కరోనా భయంతో రోగ నిరోధక శక్తిపై జనం ఫోకస్

డాక్టర్లు, మెడికల్‌ స్టోర్ల దగ్గర ఇమ్యూనిటీ
బూస్టర్ల గురించి ఎంక్వయిరీలు
మాయదారి మహమ్మారి కరోనా.. బలం లేనోళ్లనే బలితీసుకుంటున్నది.. శక్తి లేనోళ్లనే సంపుతున్నది. దాన్ని పోగొట్టాలంటే మందులేదు.. మనకు అంటకుండా చూసుకోవడానికి ఆయుధం లేదు.. మాస్క్లు, శానిటైజర్లు, ఫిజికల్ డిస్టెన్స్లు.. ఇలా ఎన్ని చేస్తున్నా రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉన్నది. దీంతో జనాలు ఇమ్యూనిటీపై దృష్టి పెట్టిన్రు. కరోనా అంటకుండా జాగ్రత్తలు పడుతూనే.. అది సోకినా ప్రాణాలను కాపాడుకునేందుకు ఇమ్యూనిటీ పెంచుకుంటున్నరు. ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతిపైనా ఆధారపడుతున్నరు. ఇందుకోసం ఖర్చు పెంచుకున్నరు. ఇప్పుడు నెలవారీ సరుకుల లిస్టులో ‘ఇమ్యూనిటీ బూస్టర్లు’ కూడా చేరిపోయాయి. జనాల్లో అంతలా మార్పు  తెచ్చింది కరోనా.

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘కరోనాకు మందు లేదు. మన ఇమ్యూనిటీని పెంచుకోవడమే బెస్ట్ మెడిసిన్‌‌’’.. ఇప్పుడు ఏ డాక్టర్‌‌ని అడిగినా, ఏ ఎక్స్‌‌పర్ట్ ని ఎంక్వయిరీ చేసినా ఇదే మాట. సర్కారు సూచన కూడా ఇదే. ఫేస్బుక్, వాట్సప్‌‌, టిక్‌‌టాక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్.. ఎక్కడ చూసినా ఇవే పోస్టులు. యూట్యూబ్ లో ఇమ్యూనిటీ ప్రొడక్టులకు లక్షల్లో వ్యూస్. ఏ ఇంట్లో చూసినా రోగనిరోధక శక్తిని పెంచే వంటకాలు, ఫుడ్‌‌లు, ప్రొడక్టుల గురించే చర్చ. ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా ఇమ్యూనిటీ బూస్టర్ల గురించే డిస్కషన్. ‘ఇది తిను.. అది వాడు.. ఇమ్యూనిటీ పెరుగుతది’ అంటూ సలహాలు.జనం కూడా వీటిని సీరియస్‌‌గానే తీసుకుంటున్నారు. ఫలితంగా ఇమ్యూనిటీ బూస్టర్లకు విపరీతమైన డిమాండ్‌‌ ఏర్పడింది. దీన్ని గమనించి కొన్ని కంపెనీలు కొత్త కొత్త ప్రొడక్టులు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇదంతా కరోనా తెచ్చిన మార్పు.

ఇమ్యూనిటీ బూస్టర్లు వంటింట్లోనే..

