పెన్షన్లు వద్దు మద్దతు ధర ఇవ్వండి..!

రూ.15 వేలు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటుకు డిమాండ్‌‌
మెట్ పల్లిలో ర్యాలీ, రాస్తారోకో
మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయాలె: రైతులు 

మెట్ పల్లి, వెలుగు: పసుపు పంటకు క్వింటాల్ కు రూ.15 వేలు మద్దతు ధర ఇవ్వాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేశారు. జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మెట్ పల్లి లో సోమవారం భారీ ర్యాలీ నిర్వ హించారు. వ్యవసాయ మార్కెట్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, శాస్త్రి చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ… మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 100 రకాల పంటలు పండిస్తే కేంద్రం కేవలం 26 పంటలకు మద్దతు ధర ప్రకటించడం దారుణమన్నారు. ఐదేండ్లుగా పసుపు ధర క్వింటాల్‌‌కు రూ.5వేల నుంచి రూ.6వేలు దాటడం లేదని వాపోయారు.

పెన్షన్లు వద్దు? మద్దతు ధర ఇవ్వండి… 

పసుపు పంటకు రూ.15 వేలు మద్దతు ధర కల్పిస్తే ప్రభుత్వాలు ఇచ్చే పింఛన్లు తమకు వద్దని చెప్పారు. తాము ప్రభుత్వాలను పెన్షన్లు అడగడం లేదని, తమ శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామన్నారు. ఏపీలో  క్వింటాల్ పసుపును రూ.6,840కి కొనుగోలు చేస్తున్నారని, రాష్ట్రంలోనూ అంతే ధర ఇవ్వాలని, మార్క్ ఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కరోనా ప్రభావంతో కోళ్ల పరిశ్రమ కుదేలై మక్కలు ఎవరూ కొనడం లేదని, ప్రభత్వం మార్క్ ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి డీఏవో కు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, నోముల గోపాల్‌‌రెడ్డి, కొమ్ముల ఆదిరెడ్డి, అన్వేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ ఎండీ గౌస్ బాబా ఆధ్వర్యంలో సీఐలు రవికుమార్, రాజశేఖర్ రాజు, ఎస్సైలు బందోబస్తు ఏర్పాటు చేశారు.

15 ఏళ్లుగా పోరాడుతున్నం

పసుపు కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర ప్రకటించాలని పదిహేనేళ్లుగా పోరాటం చేస్తున్నం. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. స్పైసెస్ బోర్డు రీజినల్ కార్యాలయంతో రైతులకు ఎలాంటి లాభం చేకూరదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రత్యేక బోర్డు, మద్దతు ధర హామీలను నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో తీవ్రతరం చేస్తం.  – బద్దం శ్రీనివాస్ రెడ్డి, రైతు సంఘం నాయకుడు.

Latest Updates