పతంజలి సరుకులు కొంటలేరు.. ఎందుకు?

భారీగా తగ్గుతున్న ఆదాయాలు
పడిపోతున్న అమ్మకాలు
డిస్ట్రిబ్యూషన్‌ సరిగ్గా లేదంటున్న రిటైలర్లు
 నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో ఇబ్బందులు

న్యూఢిల్లీ: యోగా గురువులు బాబా రామ్‌‌దేవ్‌‌, ఆచార్య బాలకృష్ణ అధీనంలోని పతంజలి ఆయుర్వేద గ్రూపు ఒకప్పుడు వెలుగు వెలిగింది.  2011–2017 మధ్య దీని ఆదాయం రూ.10 వేల కోట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది నుంచి మాత్రం ఆదాయాలు తగ్గుతున్నాయి. ఇది తయారు చేసే టూత్‌‌పేస్టు, సబ్బులు, పిండి, తేనె, నెయ్యికి విపరీతంగా గిరాకీ ఉండేది! పతంజలి ప్రొడక్ట్స్‌‌ను ప్రదర్శించేందుకు ఇటీవల వరకు రిటైలర్లు తమ షాపుల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించేవారు.  రానురాను పరిస్థితి మారింది. జనం పతంజలి బ్రాండ్​ వస్తువులకు దూరమవుతున్నారు. దీంతో సంస్థ ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారుతోంది. ఏటా ఆదాయాలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రూపు ఆదాయం 2.38 శాతం మాత్రమే పెరిగి రూ.8,330 కోట్లుగా నమోదయింది. అయితే 2017 ఆర్థిక సంవత్సరంలో దీనికి ఏకంగా రూ.10,561 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇది రూ.8,135 కోట్లకు పడిపోయింది.

ఎందుకిలా ?

ఏటా ఆదాయం ఎందుకు పడిపోతున్నది అనే ప్రశ్నకు రిటైలర్లు చెబుతున్న జవాబు ఏమిటంటే.. పతంజలి వస్తువులకు గిరాకీ తగ్గిపోతోంది. ఏవో రెండు ప్రొడక్ట్స్‌‌ తప్ప మిగతావి అమ్ముడుపోవడం లేదు. ఒకప్పుడు హెచ్‌‌యూఎల్‌‌, డాబర్‌‌, ఐటీసీ వంటి కంపెనీలను వణికించిన పతంజలి.. ఇప్పుడు వాటితో పోటీ పడలేకపోతోంది. దంత్‌‌కాంతి పేస్టు అమ్మకాలు పెరగడంతో మిగతా ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీలు కూడా ఆయుర్వేద పేస్టులను తీసుకురావడం తప్పనిసరి అయింది. అయితే ఇప్పుడు దంత్‌‌కాంతి పేస్టు, నెయ్యి మిగతా పతంజలి ప్రొడక్ట్స్‌‌ అమ్ముడుపోవడం లేదని షాపుల యజమానులు చెబుతున్నారు.

ఈ విషయమై ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ తమ సప్లై చెయిన్‌‌, డిస్ట్రిబ్యూషన్‌‌ నెట్‌‌వర్క్‌‌ను మరింత చేయాల్సి ఉందని, లేకపోతే గ్రోత్‌‌ టార్గెట్స్‌‌ను చేరుకోలేమని అంగీకరించారు. అయితే కంపెనీ నెమ్మదించడానికి నోట్లరద్దు, జీఎస్టీ కూడా కారణాలేనని విమర్శించారు. బాబా రామ్‌‌దేవ్‌‌ గురించి తెలిసిన వారు మొదట్లో తమ ప్రొడక్టులను బాగా కొనడం వల్ల అప్పట్లో ఆదాయాలు బాగున్నాయని, ఇతర వినియోగదారులు కూడా పతంజలి వస్తువులు కొనేలా చేయాలన్నారు. ‘‘పతంజలి అమ్మకాలు గత ఏడాది నుంచి 50 శాతం పడిపోయాయి. పతంజలి వస్తువుల స్టాక్ అయిపోగానే, కొత్తవి వాళ్లు అందివ్వలేకపోతున్నారు. దీనివల్ల కస్టమర్‌‌ వేరే ప్రొడక్టువైపుకు వెళ్తున్నాడు’’ అని ఒక రిటైల్‌‌ చైన్‌‌ మేనేజర్‌‌ అన్నారు. పతంజలి ఎక్స్‌‌క్లూజివ్‌‌ స్టోర్లు కూడా క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. పతంజలి డిస్ట్రిబ్యూషన్‌‌ సరిగ్గా లేకపోవడం ఒక సమస్య అయితే, వీటి ప్రొడక్ట్స్‌‌ నాణ్యతపై పలుసార్లు ఫిర్యాదులు వచ్చాయి.

మరిన్ని వార్తలు

Latest Updates