పాపను పోషించలేమంటూ ఇచ్చేశారు

ఆడపిల్లను పోషించలేమంటూ దంపతులకు అప్పగించగా అధికారులు గుర్తించి శిశువిహార్ కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా అనంతారం గ్రామంలో ఓ దంపతులకు పాప, బాబు ఉన్నారు. మూడో సంతానంగా ఇటీవల ఆడపిల్ల జన్మించింది. 20 రోజుల పాపను పోషించలేమంటూ హైదరాబాద్ లోని దంపతులకు విక్రయించినట్లు ప్రచారం జరిగింది. విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు 1098 కి ఫోన్ చేసి శిశు సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. ఐసీడీఎస్, చైల్డ్ లైన్ అధికారులు వెళ్లి ఆ దంపతులను విచారించారు. చట్టప్రకారం దత్తత తీసుకోవాలని, లేకుంటే శిశువిహార్ కు పంపించాలని చెప్పారు. రెండు రోజుల్లో పాపను తమకు అప్పగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆ దంపతులు పాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అధికారులు పాపను వరంగల్లోని శిశు గృహకు తరలించారు.

Latest Updates