జగన్ సర్కారును కూల్చేదాకా నిద్రపోను

అమరావతి కోసమే బీజేపీతో పొత్తు: పవన్

అమరావతి, వెలుగు:  ఏపీలో జగన్ రెడ్డి సర్కారును కూల్చే వరకు నిద్రపోనని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని మహిళలపై లాఠీ చార్జ్ చేయించిన అధికార పార్టీ మనుగడ లేకుండా పోతుందని విమర్శించారు. అమరావతి రైతులపై దాడితోనే వైసీపీ సర్కారు పతనం మొదలైందన్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లి రాజధాని తరలింపుపై కేంద్రంలోని పెద్దలకు వివరిస్తానన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించేలా చూస్తామన్న హామీతోనే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో అమరావతి రైతులతో పవన్ భేటీ అయ్యారు. లాఠీచార్జ్ లో గాయపడిన మహిళా రైతులను పవన్ పరామర్శించారు. రాజధాని గ్రామాల్లో పరిస్థితిపై రైతులను అడిగి తెలుసుకున్నారు.

తర్వాత పవన్ మాట్లాడుతూ..  రాజధానిని తరలించిన ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రైతులకు తగిలిన ప్రతి దెబ్బ వైసీపీ సర్వనాశనానికి దారి తీస్తుందని చెప్పారు. మాటలు రాని ఓ రైతును కూడా పోలీసులు చావబాదారని, కనికరం లేకుండా కొట్టారని మండిపడ్డారు. పోలీసుల ముసుగులో రౌడీలు రాజధాని రైతులను కొట్టారని ఆరోపించారు. మహిళలపై లాఠీఛార్జ్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, పోలీసులు కొట్టిన దెబ్బలు చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని పవన్ అన్నారు. విశాఖలో ఫ్యాక్షన్ దందాలు చేసేందుకు రాజధానిని తరలిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు అమరావతిలో భూములు ఉండి ఉంటే రాజధాని మార్చేవాళ్లా  అని ప్రశ్నించారు. ఇవాళ అమరావతిని మోసం చేసిన జగన్ రెడ్డి రేపు విశాఖ, కడప ప్రజలను కూడా మోసం చేస్తారని అన్నారు.

see also:ఏమైనా చేస్కోండి సీఏఏ ఉంటది

Latest Updates