మూఢభక్తితో కూతుళ్లను హత్య చేసిన  తల్లిదండ్రులు

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో తల్లిదండ్రుల మూఢభక్తి.. వారి ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీసింది. ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులే చంపేయడం సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్  మండలం అంకిశెట్టిపల్లె సమీపంలోని శివనగర్  లో ఈ దారుణం జరిగింది. శివనగర్ కు చెందిన పురుషోత్తం నాయుడు ఆమె భార్య పద్మజ తమ ఇద్దరు కూతుళ్లు.. అలేఖ్య, సాయిదివ్య ను దారుణంగా కొట్టి చంపేశారు.

గతేడాది వీరు స్థానికంగా కట్టుకున్న సొంత ఇంటిలోకి మారారు. అప్పటి నుంచి ఇంట్లో భార్యభర్తలు క్షుద్రపూజలు నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి కూడా పూజలు చేసిన పురుషోత్తం, పద్మజలు ముందుగా సాయిదివ్య ను శూలంతో పొడిచి చంపేశారు. ఆ తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్య నోట్లో రాగిచెంబు పెట్టి డంబెల్ తో తలపై కొట్టి చంపేశారు.

ఈ విషయాన్ని స్వయంగా పురుషోత్తంనాయుడు తన మిత్రుడైన ఓ లెక్చరర్ కు చెప్పడంతో ఆయన ఇంటికి వచ్చి చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. పురుషోత్తంనాయుడు, పద్మజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కరోనా అంతరించిపోతుందని… ఈ రోజుతో కలియుగం అంతమైందనీ, సత్యయుగం ప్రారంభమైందనీ ఆ తల్లిదండ్రులు చెబుతున్నారని చెప్పారన్నారు మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి. అంతేకాదు  తాము బలి ఇచ్చిన పిల్లలు కూడా తిరిగి వస్తారని చెబుతున్నట్లు వారు నమ్ముతున్నట్లు తెలిపారు.

తల్లిదండ్రులిద్దరూ బాగా చదవుకున్న వాళ్లే. పురుషోత్తం నాయుడు.. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్  ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య పద్మజ ఓ విద్యాసంస్థలో కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. పెద్దమ్మాయి అలేఖ్య భోపాల్ లో పీజీ చదువుతోంది. చిన్నమ్మాయి సాయిదివ్య బీబీఏ పూర్తిచేసి… ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్  రెహమాన్  మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.

Latest Updates