తల్లిదండ్రులు పనికి వెళ్లాక.. నలుగురు బిడ్డల్ని గొడ్డలితో నరికిన దుండగులు

వలస కూలీలుగా పొరుగు రాష్ట్రం వెళ్లిన కూలీల కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. కూలి పనుల కోసం తల్లిదండ్రులిద్దరూ బయటకు వెళ్లిన సమయంలో వారి పిల్లల్ని గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగింది. దీనిపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన మెహతాబ్, రుమాలీ భిలాలా దంపతులు ఉపాధి కోసం మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా బోర్ఖేడ గ్రామానికి వలస వెళ్లారు. అక్కడ ముస్తఫా అనే వ్యక్తికి చెందిన ఫామ్‌లోని ఒక చిన్న గదిలో ఉంటూ రోజూ పొలంలో పనులకు వెళ్లేవారు. వారికి సైతా (12), రావల్ (11), అనీల్ (8), సుమన్ (3) అనే నలుగురు పిల్లలు ఉన్నారు. వారిని ఇంట్లో వదిలేసి రోజూలానే శుక్రవారం ఉదయం కూడా పనిలోకి వెళ్లారు. అయితే అటుగా వెళ్లిన ముస్తఫా ఆ ఇంట్లో పిల్లలంతా రక్తపు మడుగులో పడి ఉండడం చూసి కొయ్యబారిపోయాడు. కొద్ది క్షణాల్లోనే తేరుకొని విషయం మెహతాబ్, రుమాలీలకు, పోలీసులకు తెలియజేశాడు. నలుగురు బిడ్డలను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులిద్దరూ గుండెలవిసేలా విలపించారు. అక్కడి చేరుకున్న పోలీసులు పిల్లల మృతదేహాల పక్కనే గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆ గొడ్డలితోనే పిల్లలను నరికి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, నలుగురు పిల్లల్ని దారుణంగా హత్య చేసిన వాళ్లను త్వరలోనే పట్టుకుని, కఠిన శిక్ష పడేలా చూస్తామని వారు చెప్పారు.

Latest Updates