టీకాలపై తగ్గిన నమ్మకం

ప్రపంచంలోని ప్రజలకు టీకాలపై పెద్దగా నమ్మకం లేదట. 140 దేశాల్లో 1.40 లక్షల మందిపై చేసిన సర్వేలో ఈ విషయం తెలిసిందని వెల్ కమ్ ట్రస్ట్ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌వో) ప్రకారం ప్రజలకు టీకాలపై నమ్మకం లేకపోవడం అతి ప్రమాదకరమైన విషయమని చెబుతున్నారు. కేవలం టీకాలు వేయించుకోకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జబ్బుల బారిన పడుతున్నారు. వ్యాక్సిన్స్ సేఫేనా అని వెల్ కమ్ ట్రస్ట్ తరఫు సర్వే చేసిన వాళ్లు అడగ్గా.. 79 శాతం మంది సేఫేనని, 7 శాతం మంది కాదని, మరో 14 శాతం అవ్వొచ్చు.. కాకపోవచ్చు అంటూ సమాధానమిచ్చారట. వ్యాక్సిన్లు జబ్బులు సోకకుండా నిజంగానే ఆపాయా అని ప్రశ్నకు 84 శాతం మంది అవునని అంటే, 5 శాతం మంది కాదని, 12 శాతం మంది ఔనని, కాదని చెప్పలేదని వెల్ కమ్ ట్రస్ట్ వెల్లడించింది. వాస్తవానికి వ్యాక్సిన్స్ ప్రాణాంతకమైన ఎన్నో జబ్బుల నుంచి పిల్లల్ని కాపాడుతున్నాయి. అయితే, తట్టు (మీజిల్స్‌‌) విషయంలో జరిగిన చెడు ప్రచారం కారణంగా చాలా మంది టీకా వేయించుకోవడానికి సంకోచిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. దీంతో తట్టు పోయిందనుకున్న చాలా దేశాల్లో  ఆ జబ్బు ఇటీవల విజృంభించింది. ఇండియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్, మడగాస్కర్, కజకిస్థాన్, జార్జియా, ఉక్రెయిన్, సుడాన్, యెమెన్, నైజీరియా, ఫ్రాన్స్, వెనెజులా, బ్రెజిల్ లో 2016తో పోల్చితే 2017కు 30 శాతం కేసులు పెరిగాయి. తూర్పు యూరప్, పశ్చిమ యూరప్, తూర్పు ఆసియా, ఉత్తర అమెరికా, ఉత్తర యూరప్, మధ్య ఆసియా, దక్షిణ యూరప్, మధ్య ఆఫ్రికా, మిడిల్‌‌ ఈస్ట్‌‌, దక్షిణ అమెరికా, ఓషియానియా, దక్షిణాఫ్రికా, ఆగ్నేయాసియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా, మధ్య అమెరికా, తూర్పు ఆఫ్రికా, దక్షిణాసియాల్లో వరుసగా టీకాలపై ఎక్కువగా అపనమ్మకం ఉందని, వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తున్న ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్‌‌, అమెరికా, ఉక్రెయిన్‌‌లలో విపరీతంగా పెరిగిందని  వెల్ ట్రస్ట్ పేర్కొంది.

టీకాలను ఎవరు నమ్ముతున్నారు?…

తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలు ఎక్కువగా టీకాలను నమ్ముతున్నారని వెల్ ట్రస్ట్ వెల్లడించింది. అత్యధికంగా దక్షిణాసియా దేశాల ప్రజల్లో 95 శాతం మందికి వ్యాక్సిన్స్ పై ఎనలేని విశ్వాసం ఉందని చెప్పింది. ఆ తర్వాత తూర్పు ఆఫ్రికన్లు ఎక్కువగా నమ్ముతున్నారట. సెర్వికల్ క్యాన్సర్ టీకా హెచ్ పీవీని రువాండా ఇటీవల దేశంలో అనుమతించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ల వల్ల న్యూరోలాజికల్ సమస్యలు వస్తాయంటూ జరిగిన ప్రచారాన్ని రువాండా ప్రజలు పట్టించుకోలేదు.

Latest Updates