రాత్రి సమయాల్లో రైళ్లలో నో ఛార్జింగ్

రాత్రి సమయాల్లో రైళ్లలో నో ఛార్జింగ్

రైళ్ల‌లో అగ్ని ప్ర‌మాదాల నివార‌ణకు రైల్వేశాఖ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇకపై రాత్రివేళ ప్రయాణికులు రైల్లోని ఛార్జింగ్ పాయింట్లను వినియోగించి తమ మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్‌లను ఛార్జింగ్ చేసుకోకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో రైళ్లలో అగ్నిప్రమాదాలు జరుగుతున్న కారణంగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లలోని ఛార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ బంద్ చేయనున్నారు. డెహ్రాడూన్ వెళ్లే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల  షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది.

రాంచీలోను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదాల కారణంగా రైల్వేశాఖ షార్ట్ సర్క్యూట్‌లను నివారించేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది. నిజానికి రాత్రిపూట ఛార్జింగ్‌కు వీల్లేకుండా చేయాలని 2014లోనే రైల్వే భద్రత కమిషనర్‌ ఆదేశించారని సంబంధిత అధికారి తెలిపారు. దానిపై రైల్వేబోర్డు లేటెస్టుగా అన్ని జోన్లకు మరోసారి ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను అవసరానికి మించి ఛార్జింగ్‌ చేస్తుండడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.