
హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన పేమెంట్స్ సేవల సంస్థ పేపాల్ ఇండియాలో తన మూడో టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లో మంగళవారం ఆరంభించింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. మనదేశంలో పేపాల్‌కు ఇది వరకే చెన్నై, బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రారంభించినది మూడోది. ఇక్కడ వంద మంది పనిచేస్తారు. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు సైబర్ దాడుల బారినపడకుండా నిరోధించడానికి ఈ కేంద్రం పనిచేస్తుందని పేపాల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ (ఇంజనీరింగ్) గురుభట్ వెల్లడించారు. డేటా సైన్స్, రిస్క్ మేనేజ్మెంట్, మెషీన్ లెర్నింగ్‌లో తమకు ఉన్న నైపుణ్యాలను ఇందుకు ఉపయోగిస్తామన్నారు.
వ్యాపార సంస్థలను డిజిటైజేషన్వైపు మళ్లించడం, డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా ఉండాలన్న ఆర్బీఐ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని ప్రకటించారు. కస్టమర్ల సమాచారాన్ని నిల్వ చేసే డేటా సెంటర్‌ను ఇండియాలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. పేపాల్ మరో ఉన్నతాధికారి తుషార్ షా మాట్లాడుతూ బహుళజాతి కంపెనీలకు, స్టార్టప్‌లకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, ఇక్కడ తగినంత మంది ఐటీ నిపుణులు ఉన్నందున టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నామని చెప్పారు. టీ–హబ్, టీ–బ్రిడ్జ్ వంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఐటీ, టెక్నాలజీ కంపెనీలను ఎంతగానో ప్రోత్సహిస్తోందని అన్నారు. పేపాల్ 200లకుపైగా దేశాల్లో సేవలు అందిస్తున్నది. 100కుపైగా కరెన్సీల్లో నగదును పంపవచ్చు. తీసుకోవచ్చు.
పేపాల్‌తో తెలంగాణకు ప్రయోజనం
ఈ సందర్భంగా జయేశ్ రంజన్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణవాసుల్లో చాలా మంది దుబాయి, అమెరికా వంటి దేశాల నుంచి తమ కుటుంబాలకు డబ్బు పంపుకోవడానికి పేపాల్ సేవలను ఉపయోగించుకోవచ్చని అన్నారు. సురక్షితంగా డబ్బు పంపేందుకు, పొందేందుకు ఇది అనువుగా ఉంటుందని చెప్పారు.