ఏండ్లు గడుస్తున్నా పనులైతలేవ్​

రాజేంద్రనగర్ సర్కిల్లో అన్నీ పెండింగ్
పట్టించుకోని యంత్రాంగం
అసహనంలో ప్రజానీకం

రాజేంద్రనగర్​ జీహెచ్​ఎంసీ సర్కిల్ అభివృద్ధి పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.  అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే కోట్ల నిధులతో చేపట్టిన పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.   ఎంతో అర్బాటంగా ఆరంభించిన పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని స్థానికులు విమర్శిస్తున్నారు.   అభివృద్ది పనులకు మంజూరు చేసిన నిధులు ఖర్చు అయ్యాయే తప్పా పనులు మాత్రం ఇంకా పూర్తి కాకపోవడాన్ని  ఎత్తిచూపుతున్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి  సీఎం వైఎస్​.రాజశేఖర్​రెడ్డి మొట్ట మొదటి నగరబాటలో కాటేదాన్​లో మీనీ స్పోర్ట్స్​ కాంప్లెక్స్​ నేటికి పూర్తి కాకపోవడం గమనార్హం.  అదే విధంగా కాటేదాన్​లోని నూర్​మహ్మద్​కుంట ప్రక్షాళన పనులు కూడా ఇప్పటి వరకు మొదలు కాలేదు.

ఆరాంఘర్​ చౌరస్తా  సుమారు 80 కుటుంబాలకు నూర్​ మహ్మద్​కుంట పక్కనున్న ప్రభుత్వ స్థలంలో ఇండ్లుకట్టిస్తామని హామీలో ఎలాంటి పురోగతి లేదు.  పాతబస్తీలోని జంగమ్మెట్​లో నివాసముండే సుమారు 150 గిరిజన కుటుంబాలకు బండ్లగూడ రెవిన్యూ పరిధిలో స్థలాన్ని మంజూరు చేశారు. దీంతో పేదలు ఆయా స్థలంలో గుడిసెలు వేసుకోగా అదే స్థలంలో మైలార్​దేవ్​పల్లి పోలీస్​స్టేషన్​ను ఏర్పాటు చేసి వారికి పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద కాటేదాన్​లోని సర్వే నెంబర్​ 156 బై 1లో ఇండ్లను సగం మాత్రమే పూర్తి చేశారు. మోహిదీపట్నం నుంచి ఆరాంఘర్​ చౌరస్తా వరకు పీవీఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్​ వే ప్లైఓవర్​కు ఇరువైపులా కోట్ల నిధులతో  సర్వీసు రోడ్డు నిర్మించినా అందుబాటులోకి రాలేదు.

టీఆర్​ఎస్​ పాలనలోనూ అదే తీరు

టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అదేరీతిలో ఉండడం గమనార్హం.  మైలార్​దేవ్​పల్లి సమీపంలోని లక్ష్మీగూడకు వెళ్లేదారిలో వంద పడకల హాస్పిటల్​ నిర్మిస్తామని  నాలుగేండ్ల క్రితం స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. డబుల్​బెడ్​రూం  కోసం కాటేదాన్​లో చేపట్టిన పనులు ఏండ్లు గడుస్తున్నా పునాదులకే పరిమితం అయ్యాయి.  మోడల్​ మార్కెట్లను నిర్మాణంలో భాగంగా రాజేంద్రనగర్  ​ సర్కిల్​కు ఐదు మంజూరు చేశారు. అయితే ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదని కాటేదాన్​ టీఎన్​జీవోస్​ కాలనీ, ప్రేమావతిపేట్​లలో రెండు మాత్రమే కోటి రూపాయాలతో  వాటి నిర్మాణం పూర్తి అయినా లబ్ధిదారులకు కేటాయించలేదు.  ఈ మార్కెట్లను   పురపాలక, ఐటి శాఖల మంత్రి కేటీఆర్​  ప్రారంభమైనా నేటికి లబ్ధిదారులకు కేటాయించలేదు.  రెండు మాడ్రన్​ ఫంక్షన్​ హాల్స్​   మంజూరైనా రూ.2 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయి. మైలార్​దేవ్​పల్లి నుంచి పాత బస్తీకి వెళ్లేదారిలో రైల్వే ప్లైఓవర్​ బ్రిడ్జిని నిర్మించేందుకు జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీలో రెండేళ్ల క్రితం తీర్మాణం జరిగినా నేటికి టెండర్​ ప్రక్రియకు కూడా నోచుకోలేదు. మైనార్టీ రెసిడెన్సీయల్​ స్కూల్​ భవనం నిర్మాణం నేటికి ప్రారంభం కాలేదు. దీంతో చింతల్​మెట్​లో అద్దె భవనంలో కొనసాగుతుంది. శివరాంపల్లి, ఊర చెరువు, బాబుల్​రెడ్డినగర్​లోని నర్సబాయికుంటల అభివృద్దికి రూ. 2 కోట్ల నిధులు మంజూరైన   పనులు పూర్తి కాలేదు.  ఇంకా  వరదనీటి కాలువలు, అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ, సీసీ రోడ్లు కూడా ఏళ్ల చాలా బస్తీలో వేయాల్సి ఉన్నా నేటికి పూర్తి కాలేదు.

చొరవచూపని అధికారులు

పెండింగ్​ పనులు, పెండింగ్​ నిధులపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం చిత్తశుద్దిలేకుండా పోయిందని  ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వ విభాగాల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తమ నిర్లక్ష్యాన్ని వీడి పెండింగ్​ పనులను పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

Latest Updates