భారీగా పెరిగిన పెన్నీషేర్లు ..

న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో క్వాలిటీ స్టాకులు, స్టాక్‌‌ మార్కెట్‌‌ఇండెక్స్‌‌లు భారీగా పడిపోయినప్పటికీ కొన్ని పెన్నీ స్టాకులు(తక్కువ రేట్లు, తక్కువ మార్కెట్‌‌ క్యాప్‌‌ ఉన్న షేర్లు) మాత్రం గత ఆరు నెలల్లోనే భారీగా పెరగడం విశేషం. తక్కువ ధరకే దొరుకుతుండడంతో రిస్క్‌‌ ఇష్టమైన ఇన్వెస్టర్లు వీటి వైపు చూస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకి ఎంటర్‌‌‌‌ అవుతున్న వారిలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు తక్కువ రేట్లకే దొరికి, ఎక్కువ ప్రాఫిట్‌‌ ఇచ్చే షేర్ల పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు. గత ఆరు నెలల్లో మొత్తంగా 25 పెన్నీ స్టాకులు ఇలా ఇన్వెస్టర్లకు బంగారం పండించాయి. ఇందులో 100 శాతం నుంచి ఏకంగా 1,240 శాతం పెరిగిన షేర్లున్నాయి. ఈ ఆరు నెలల్లోనే సెన్సెక్స్‌‌ 14 శాతం నష్టపోయింది. బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్‌‌ 11.42 శాతం, బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్‌‌ ఇండెక్స్‌‌లు 7.8 శాతం పతనమయ్యాయి. గత ఆరు నెలల్లో ఈ పెన్నీ స్టాకులలో హాథ్‌‌వే భవాని కేబుల్‌‌టెల్ & డాటా కామ్‌‌ స్టాకులు రూ. 3 లు స్థాయి నుంచి రూ. 41.80 కు పెరిగాయి. ఇది ఏకంగా 1,240 శాతం పెరుగుదల. వీటితో పాటు ఆప్టో సర్క్యూట్స్‌‌(ఇండియా) 392.71 శాతం, ఆంధ్రా సిమెంట్స్‌‌ 331.16 శాతం, జేఎంటీ ఆటో 310.61 శాతం పెరిగాయి.

రూ. వెయ్యి కోట్ల మార్కెట్‌‌ క్యాప్‌‌ కన్నా తక్కువుండి, రూ. 10 కంటే దిగువన ఉన్న స్టాకులను పెన్నీ స్టాకులుగా ఇండియాలో విశ్లేషకులు పరిగణిస్తున్నారు.
తేడా వస్తే ముందే పడేది ఈ షేర్లే…..

అన్ని రకాల షేర్లలో లిక్విడిటీ పెరుగుతుండడంతో ఈ పెన్నీ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయని యెస్‌‌ సెక్యూరిటీ సీనియర్‌‌‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ అమర్‌‌‌‌ అంబానీ అన్నారు. మార్కెట్‌‌ ర్యాలీని మిస్‌‌ అవుతామనే ఆలోచనతో కొత్త ఇన్వెస్టర్లు తక్కువ వాల్యూ ఉన్న షేర్ల వెంటపడుతున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌‌లో అలాంటి షేర్లకు ప్రతికూలమైన వార్తలు వస్తే, ముందుగా ఢమాలనే షేర్లు కూడా ఇవేనని ఆయన హెచ్చరించారు. ఈ షేర్లు అంతకు ముందు భారీగా పడ్డాయని, దీంతో తక్కువకే అవి దొరుకుతుండటంతో కొన్ని షేర్లకు సడెన్‌‌గా డిమాండ్‌‌ వచ్చిందని అభిప్రాయపడ్డారు. పెన్నీ షేర్లు ఎంత తొందరగా పెరుగుతాయో, అంతే తొందరగా పడతాయని, వీటిలో ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ కత్తిమీద సామేనని అన్నారు.

ఒక్క ఇండియన్‌‌ మార్కెట్లోనే కాదు గ్లోబల్‌‌ మార్కెట్లో కూడా కొన్ని పెన్నీ షేర్లు భారీగా పెరిగాయి. ఉదాహరణకు అమెరికాలో అతిపెద్ద కార్ల రెంటల్‌‌ ఏజెన్సీ హెర్ట్జ్‌‌ దివాలాకు ఫైల్‌‌ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ షేర్‌‌ మాత్రం 24 గంటల్లోనే 1.11 డాలర్‌‌‌‌ నుంచి 2.38 డాలర్లకు పెరిగింది. ఇది 114 శాతం పెరుగుదల. మరో వైపు ఇండియన్‌‌ మార్కెట్లో గత ఆరు నెలల్లో కొత్తగా 49 షేర్లు పెన్నీ షేర్లుగా మారాయి. డార్జిలింగ్‌‌ రోప్‌‌వే రూ. 52.4 స్థాయి నుంచి తాజాగా రూ. 5.41 స్థాయికి పడిపోయింది. టెర్రాస్కోప్‌‌ వెంచర్స్ ‌‌(80.88 శాతం), నోవటెర్‌‌‌‌ రీసెర్చ్‌‌ ల్యాబోరేటరీస్ ‌‌(79.59 శాతం) వంటి షేర్లు ఈ ఆరు నెలల్లో భారీగా పడి కొత్త పెన్నీ షేర్లుగా అవతరించాయి.

రిస్క్‌‌, ప్రాఫిట్‌‌ రెండూ ఎక్కువే

పెన్నీ స్టాకులు లిక్విడిటీ తక్కువగా ఉన్న స్టాకులని, ఈ షేర్ల ధరలు పైకీ, కిందికీ ఎక్కువగా ఊగిసలాడతాయని విశ్లేషకులు అన్నారు. వీటిలో ఇన్వెస్ట్‌‌ చేయడం చాలా రిస్క్‌‌తో కూడుకున్నదని సూచిస్తున్నారు. కొంత మంది ఇన్వెస్టర్లు వీటిని కొంటుంటారని, వీటి చుట్టూ ఒక ప్రత్యేకమైన పరిస్థితి క్రియేట్‌‌ చేసి కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తారని ఓ రిటైల్‌‌ బ్రోకింగ్‌‌కు చెందిన ఎనలిస్ట్‌‌ అన్నారు. తక్కువ వాల్యూ, హై రిటర్న్‌‌లను ఆశ చూపి వీరిని ఎట్రాక్ట్‌‌ చేస్తారని చెప్పారు. మార్కెట్‌‌ మొత్తం జనవరి లెవెల్‌‌కు చాలా దూరంలో ఉన్నప్పటికీ గత ఆరు నెలల టైమ్‌‌లోనే కొన్ని పెన్నీ స్టాకులు మల్టీ ఇయర్‌‌‌‌ హైలకు చేరుకున్నాయి. బాటమ్‌‌ ఫిషింగ్‌‌ స్ట్రాటజీని ఇన్వెస్టర్లు అనుసరిస్తున్నారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కాగా ఏదైనా స్టాకు పడిపోయి, తన నిజమైన వాల్యూ కంటే దిగువన ఉందని కొనుగోలు చేయడాన్ని బాటమ్‌‌ ఫిషింగ్‌‌ అంటారు.

Latest Updates