చంద్రబాబు పక్కన అవినీతి.. జగన్ పక్కన రౌడీలు: పవన్

ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే అవినీతి రాజ్యం వస్తుందని. అలాగే జగన్ అధికారంలోకి వస్తే గుండా రాజ్యం నడుస్తదని అన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. విశాఖ పట్నం లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకుల గుండెల్లో జనసేన రైళ్లు పరిగెత్తిస్తుందని చెప్పారు. ఇటు చంద్రబాబు, అటు జగన్ మనుషులు ఇష్టానుసారంగా భూ కబ్జాలు చేస్తున్నారని చెప్పారు. ప్రతీ సారి తనను నటుడు అని విమర్శిస్తున్న జగన్.. అలీని ఎందుకు పార్టీలోకి తీసుకున్నారని ప్రశ్నించారు.

సీబీఐ మాజీ జేడీ.. లక్ష్మీనారాయణ, తాను అవినీతిని అంతం చేసే మిత్రులం అని పవన్ అన్నారు. ఆంధ్రాలో అభివృద్ధి జరగాలన్నా, యువకులకు ఉద్యోగాలు రావాలన్నా.. ప్రత్యేక హోదా తప్పనిసరి రావాలన్నారు. జగన్ కు ప్రధాని మోడీ, అమిత్ షా అన్నా భయం అని చెప్పారు. గతఎన్నికలలో విశాఖ పట్నం నార్త్ నుంచి 2014లో ఎమ్మెల్యే గా గెలిచిన విష్ణు కుమార్ రాజు..  తాను ప్రచారం చేయక పోతే ఎన్నికలలో గెలువలేనన్నారని పవన్ చెప్పారు.

విశాఖ పట్నంలో భూకబ్జాలు ఎక్కువయ్యాయి కాబట్టే వాటిని అరికట్టడానికి మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైజాగ్ నుండి బరిలో దిగారని చెప్పారు పవన్. దళితులపై ప్రేమ ఉన్నట్లు జగన్ నటిస్తారని.. నిజానికి పులివెందులకు దళితులు వెళ్లాలంటే చెప్పులు తీసి వెళ్లాలని అన్నారు. చంద్రబాబు పక్కన అవినీతి గంటా…జగన్ పక్కన రౌడీలు ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో గంటా ‘గంట’ మోగకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు పవన్.

జనం కోసమే జనసేన పుట్టిందని పవన్ చెప్పారు. పవన్ అంటే ఒక మనిషి కాదని ఒక వ్యవస్థ అని అన్నారు.  మార్పు వచ్చేటప్పుడు ఎవ్వరికీ తెలియదు. జేడీ గారు ఎం.పి అవ్వడం ఖాయం. గంటా ఓడిపోవడం ఖాయం….టీడీపీ,వైసీపీ పార్టీలు దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి కాని జనసేన కు ఓటు వేయండని పవన్ అన్నారు.

Latest Updates