పవన్‌ హన్స్‌ డీల్‌‌: 43 హెలికాప్టర్లు .. 718 మంది ఉద్యోగులు

నూరు శాతం వాటా అమ్మకం
43 హెలికాప్టర్లు .. 718 మంది ఉద్యోగులు
2018–19 రెవెన్యూరూ. 410 కోట్లు
కొత్త ప్రభుత్వం వచ్చాక ఇదే తొలి డిజిన్వెస్ట్ మెంట్‌ డీల్

ఎవరూ ముందుకు రాకపోవడంతో పవన్‌‌ హన్స్‌‌ డీల్‌‌ ను మరింత స్వీట్‌‌గా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఉద్యోగులను తీసివేయడం, ఆస్తుల అమ్మకం, పన్ను బాధ్యతల నిబంధనలలో మార్పులను చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. తాజా నిబంధనల ప్రకారం బిడ్డరు పర్మినెంట్‌‌ ఉద్యోగులను ఏడాదిపాటు కొనసాగిస్తే చాలు. ఇంతకు ముందు ఇది రెండేళ్లుగా ఉండేది. కొనసాగుతున్న పన్ను వివాదంలో తీర్పు పవన్‌‌ హన్స్‌‌కు వ్యతిరేకంగా వస్తే, బిడ్డరు నష్టపోవల్సిన అవసరం లేకుండా, ఆ మొత్తానికి హామీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ఆస్తులను రెండేళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటును బిడ్డర్‌‌కు కల్పించనున్నారు. గతంలోని నిబంధనల ప్రకారం ఈ గడువు మూడేళ్లు. తాజా మార్పులతో పవన్‌‌ హన్స్‌‌ నిర్వహణ బిడ్డర్లకు మరింత సులభసాధ్యం చేస్తుందని భావిస్తున్నారు.

హెలికాప్టర్‌‌ సర్వీసులు అందిస్తున్న పవన్‌‌ హన్స్‌‌ను ప్రైవేటుకి అప్పచెప్పాలని కిందటేడాదే ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది. పవన్‌‌ హన్స్‌‌లో కేంద్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా, ఓఎన్‌‌జీసీకి 49 శాతం వాటా ఉన్నాయి. పవన్‌‌ హన్స్‌‌ చేతిలో మొత్తం 43 హెలికాప్టర్లున్నాయి. బిడ్డర్లు ఎవరూ ఏడాదిగా ముందుకు రాకపోవడంతో డీల్‌‌ను మరింత స్వీట్‌‌గా తయారు చేయాలని కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసమే కీలకమైన నిబంధనలను మార్చారు. ఏప్రిల్‌‌ 30, 2019 నాటికి పవన్‌‌ హన్స్‌‌కు 718 ఉద్యోగులు, ఇందులో 415 మంది రెగ్యులర్‌‌, 303 మంది కాంట్రాక్ట్‌‌ ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులలో 116 మంది పైలట్లు, 101 మంది ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌ ఇంజినీర్లు, 52 మంది ఎగ్జిక్యూటివ్‌‌లు, 157 మంది టెక్నీషియన్స్‌‌, 292 మంది టెక్నికల్‌‌, నాన్‌‌ టెక్నికల్‌‌ ఉద్యోగులూ ఉన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో పవన్‌‌ హన్స్‌‌ రూ. 410 కోట్ల టర్నోవర్‌‌ సాధించగా, ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు రూ. 180 కోట్లు.

ఈఓఐలకు ఆగస్టు 22 గడువు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాలంటరీ రిటైర్‌‌మెంట్‌‌ స్కీము (వీఆర్‌‌ఎస్‌‌) ప్రకటించే వీలు కొత్త నిబంధనల ప్రకారం బిడ్డర్లకు ఉంటుంది. డీల్‌‌ ట్రాన్సాక్షన్‌‌ ముగిసిన రెండేళ్ల తర్వాత కంపెనీ ఆస్తులను అమ్ముకోవడానికి, బదిలీ చేయడానికి బిడ్డర్లకు అవకాశం కల్పిస్తున్నారు. కనీసం రూ. 350 కోట్ల నెట్‌‌వర్త్‌‌ ఉన్న బిడ్డర్ల నుంచి ఈ ఏడాది జూలై 11 న తాజాగా బిడ్‌‌లు పిలిచారు. ఎక్స్‌‌ప్రెషన్‌‌ ఆఫ్‌‌ ఇంటరెస్ట్‌‌ (ఈఓఐ) దాఖలుకు ఆగస్టు 22 కాగా, షార్ట్‌‌ లిస్టయిన బిడ్డర్లకు సెప్టెంబర్ 12 న సమాచారం ఇస్తారు. పవన్‌‌ హన్స్‌‌ డీల్‌‌ విజయవంతమైతే ప్రభుత్వానికి ఈ డిజిన్వెస్ట్‌‌మెంట్‌‌ ద్వారా డబ్బులు వస్తాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రైవేటైజేషన్‌‌లో ఇదే మొదటి డీల్‌‌. డిజిన్వెస్ట్‌‌మెంట్‌‌ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని బడ్జెట్లో లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. కిందటేడాది డిజిన్వెస్ట్‌‌మెంట్‌‌ లక్ష్యం రూ. 85 వేల కోట్లు మాత్రమే. పవన్ హన్స్‌‌ నుంచి ప్రభుత్వంతోపాటే  వైదొలగడం  తమకు అంగీకారమేనని ఓఎన్‌‌జీసీ జూలై 2018 లో కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. దాంతో నూరు శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది.

Latest Updates