకు?
పిల్లల్లో ఏదైనా లోపం ఉన్నా, ఏదైనా విషయంలో తప్పు చేసినా దాని గురించి జోకులు వేస్తుంటారు కొంతమంది. కించపరిచే ఉద్దేశం లేకపోయినా,  సరదాగా చేసినా..  అది మాత్రం పిల్లలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, హైట్ గురించి, రంగు గురించి, బొద్దుగా ఉన్నా.. ఇలా ఏ విషయంలో అయినా జోకులేయడం వల్ల  పెద్దయ్యేకొద్దీ వాళ్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. మనసులో బాధ పడకపోయినా ఆ ఇంపాక్ట్ ఉండిపోతుంది.

నెగెటివ్ కూడా..
పిల్లలు కోపంలో ఉన్నప్పుడు,  అలిగినపుడు, ఏడుస్తున్నప్పుడు వాళ్లు చెప్పే సాకులు , వాళ్లు చెప్పే కారణాలు ఓపికగా వినాలి.  ఏ నెగెటివ్ ఎమోషన్ అయినా పంచుకుంటేనే కొంతవరకు పోతుంది. లోపల దాచుకోవడం వల్ల వేరే రూపంలో బయటకు వస్తుంది. అందుకే పిల్లలు చెప్పేవి ఎంత చిన్న విషయాలైనా పూర్తిగా విని మంచిగా స్పందించాలి.

తేడాలొద్దు
ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలున్నప్పుడు అందర్నీ ఒకేలా చూడాలి. ఈ విషయంలో చాలామంది తల్లిదండ్రులు ఫెయిల్ అవుతుంటారు.
పెద్దోడు చిన్నోడు అనే తేడా చూపిస్తుంటారు. దానివల్ల వాళ్లు పెద్దయ్యాక వాళ్ల మధ్య రిలేషన్స్ అంత మెరుగ్గా ఉండవు. – పిల్లలు ఎప్పుడైనా  పోట్లాడుకుంటే..  ఒకరి వైపు ఉండొద్దు. ఇలా చేస్తే రెండో పిల్లాడికి తల్లిదండ్రుల మీద, తోబుట్టువుల మీద ద్వేషం కలుగుతుంది.
అందుకే ఇద్దరు పిల్లలున్నప్పుడు.. ఒకరిని తిట్టడం మరొకరిని పొగడటం లాంటివి అస్సలు చేయకూడదు.

ఎవరి స్పేస్ వాళ్లకి..
పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ల పర్సనల్ బౌండరీస్ పెరుగుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి వాళ్ల స్పేస్‌‌లోకి వెళ్లాలా లేదా అనేది తల్లిదండ్రులు డిసైడ్ చేసుకోవాలి.  ఎప్పుడూ వాళ్లపై ఓ కన్నేసి ఉండడం.. అలాగని పూర్తిగా వదిలేయడం చేయకూడదు. వాళ్ల స్పేస్ వాళ్లకిస్తూనే అవసరాన్ని బట్టి గమనిస్తుండాలి.

ఎమోషన్స్​ రుద్దొద్దు
చాలా చోట్ల పేరెంట్స్​‘నేను నీకోసం ఇంత చేశాను, అంత చేశాను’ అని చెప్తుంటారు. ఇది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కాకపోయినా ఎఫెక్ట్ మాత్రం అలానే ఉంటుంది. ‘నేను నీకోసం ఇంత చేశాను కాబట్టి నువ్వు నాకు నచ్చిన డెసిషనే తీసుకోవాలి’ అంటుంటారు. దీనివల్ల ఇటు పిల్లల్లో, అటు పేరెంట్స్‌‌లో డిప్రెషన్ పెరిగే అవకాశముంది. ‘మా ప్రేమను అర్ధం చేసుకోవట్లేద’ని పేరెంట్స్, ‘వాళ్లకోసం చేయాలా? నా కోసం చేయాలా?’ అనే కన్ఫ్యూజన్ లో పిల్లలు ఉంటారు.   ఇలాంటి పరిస్థితి వచ్చినపుడు ఏ డెసిషన్ తీసుకున్నా అది ఎవరో ఒకరికి నెగటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అందుకే అక్కడి దాకా తెచ్చుకోకూడదు. డెసిషన్‌‌లో పూర్తి స్వేచ్ఛ ఎదిగిన పిల్లలకు ఇవ్వాలి. కానీ దాని వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయో వివరించి చెప్పాలి. ముందు నుంచే పిల్లలకి పేరెంట్స్‌‌కి పాజిటివ్ ఎన్విరాన్‌‌మెంట్ ఉండాలి. ఓపెన్‌‌గా మాట్లాడుకునే వాతావరణం క్రియేట్ చేసుకోవాలి.

పోలికలొద్దు
చాలా సందర్భాల్లో  పిల్లల్ని మరొకరితో పోల్చి మాట్లాడుతుంటారు కొంతమంది.  చదువు, అల్లరి విషయాల్లో ఎదుటివారితో పోల్చి కోప్పడటం వల్ల పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. పోల్చడం వల్ల నెగెటివ్ థింకింగ్ పెరిగి, ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా ఆలోచించటం, పనిచేయటం చేస్తారు. కొత్త వారితో చొరవగా కలవలేరు.  ఒంటరిగా ఉండటానికి అలవాటు పడతారు. పక్కవాళ్లతోనే కాదు ఇంట్లో వాళ్లతో పోల్చినా ఇన్‌‌ఫీరియారిటీ ఫీలింగ్ పెరిగి డిప్రెషన్‌‌లోకి  వెళ్లిపోతారు. ఇది మొండితనానికీ , తప్పించుకు తిరిగే ధోరణికీ దారితీయొచ్చు.

ఒకేలా ఉండరు
చాలామంది పేరెంట్స్ పిల్లలందరూ ఒకేలా ఉంటారనుకుంటారు. కానీ కాదు. ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
ఎవరి వ్యక్తిత్వం వారిది.   వారి వ్యక్తిత్వం, బాధ్యతలు, ప్రవర్తన, హాబీల విషయంలో ఇది తెలిసిపోతుంది. ఒకరే చైల్డ్  ఉంటే అది అంత సులభంగా అర్థం కాదు. దాంతో పిల్లలను వేరొకరితో పోల్చుతుంటారు.
ఇది పిల్లలకు నచ్చదు. వారిని వారిలా ఎదగనివ్వాలి. స్వేచ్ఛగా ఆలోచించేలా చేయాలి.

గారాబం కూడా ముప్పే
కొంతమంది తల్లిదండ్రులు  పిల్లలను అతిగారాబంగా పెంచుతారు.  అది ప్రేమ అనుకుంటారు. అయితే దీని వల్ల  వాళ్లు ఫ్యూచర్​లో  మరింత మొండిగా, మాట వినకుండా తయారవుతారని గ్రహించరు.  ఏదో ఒకటి తినిపించడానికో , వారితో పని చేయించటానికో అనవసరమైన ప్రేమను ప్రదర్శిస్తారు. ఇది రాను రాను పిల్లలకు అర్థమవుతుంది. మీరు నిజంగా ప్రేమ చూపించినా అదేదో అవసరం కోసమని తప్పుగా అర్థంచేసుకునే వీలుంది. అలాగే అవసరం లేకుండా అన్నీ కొనివ్వకూడదు. కోరిందల్లా కొనిస్తే.. పిల్లలకు అన్నీ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది. దాంతో ఎప్పటికీ వాటి వెనుక ఉండే కష్టం తెలియదు.

Latest Updates