సెమీస్‌ కి చేరిన కశ్యప్

ఇంచియాన్‌‌: ఇండియన్‌‌ వెటరన్‌‌ బ్యాడ్మింటన్‌‌ ప్లేయర్‌‌ పారుపల్లి కశ్యప్‌‌.. కొరియా ఓపెన్‌‌లో దూసుకుపోతున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌‌ క్వార్టర్స్‌‌లో కశ్యప్‌‌ 24–22 ,21–8తో వరల్డ్‌‌ మాజీ నం.2 జాన్‌‌ ఓ జోర్గెన్‌‌సెన్‌‌ (డెన్మార్క్‌‌)పై అలవోకగా గెలిచి సెమీస్‌‌లోకి అడుగుపెట్టాడు. 37 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్‌‌ పెట్టాడు.  తొలి గేమ్‌‌ ఆరంభంలో ఇరువురు షార్ట్‌‌ ర్యాలీలకు కట్టుబడటంతో  తొలి ఎనిమిది పాయింట్లను చెరిసగం పంచుకున్నారు. ఈ దశలో రెండుసార్లు బ్యాక్‌‌ హ్యాండ్‌‌ షాట్లు గురితప్పడంతో  కశ్యప్‌‌ 5–8తో వెనుకబడ్డాడు.  ఈ దశలో జోరు పెంచిన జోర్గెన్‌‌సెన్‌‌ వరుస పాయింట్లతో 11–8తో విరామానికి వెళ్లాడు. బ్రేక్‌‌ తర్వాత బలమైన బేస్‌‌లైన్‌‌ షాట్లతో పాటు పదునైన స్మాష్‌‌, క్రాస్‌‌కోర్టు విన్నర్లతో  చెలరేగిన కశ్యప్‌‌ 14–12తో ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. ఈ దశలో ఇరువురు హోరాహోరీగా పోరాడడంతో చాలాసార్లు స్కోర్లు సమమయ్యాయి. చివరకు తనకు లభించిన రెండోగేమ్‌‌ పాయింట్‌‌ను సద్వినియోగం చేసుకున్న కశ్యప్‌‌ 22 నిమిషాల్లో గేమ్‌‌ను సొంతం చేసుకున్నాడు. రెండోగేమ్‌‌లో దూకుడుగా ఆడిన కశ్యప్‌‌ 11–7తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. బ్రేక్‌‌ అనంతరం ఇండియన్‌‌ స్టార్‌‌ మరింత కచ్చితమైన షాట్లతో చెలరేగగా.. ప్రత్యర్థి అనవసర తప్పిదాలు చేశాడు. ఈ స్థితిలో పదిలో9 పాయింట్లు సాధించిన కశ్యప్‌‌ కళ్లు చెదిరే స్మాష్‌‌తో మ్యాచ్‌‌ను ముగించాడు.

 

Latest Updates