మాయావతి ప్రధాని కావాలని కోరుకుంటున్నా: పవన్

విశాఖపట్నం : BSP అధినేత్రి మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలన్నది తమ కోరిక అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్, మాయావతి కలిసి విశాఖపట్నంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

దళిత సాన్నిహిత్యం ఉన్నవారితో కలసి పని చేయడానికి 2008 అవకాశం వచ్చిందనీ… ఐతే.. అప్పుడు కుదరలేదని … ఇవాళ 2019 లో కుదిరిందని చెప్పారు పవన్ కల్యాణ్. “తెలంగాణలో దళితుడు సీఎం చేయాలన్న ఉద్దేశంతో ఉద్యమం మొదలైంది. కానీ అది జరగలేదు. భారతదేశంలో బలమైన మరో జాతీయ పార్టీ BSP. ఒక చాయ్ వాలా ప్రధాని అయినప్పుడు బడుగు బలహీన వర్గాల తరపున పోరాడుతున్న మహిళ కూడా పీఎం అవుతుంది. మాయావతి ఒక ఒంటరి మహిళగా ఎన్నో పోరాటాలు చేశారు. కష్టాలు ఇబ్బందులు పడినా… ఆమె తన విధానాలు వదల్లేదు. అందుకే ఆమె ప్రధాని కావాలని కోరుకుంటున్నాం”  అని పవన్ కల్యాణ్ చెప్పారు.

మా కూటమి సక్సెస్ అవుతుంది : మాయావతి

ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు చేసిందేమీ లేదన్నారు మాయావతి.  “70 ఏళ్లుగా ఆంద్ర, తెలంగాణను కాంగ్రెస్ పట్టించుకోలేదు. అభివృద్ధి జరగకపోవడం వల్లే విభజన సమస్య వచ్చింది.  విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగింది. హోదా పేరుతో ఓట్లు దక్కించుకుని రాజకీయం చేశారు. ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకెళ్తున్నాం. ఏపీలో మా కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణే సీఎం. మా కూటమి సక్సెస్ అవుతుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం. తెలుగు రాష్ట్రాల్లో దళితులు ఓటుతో శాసిస్తారు. పవన్ లాంటి యువనాయకత్వం రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. హామీలు నెరవేర్చలేదు కాబట్టే.. ఢిల్లీ పీఠానికి కాంగ్రెస్ దూరమైంది. మోడీ ప్రభుత్వం కూడా హామీలు నెరవేర్చడం లేదు” అన్నారు మాయావతి.

Latest Updates