కులాంతర వివాహం: నవదంపతులకు నిప్పంటించారు

ప్రేమించుకున్నారు…పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటు సంతోషంగా ఉన్నారు ఓ నవదంపతులు. అయితే రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు మాత్రం… వారిని ఆదరించాల్సింది పోయి… పగను పెంచుకున్నారు. అదును చూసి ఆ దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. భార్య చనిపోగా… భర్త మృత్యువుతో పోరాడుతున్నాడు. అత్యంత దారుణమైన ఘటన మహారాష్ట్రలో జరిగింది.

అహ్మద్‌నగర్ జిల్లా నిగోజ్‌ గ్రామానికి చెందిన మంగేష్ రాణ్ సింగ్, రుక్మిణిలు ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దల్ని ఎదురించిన ఈ ప్రేమ జంట ఆరు నెలల క్రితం వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు నవ దంపతులు. భార్యాభర్తలు చిన్న విషయంలో గొడవపడటంతో.. భర్తపై అలిగిన రుక్మిణి గత నెల 30న పుట్టింటికి వెళ్లింది.

రుక్మిణి పుట్టింటికి వెళ్లడంతో మంగేష్… భార్య రుక్మిణిని తిరిగి ఇంటికి తీసుకు రావడానికి.. ఈ నెల 1న అత్తారింటికి వెళ్లాడు. కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో ఉన్న రుక్మిణి కుటుంబ సభ్యులు.. మంగేష్‌ను చితకబాదారు. తర్వాత దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతూ భార్యాభర్తలు పెద్దగా కేకలు వేయడంతో.. విషయం తెలుసుకున్న స్థానికులు మంటలార్పారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు.

రుక్మిణి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి చనిపోయింది.. ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. మంగేష్ శరీరం 50 శాతం కాలిపోగా.. అతడి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. ఈ ఘటనపై రుక్మిణి తండ్రి రమా భర్టియాతో పాటూ మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. రుక్మిణి తండ్రి పరారీలో ఉండగా.. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates