గోవా టూర్లు.. సన్నబియ్యం సంచులు.. మద్యం టోకెన్లు

గోవా టూర్లు.. సన్నబియ్యం సంచులు.. మద్యం టోకెన్లు
    • మున్సిపోల్స్ ఓటర్లకు క్యాండిడేట్ల తాయిలాలు
    • మందు పంపకాల కోసం గ్రూపులు, స్పెషల్ టోకెన్లు
    • చికెన్​ ప్యాకెట్లు, పుల్లారెడ్డి స్వీట్లు
  • క్యాష్​ పంపిణీ కోసం ఏర్పాట్లన్నీ రెడీ!

(వెలుగు నెట్​వర్క్)

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో 18 వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఒక క్యాండిడేట్​ పోలింగ్ తర్వాత లోకల్​ యువకులను గోవా టూర్​కు పంపిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో వారు పగలంతా క్యాండిడేట్​తో ప్రచారంలో పాల్గొంటూ, రాత్రిళ్లు గోవా కలల్లో విహరిస్తున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలోని 31 వార్డులో ప్రధాన పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ఇంటింటికీ 25 కిలోల సన్నబియ్యం బ్యాగులు ఇవ్వగా, మరో అభ్యర్థి చీరలు పంచారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో దాదాపు ఇదే పరిస్థితి. పోలింగ్​కు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు క్యాండిడేట్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కొత్త ఆఫర్లతో ఓటర్లపై వల విసురుతున్నారు. మద్యం పంపకాల కోసం గ్రూపులు పెట్టి, స్పెషల్​టోకెన్లు పంపిణీ చేస్తున్నారు.

బాస్మతి రైస్, కేజీ చికెన్, కేజీ నూనె

సంక్రాంతి పండుగ రోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పలువురు క్యాండిడేట్లు ఓటర్లకు సరికొత్త పంపకాలు చేశారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 10 వార్డుల్లోని ప్రధాన పార్టీల క్యాండిడేట్లు ఇంటింటికీ కేజీ బాస్మతి బియ్యం ప్యాకెట్, కేజీ చికెన్, కేజీ నూనె పంపిణీ చేశారు. కొందరు రాత్రికి మందు బాటిళ్లు కూడా పంచారు. నాగర్ కర్నూల్​ పట్టణంలోని 3, 12,15,21,23 వార్డుల్లో ప్రధానపార్టీలకు చెందిన క్యాండిడేట్లు మందు, మటన్, చికెన్ ప్యాకెట్లు అందజేశారు. వెజిటేరియన్స్​ కోసం స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. కల్వకుర్తిలోని 9వ వార్డులో హాఫ్ బాటిల్ చొప్పున పంచారని స్థానికులు చెప్తున్నారు. ఇలా పండుగ రోజు ఏ కార్పొరేషన్ లో, ఏ మున్సిపాలిటీలో చూసినా ఇదే పరిస్థితి.

ఏదో ఒక తాయిలం ఇస్తూ..

సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్​నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు రెండు, మూడు రోజులుగా రోజూ ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నారు. ఆయా డివిజన్లలో మందుబాబులు రోజూ తాగి తిరుగుతుండటంతో స్థానికులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తూప్రాన్ మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఓ​ క్యాండిడేట్​ ఒక కుల సంఘం ఓటర్లకు గాలం వేస్తూ.. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఏకంగా రూ.8 లక్షలు ఇచ్చారు.

చొప్పదండి మున్సిపాలిటీలోని 12, 13వ వార్డుల్లో ప్రధాన పార్టీలకు చెందిన క్యాండిడేట్లు తమను గెలిపిస్తే వినాయకుడు, దుర్గాదేవి మండపాలకు సౌండ్​ బాక్సులు, షెడ్ల నిర్మాణం చేపడ్తమని హామీ ఇచ్చారు. 9, 12వ వార్డుల్లోని అభ్యర్థులు యువకులను గోవా, తిరుపతి టూర్లకు తీసుకెళ్తామని ఆఫర్​ ఇస్తున్నారు.

మంచిర్యాల మున్సిపాలిటీలోని 31 వార్డులో ప్రధాన పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ఇంటింటా చీరలు పంచితే, మరో అభ్యర్థి 25 కిలోల సన్న బియ్యం బ్యాగుల చొప్పున అందజేశారు. 13వ వార్డులో ఓ టీఆర్ఎస్​ అభ్యర్థి ఓ కుల సంఘం భవన నిర్మాణానికి పెద్ద మొత్తంలో ఆఫర్​ చేశాడు.

వరంగల్​ రూరల్ ​జిల్లా నర్సంపేటలో ప్రలోభాలు జోరుగా నడుస్తున్నాయి. ఇక్కడ అధికార పార్టీ లీడర్లు ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నారు. మందు, మటన్, మనీ పంపిణీ కోసం ప్రతి 100 ఇండ్లకు ఒక ఇన్​చార్జిని పెట్టారు. కులాల వారీగా, కాలనీల వారీగా వాటిని చేరవేస్తున్నారు. సంక్రాంతి రోజు 9వ డివిజన్ లో 400 బాక్సుల (200 కేజీల) స్వీట్ పంచారు. దాంతో పాటు మద్యాన్నీ పంపిణీ చేసినట్టు లోకల్​ లీడర్లు చెప్తున్నారు.

మెదక్  జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో అధికార పార్టీ అభ్యర్థి ఓ కుల సంఘం ఓట్లను పట్టేందుకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.8 లక్షలు ఇచ్చాడు. మెదక్​ మున్సిపాలిటీలోనూ ప్రధాన పార్టీ అభ్యర్థి ఓ వర్గం ఓట్ల కోసం వంట పాత్రలు ఇస్తానని మాట ఇచ్చాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని 1, 2 వార్డుల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఒక్కో ఓటుకు రూ.1,500 చొప్పున పంపిణీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నయి. జనగామ జిల్లా కేంద్రంలో ఓటు రేటు ఎక్కువగా ఉంది. ఇక్కడ రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున ఇస్తున్నారని చెప్తున్నారు.

మందు కోసం స్పెషల్​ టోకెన్లు

మద్యం పంపకాల్లో క్యాండిడేట్లు కొత్త పోకడ పోతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 11 వార్డు నుంచి పోటీచేస్తున్న ఒక క్యాండిడేట్​ ఓటర్లకు స్పెషల్​ టోకెన్లను అందజేశారు. ఆ టోకెన్​ ద్వారా ఈ నెల 22వ తేదీలోపు తాను సూచించిన వైన్​షాపులో రూ.3 వేల విలువైన మద్యాన్ని తెచ్చుకునే అవకాశం కల్పించాడు. ఇక ఇదే మున్సిపాలిటీలోని 6వ వార్డులో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి వార్డుల్లోని మద్యం ప్రియులకు రోజూ క్వార్టర్ కు టోకెన్​ ఇస్తున్నారు. కరీంనగర్​ కార్పొరేషన్​లోని వివిధ డివిజన్ల పరిధిలో 10 మంది ఓటర్లను కలిపి ఓ గ్రూప్​ చేశారు. వారికి రెండు, మూడు రోజుల నుంచి రోజూ దావత్​ ఇస్తున్నారు. చీకటి పడగానే ఫలానా చోట దావత్ ఉందని గ్రూప్​ లీడర్​కు ఫోన్​ చేసి చెబుతున్నారు.