నా మూడు పెళ్లిళ్ల వల్లేనా మీరు జైలుకెళ్లింది: జగన్‌పై పవన్ ఫైర్

‘నేను చేసుకున్న మూడు పెళ్లిళ్ల వల్లేనా మీరు జైలుకెళ్లింది? విజయ సాయి రెడ్డి సూట్ కేస్ కంపెనీలు పెట్టడానికి కారణం కూడా అదేనా? ఆయన, మీరు రెండేళ్లు జైలులో ఉంది అందువల్లేనా?’ అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.

‘మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్ తన పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారు? ఇంగ్లిష్ మీడియంలోనా? తెలుగు మీడియంలోనా? పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోకూడాదా?’ అని వైఎస్ జగన్ జాతీయ విద్యా దినోత్సవం నాడు జరిగిన సభలో వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా పవన్ ఇవాళ తన పెళ్లిళ్ల వల్లేనా జగన్ జైలుకెళ్లింది అంటూ ప్రశ్నించారు. ‘ఎవరొద్దన్నారు.. మీరు కూడా చేసుకోండి’ అని అన్నారు. తనకు కుదరకే అన్ని పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఊరికే రెచ్చిపోవద్దని హెచ్చరించారు పవన్. శివుడి మెడలో ఉంటేనే పాముకు విలువ ఉన్నట్లు..  జగన్ ఉన్నంత కాలమే ఎమ్మెల్యేలకు విలువ అని చెప్పారాయన.

జనసేన అంటే ప్రభుత్వానికి భయం

ప్రభుత్వం తమ పార్టీని చూసి భయపడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాము నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తున్నా.. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఐఏఎస్‌ల కమిటీ వేసి సమస్యలపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చామని చెప్పారాయన. పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఇసుక ఎలా తవ్వాలన్న దానిపైనా అందులో వివరించామన్నారు. కానీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం మానేసి తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు పవన్. తాము లాంగ్ మార్చ్ చేస్తే లక్షల మంది జనం వస్తున్నారని, దీన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఈ ప్రభుత్వం అన్ని పనులు ఎతిమతంగా చేస్తోందని విమర్శించారు. ఇసుక పాలసీ తెస్తే ప్రజలు 4 నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు చనిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. అలాగే ఇంగ్లిష్ మీడియం పెట్టడంపైనా తాము వద్దనడం లేదని, దానికో హేతుబద్ధత ఉండాలని అన్నారు. టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వకుండా ఒకేసారి మార్చడం సరికాదని సూచించారు. ప్రాథమిక విద్య మాతృ భాషలోనే బోధించాలన్నారు.

Latest Updates