దొంగచాటుగా తాళికట్టి.. పెళ్లికి నిరాకరించిన  ప్రియుడ్ని చంపిన ప్రియురాలి అరెస్టు

పశ్చిమ గోదావరి జిల్లా: ప్రేమిస్తున్నానని వెంటపడి.. నమ్నించేందుకు దొంగచాటుగా తాళికట్టి.. అవసరం తీరాక మొహం చాటేసిన ప్రియుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు పావనిని పోలీసులు అరెస్టు చేశారు. కాపవరం-ధర్మవరం మార్గంలో సోమవారం రాత్రి తన ప్రియుడ్ని చంపిన ఘటన సంచలనం రేపింది. రెండేళ్లుగా మొహం చాటేస్తున్న ప్రియుడితో వాగ్వాదం చేసి విసిగిపోయి.. చివరకు పథకం ప్రకారం చంపినట్లు నిందితురాలు పోలీసుల విచారణలో వెల్లడించింది. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన పావని టెన్త్ అయిపోయాక తాడేపల్లిగూడెంలో ఇంటర్మీడియట్ చేరింది. అప్పటి నుండే పావనితో పరిచయం కోసం వెంటపడిన తాతాజీనాయుడు ఇంటర్ ముగిశాక కొవ్వూరులోని ఏబీఎన్ అండ్ పీఆర్ఆర్ కాలేజీలో డిగ్రీలో చేరినా వదలలేదు. ప్రేమిస్తున్నాని వలలో వేసుకుని ఆ తర్వాత వేరే కులం కావడంతో తమ పెద్దలు ఒప్పుకోరని మొహం చాటేయడం ప్రారంభించడం అతని హత్యకు దారితీసింది.

రెండేళ్లుగా అడుగుతున్నా మారలేదు.. నా లాంటి వారు మోసపోకూడదనే చంపేశా-పావని

‘‘ప్రేమిస్తున్నానని వెంటపడితే నమ్మలేదని దొంగచాటుగా తాళి కట్టి.. బహిరంగంగా అందరిముందు పెళ్లి చేసుకుందామంటే అదిగో ఇదిగో అంటూ దాట వేస్తున్నాడని.. రెండేళ్లయినా మార్పు రాకపోగా మోజు తీరింది కాబట్టి పెళ్లి చేసుకునే ఉద్దేశం మానుకుని.. దూరం పెట్టేందుకు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సహించలేకపోయానని’’ పావని విలపిస్తూ చెప్పింది. కత్తి కొన్నాక కూడా మారతాడేమోనని చివరి నిమిషం వరకు ఓపిగ్గా ఎంతో ఆశతో ఎదురు చూశానని.. తనను ఎలాగైనా వదిలించుకుని మరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తేలడంతో.. తనలాంటి వారిని మోసం చేయకుండా గుణపాఠం నేర్పాలనుకుని చంపేశానని చెప్పినట్లు పోలీసుల కథనం. అదేకత్తితో తాను పొడుచుకుని చనిపోవాలనుకుంటే పాదచారులు వారించడంతో చివరకు పోలీసుల దగ్గరకు వెళ్లి లొంగిపోయింది. హత్య ఆలోచన రాకముందు..  సోషల్ మీడియాలో తన గురించి అతను చేస్తున్న ప్రచారం భరించలేక పావని కాలేజీకి వెళ్లడం మానుకుని స్వగ్రామమైన మలకపల్లికి వెళ్లిపోయింది. అయితే సోమవారం తాతాజీనాయుడు ఒకసారి మాట్లాడదాం రమ్మంటూ ఫోన్ చేయడంతో అతని కోసం ఐ.పంగిడి జంక్షన్ కు వెళ్లిన పావనికి నిరాశే మిగిలింది. ఎంత ప్రాథేయపడినా.. తన వద్ద ఉన్న ఆధారాలతో కేసు పెడతానని బెదిరించినా మన కులాలు వేరు.. విడిపోవడం మంచిదని తెగేసి చెప్పేశాడు. దీంతో అతనిబైకుపైనే వెనుక కూర్చుని ఇంటికి వచ్చేటప్పుడు కూడా వాగ్వాదం చేసింది. మాటామాటా పెరగడంతో ధర్మవరం గ్రామ శివార్లలో హ్యాండ్ బ్యాగులో నుండి కత్తి తీసి తాతాజీ నాయుడు మెడపై పొడిచింది. రక్తగాయాలతో బైకుపై నుండి కందపడిన తర్వాత కూడా అతనిలో మార్పు రాకపోవడంతో పావని కత్తితో కసిదీరా పొడిచేసింది. ఆ తర్వాత తాను కూడా అదేకత్తితో పొడుచుకుని చనిపోయేందుకు ప్రయత్నించగా దారినపోయేవారు గుర్తించి వారించారు. రక్తగాయాలతో పడిపోయిన తాతాజీనాయుడు చనిపోవడంతో ఆమె స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి హత్య గురించి తెలియజేసింది. తాతాజీనాయుడు ఫోన్ తీసుకుని.. వారి తల్లిదండ్రులకు కూడా పావని ఫోన్ చేసి తానే చంపేసినట్లు చెప్పిందని స్థానికుల సమాచారం. ప్రేమిస్తున్నాని వెంటపడి తీయగా మాట్లాడితే నమ్మి చివరకు మోసపోయిన తన జీవితం మరొకరికి గుణపాఠం కావాలంటూ ఆమె స్వయంగా పోలీసుల దగ్గరకు వెళ్లి లొంగిపోయింది. పావనిని హత్య కేసు కింద అరెస్టు చేసి.. పూర్వ పరాల గురించి విచారణ చేస్తున్నట్లు రూరల్ ఎస్.ఐ కె.రామకృష్ణ  ప్రకటించారు.

ఇవీ చదవండి

వాట్సప్ కొత్త పాలసీతో ఊపందుకున్నసిగ్నల్, టెలిగ్రామ్

పక్షుల సేఫ్టీ కోసం ఈ కైట్స్ ను వాడండి

బ్రౌన్‌ రైస్‌.. వైట్‌రైస్‌ ఏది మంచిది?

Latest Updates