పనిభారంలో వీఆర్ఏలు.. అమలు కాని పే స్కేల్

పనిభారంలో వీఆర్ఏలు.. అమలు కాని పే స్కేల్

‘రాష్ట్రంలోని వీఆర్ఏలలో 90 శాతం వరకు దళితులు, బీసీలు, గిరిజనులే ఉన్నారు. వాళ్లు తరతరాలుగా మస్కూరిలుగా, వేరే పేర్ల మీద సమాజానికి సేవ చేశారు. వారందరికీ పే స్కేల్ పోస్టులు ఇస్తాం. ఆప్షన్లు కూడా ఇస్తాం. రెవెన్యూలో ఉండేవాళ్లు కొందరు ఉంటరు. దీని వల్ల సర్కారుపై ఏడాదికి దాదాపు రూ.260 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది.  అయినా వాళ్ల కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ల పిల్లలు బాగుపడతారు అనే ఉద్దేశంతో స్కేల్ పోస్టులు ఇస్తాం. ఒకట్రెండు నెలల్లోనే ఈ సర్దుబాట్లు చేస్తాం’ అసెంబ్లీలో గతేడాది సెప్టెంబర్ ​11న సీఎం కేసీఆర్​ చేసిన ప్రకటన ఇది. దీంతో వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్​ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి ఆనందం వ్యక్తం చేశారు. అయితే నాలుగు నెలల్లోపే అమలు చేస్తామని చెప్పిన హామీకి 14 నెలలు దాటినా దిక్కు లేకుండా పోయింది. 

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో నెల రోజుల్లోపే ముగ్గురు విలేజ్​ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్ఏ) లు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్​ జిల్లాలో ఒకరు, కామారెడ్డి జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొక వీఆర్ఏ సూసైడ్ చేసుకున్నారు. పొద్దంతా కష్టపడుతున్నా రూ.10 వేల జీతం కూడా పూర్తిగా చేతికి రాకపోవడం, పార్ట్ టైమర్లుగా రిక్రూట్ అయినా ఫుల్ టైమర్ల కంటే ఎక్కువగా పని చేయించుకోవడం, వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత గ్రామాల్లో రెవెన్యూ పనిభారం కాస్తా వీఆర్ఏలపై పడడం, అరగంట ఆలస్యంగా డ్యూటీకి వచ్చారన్న కారణంతో ఆ రోజు శాలరీని తహసీల్దార్లు కట్ చేయడం.. ఇలా రకరకాల కారణాలతో వీఆర్ఏలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలయితే తమ జీవితాల్లో మార్పు వస్తుందని ఆశపడ్డారు. కానీ.. ఏడాది నుంచి పెండింగ్ పడడంతో ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా లాభం లేకపోవడంతో ఆయా జిల్లాల్లో కలెక్టరేట్​ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పని జరిగేలా చూడాలంటూ ఆఫీసర్లను రిక్వెస్ట్ చేస్తున్నారు. 

23 వేల మంది వీఆర్ఏలు..
రాష్ట్రంలో సుమారు 23 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 2,900 మంది 2012, 2014లో ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్​గా రిక్రూట్ కాగా, దాదాపు 20,100 మంది వారసత్వంగా నియామకం అయిన వారున్నారు. వీళ్లంతా ఇప్పుడు రూ.10,450 వేతనంతో పనిచేస్తున్నారు. గతేడాది వీఆర్వో వ్యవస్థ రద్దు సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ వీఆర్ఏలు అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. కానీ 14 నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు అలాంటి చర్యలు కనిపించడం లేదని 
వీఆర్ఏల అసోసియేషన్​ నేతలు చెబుతున్నారు. 

అన్ని పనులకు వాళ్లే..
వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో ఊర్లలో వీఆర్ఏలపై పనిభారం పెరిగింది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, గ్రామ స్థాయిలో ఆ నిర్ణయాల అమలు విషయంలో వీఆర్ఏలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఊర్లలో ఏ పని అయినా తహసీల్దార్లు వీఆర్ఏలకే అప్పగిస్తున్నారు. ధరణికి సంబంధించిన పీఓబీలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​పై ఫీల్డ్​ఎంక్వైరీలు, ఇసుక రవాణా అరికట్టడం, కరోనాకు సంబంధించి వ్యాక్సినేషన్​లో వారి సేవలను వినియోగించుకుంటున్నారు. వీఆర్ఏలలో బీటెక్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ చదివినవారు కూడా ఉన్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబం గడవక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక బాధపడుతున్నామని వీఆర్ఏలు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్​ వీఆర్ఏ సల్ల రమేశ్​ (42), నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం పెగడపల్లి వీఆర్ఏ హర్షవర్ధన్(27) ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులతో పాటు పే స్కేల్ అమలు చేయడం లేదన్న మానసిక వేదనే కారణమని ఆ సంఘం నేతలు చెబుతున్నారు. యాదాద్రి జిల్లాలో సర్వేల్​వీఆర్ఏ సంతోశ్​కుమార్​(32) చనిపోయారు.  

కుట్ర ప్రకారమే నిర్వీర్యం చేస్తున్నరు
రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ప్రకారమే రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్​ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్​ఆరోపించారు. వీఆర్వోలకు 14 నెలల నుంచి జాబ్​చార్ట్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని, 15 రోజుల్లోనే ఇద్దరు వీఆర్ఏలు పే స్కేల్ కోసం ప్రాణాలు తీసుకున్నారన్నారు. అరకొర జీతంతో ఊర్లలో వీఆర్ఏలతో 30 రకాల పనులు చేయించుకోవడం నిలువుదోపిడీ కాదా అని ట్విట్టర్​లో ప్రశ్నించారు.