కన్నోళ్లే కడుపు మాడ్చి చంపారు

పదకొండేళ్లుంటాయి ఆ పాపకు. తల్లిదండ్రులే చిత్రహింసలు పెట్టారు. పిచ్చి పిచ్చి నమ్మకాలతో నరకం చూపించారు. ఉపవాసమంటూ వారాల తరబడి తిండిపెట్టకుండా మాడ్చారు. గదిలో పెట్టి తాళమేశారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బాధనంతా డైరీలో రాసుకుందా చిన్నారి. వచ్చీ రానీ భాషలోనే 300 పేజీలు రాసింది. అలా రాస్తూనే ఆకలిని తట్టుకోలేక చనిపోయింది.

ఉపవాసం.. ప్రార్థనలు

బ్రెజిల్‌‌లో ఉండే ఎలినా (26), ఎన్రీ (47) దంపతులకు ఇద్దరు పిల్లలు. ఎన్రీ మారు తండ్రి. అతనికి పిచ్చి పిచ్చి మత విశ్వాసాలుండేవి. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికంటూ రకరకాలుగా హింసించేవాడు. తిండి పెట్టేవాడు కాదు. ఆ పిచ్చి పరాకాష్టకు చేరి గత 5 నెలలుగా కూతురు పెరొల్లా పైర్స్‌‌ను ఇంట్లోంచి బయటకు రానియ్యలేదు. రోజుల తరబడి తిండి పెట్టలేదు. పైగా కష్టమైన ఎక్సర్‌‌సైజులు, ప్రార్థనలు చేయించేవాడు. కొన్ని రోజులుగా పెరొల్లా కండీషన్‌‌ బాగా లేకపోవడంతో అక్టోబర్‌‌ 24న హాస్పిటల్‌‌కు తీసుకొచ్చారు. చిన్నారి పరిస్థితి చూసి భయపడిన డాక్టర్లు.. పోలీసులకు ఫోన్‌‌ చేశారు. హాస్పిటల్‌‌కు వచ్చేటప్పటికే తను చనిపోయిందన్నారు. ప్రొటీన్‌‌ కేలరీల లోపంతో తను చనిపోయిందని శవపరీక్షలో తెలిసిందన్నారు. ఇలాంటి పరిస్థితి తిండి తినకపోవడం వల్లే వస్తుందని వివరించారు.

డాక్టర్లదే తప్పని దబాయించారు

తొలుత చిన్నారికి తిండి పెట్టని విషయాన్ని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పాపకు రక్తహీనత ఉందని, పైగా డాక్టర్ల బాధ్యతారాహిత్యమే తన మరణానికి కారణమని దబాయించారు. కానీ పోలీసులు రంగంలోకి దిగి వాళ్ల అపార్ట్‌‌మెంట్‌‌ను సెర్చ్‌‌ చేశారు. చిన్నారి గదిలో ఓ రబ్బర్‌‌ మ్యాట్‌‌ మాత్రమే కనబడింది. వెతగ్గా వెతగ్గా ఆ పాప రాసుకున్న డైరీ దొరికింది. ఈ ఏడాది జూన్‌‌ నుంచి పాపను గదిలోంచి బయటకు రానియ్యలేదని, స్కూల్‌‌కు వెళ్లనివ్వలేదని పోలీసులు తెలుసుకున్నారు. గత 5 నెలల్లో చిన్నారి రెండు సార్లే బయటకొచ్చిందని, గదిలో ఉన్నప్పుడు కేవలం ఎక్సర్‌‌సైజులు, పూజను చేయించేవారని, తప్పు చేస్తే పనిష్‌‌మెంట్‌‌ కూడా ఇచ్చేవారని చెప్పారు. తిండి పెట్టమంటే నీళ్లు తాగమని చెప్పేవాళ్లని డైరీలో తను రాసుకుందన్నారు.

ఇంట్లో తల్లిదండ్రుల డైరీ కూడా..

ఇంట్లో తల్లిదండ్రులు రాసిన ఇంకో డైరీ కూడా తమకు దొరికిందని, వాళ్లు చేసిన పనిని సమర్థించుకుంటూ అందులో రాసుకున్నారని పోలీసులు చెప్పారు. వాళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. 8 ఏళ్ల కొడుకునూ ఇట్లే ఇబ్బంది పెట్టారని, ప్రస్తుతం ఆ పిల్లాడిని తమ రక్షణలో ఉంచామన్నారు. ఆ డైరీని తల్లికి అంకితమిస్తున్నానని చిన్నారి రాయడం తెలుసుకొని తల్లి కన్నీరుమున్నీరైంది. కొడుకును బంధువులు దత్తత తీసుకున్నారు.

Latest Updates