అప్పుడు లక్ష.. ఇప్పుడు 4,600

pc-jewellers-share-price-down

పీసీ జూయలరీ బంగారంలాగా మెరవాల్సింది పోయి… ఇన్వెస్టర్లకు కన్నీరే మిగిల్చింది. ఈ స్మాల్ క్యాప్ స్టాక్‌‌… ఆల్‌‌ టైమ్ కనిష్టానికి పడిపోయింది. గతేడాది జనవరి నుంచి భారీగా కుదేలైంది. 2018 జనవరి 17న రూ.586.75గా ఉన్న పీసీ జూయలరీ స్టాక్.. గురువారానికి రూ.27కు పడిపోయింది. పీసీ జూయలరీ ఇన్వెస్టర్లు కూడా గతేడాది నుంచి రూ.22,014 కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. ప్రస్తుతం పీసీ జూయలరీ మార్కెట్ క్యాప్‌‌ రూ.1,120 కోట్లకు దిగొచ్చింది. గతేడాది జనవరి17న పీసీ జూయలరీలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. ఈ మొత్తం నేటికి రూ.4,600 అయింది. అంటే ఈ ఏడాదిలో పీసీ జూయలరీ షేరు ధర 70.48 శాతం వరకు నష్టపోయింది.

పతనం ఎప్పడు మొదలైందంటే…

పీసీ జూయలరీ షేరు ధర గతేడాది ఫిబ్రవరి రెండు నుంచి పతనమయింది. స్టాక్ మార్కెట్‌‌లో వక్రంగీ అక్రమాలకు పాల్పడిందనే వార్తలు రావడంతో, సెబీ దీనిపై విచారణ చేపట్టింది. దీంతో అప్పటి నుంచి పీసీ జూయలరీ షేర్లు పడిపోతూ వస్తున్నాయి. పీసీ జూయలరీలో వక్రంగీ 20 లక్షల షేర్లను రూ.112 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పీసీ జూయలరీలో 0.51 శాతం వాటాలు వక్రంగీకి వచ్చాయి. వక్రంగీ ముంబైకి చెందిన టెక్నాలజీ కంపెనీ. ఇది బ్యాంకింగ్,ఇన్సూరెన్స్,ఈ–గవర్నెన్స్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్ సర్వీసులను ఆఫర్ చేస్తుంది. అయితే తమపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని వక్రంగీ కొట్టిపారేసింది. వక్రంగీ అవకతవకల ఎఫెక్ట్‌‌తో పాటు పీసీ జూయలరీ ప్రమోటర్ పదమ్ చంద్ గుప్తా తన వాటాలో కొంత భాగాన్ని ఫ్యామిలీ మెంబర్లకు గిఫ్ట్‌‌గా ఇచ్చారు. అయితే ఇలాంటి డీల్స్‌‌ భవిష్యత్‌‌లో మరిన్ని జరుగవచ్చనే వార్తల నేపథ్యంలో షేర్లు పడిపోయాయి.

గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన ఈ పతనం, అదే ఏడాది మే నాటికి 52 వారాల కనిష్టానికి 110 స్థాయికి చేరుకుంది. మేలోనే కాస్త రికవరీ సాధించి, వరుసగా మూడు రోజులు 92 శాతం బలపడింది. అదే నెలలో జరిగిన బోర్డు మీటింగ్ లో కంపెనీ రూ.424 కోట్ల షేర్ల బైబ్యాక్‌‌ను ప్రకటించింది. అయితే ఈ సెలబ్రేషన్స్ ఇన్వెస్టర్లకు ఎంతో కాలం నిలువలేదు. ఈ తర్వాత రెండు నెలలకే షేర్ల బైబ్యాక్‌‌ ఆఫర్‌‌‌‌ను కంపెనీ విత్‌‌డ్రాచేసుకుంది.  దీంతో మళ్లీ స్టాక్ ధర పడటం ప్రారంభమైంది. కొన్ని వెకేషన్లలో మినహా మిగతా రోజుల్లో స్టాక్ ధర డౌన్‌‌ట్రెండ్‌‌లోనే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌‌ 15న మాత్రం కంపెనీ స్టాక్ ఇంట్రాడేలో 16 శాతానికి పైగా ర్యాలీ జరిపింది. ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ద్వారా కంపెనీలో 2 శాతానికి పైగా వాటాను ఎఫ్‌‌పీఐలు కొనుగోలు చేయడంతో షేర్లను ఇన్వెస్టర్లు కొన్నారు. కానీ 2018 ఆర్థిక సంవత్సర ఫలితాలు మాత్రం ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను, పీసీ జూయలరీ రూ.2.81 కోట్ల స్టాండలోన్ నికర నష్టాలను పోస్ట్ చేయడంతో, ఇన్వెస్టర్లు మళ్లీ షేర్లను అమ్మడం ప్రారంభించారు.ఇలా పీసీ జూయలరీ షేరు ధర ఆఖరికి ఆల్‌‌టైమ్ కనిష్టంలో రూ.27కు చేరుకుంది.

ఝున్‌‌‌‌ఝున్‌‌‌‌వాలా దంపతులకు రూ.245 కోట్లు లాస్‌‌‌‌..

స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో బిగ్‌‌‌‌ బుల్‌‌‌‌గా పేరున్న రాకేష్ ఝున్‌‌‌‌ఝున్‌‌‌‌వాలాకు డెల్టా కార్పొ చుక్కలు చూపించింది. క్యాసినో, గేమింగ్ ప్లేయర్ అయిన డెల్టా కార్పొ షేర్లు 46 శాతం మేర పతనం కావడంతో, రాకేష్ ఝున్‌‌‌‌ఝున్‌‌‌‌వాలా, ఆయన భార్య రేఖకు రూ.244.90 కోట్లు పోయాయి. 2018 ఆగస్ట్‌‌‌‌లో రాకేష్ ఈ కంపెనీలో 1.15 కోట్ల షేర్లను  రూ.266.95 చొప్పున కొనుగోలు చేశారు. 2018 జూన్ క్వార్టర్ ముగిసే నాటికి రాకేష్ వాటాల విలువ రూ.306.99 కోట్లుగా ఉండేది. కానీ ప్రస్తుతం షేరు ధర రూ.144.50కి పడిపోవడంతో రాకేష్ హోల్డింగ్ రూ.166.17 కోట్లకు పడిపోయింది. రేఖ కూడా ఈ కంపెనీలో 85 లక్షల షేర్లను కొన్నారు. 2018 జూన్ చివరి నాటికి ఆమె వాటా విలువ రూ.226.90 కోట్లు. ఆమె హోల్డింగ్ విలువ కూడా రూ.122.82 కోట్లకు దిగొచ్చింది. అంటే మొత్తంగా వీరిద్దరి సంపద కలిపి రూ.244.90 కోట్లు పోయింది. వీరితో పాటు డెల్టా కార్పొలో ఇన్వెస్ట్ చేసిన మిగతా ఇన్వెస్టర్లు కూడా రూ.3,217.41 కోట్లు కోల్పోయారు.

Latest Updates