ఇమ్యూనిటీ బూస్టర్లంటే కేవలం మందులు మాత్రమే కాదు. వంటింట్లో ఉండే ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, మిరియాలు, తేనె లాంటి ఎన్నో పదార్థాలు రోగనిరోధక శక్తి పెంచేవే. సైంటిఫిక్గా కూడా ఇది రుజువైంది. అందుకే చాలా మంది వీటిని వివిధ వంటకాల్లో వాడుతుంటారు. మరోవైపు డ్రైఫ్రూట్స్ తో తయారైన చాక్లెట్ బార్లు, మల్టీ గ్రెయిన్ బిస్కెట్లు బోలెడు అందుబాటులో ఉన్నాయి. అలాగే తులసి, లెమన్ ఫ్లేవర్స్ తో ఉండే గ్రీన్ టీ, కాఫీలు భారీ ఎత్తున అమ్ముడవుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. సుగంధ ద్రవ్యాలు, మూలికల నుంచి తయారైన ఆయిల్స్కు కూడా బాగా డిమాండ్ ఏర్పడింది. మైక్రో న్యూట్రియంట్లు ఉండే కొన్ని రకాల గింజలను (అవిసెలు, నువ్వులు, పుచ్చకాయ, సన్ ఫ్లవర్, సబ్జా) జనం బాగా వాడుతున్నారు. పాలలో కూడా వివిధ రకాల పోషకాలను జత చేస్తూ కంపెనీలు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి.

అలోపతిలో బోలెడు ప్రొడక్టులు

అలోపతిలో ఎన్నో ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ షాపుల్లో విటమిన్, మినరల్, డైటరీ సప్లిమెంట్లు దొరుకుతున్నాయి. చాలా మంది మెడికల్ స్టోర్లకు వెళ్లి ఎంక్వయిరీ చేసి కొంటున్నారు. కొందరు యూట్యూబ్ ద్వారా తెలుసుకొని కొంటున్నారు. ఏ ఇమ్యూనిటీ బూస్టర్లనైనా ప్రిస్క్రిప్షన్ తోనే కొనాలని, కొందరికి కొన్ని పడవని, మరికొందరకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అలోపతి డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ సీ మంచిదని అదే పనిగా ట్యాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఉత్తమ మార్గమని, అవసరం ఉన్నపుడు మాత్రమే సప్లిమెంట్లను వాడాలని సూచిస్తున్నారు.

కొత్త ఉత్పత్తులు

ప్రజల్లో పెరిగిన డిమాండ్ చూసి చాలా సంస్థలు కొత్త ఉత్పత్తులు విడుదల చేస్తున్నాయి. అల్లం, తులసి కాంబినేషన్ తో ఉండే మిల్క్ బ్రాండ్ ను విడుదల చేసే ఆలోచనతో ఉన్నామని అమూల్ సంస్థ ఈమధ్య ప్రకటించింది. తాము తయారు చేసే స్ట్రెస్ కామ్ (అశ్వగంధ), గిలాయ్ కి ఘన్వటీ ట్యాబ్లెట్లకు డిమాండ్ పెరిగిందని, వీటిని టీవీ, డిజిటల్ మీడియాలో ప్రమోట్ చేయాలని డాబర్ కంపెనీ నిర్ణయించింది. ఇమ్యూనిటీ పెంచే ఉత్పత్తులను తయారుచేసే ప్రముఖ కంపెనీలు హిమాలయ డ్రగ్, గ్లాక్సోస్మిత్, డాబర్, నెస్లే, డానోన్ న్యూట్రికా, అబ్బట్ ఇండియా, హెర్బాలైఫ్ వంటి అనేక కంపెనీలు కొత్త ప్రొడక్టులపై దృష్టి పెట్టినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఆయుర్వేదంలో మంచి మందులు

ఆయుర్వేద ఉత్పత్తుల్లో తిప్పతీగ, అశ్వగంధ పౌడర్, క్యాప్సుల్స్ డిమాండ్ లో ఉన్నాయి. చ్యవన్ ప్రాశ్ తర్వాత స్థానం వీటిదే. యోగా గురు రామ్ దేవ్ బాబా వీటితోనే కరోనాకు మందు తయారుచేసినట్లు చెప్పుకుంటున్నారు. మరికొన్ని రకాల లేహ్యాలు, చూర్ణాలు, కషాయాలను కూడా జనం బాగా కొంటున్నారు. ‘ఇమ్యూనిటీని పెంచే మందుల గురించి చెప్పండి. వాటిని మాకు ప్రిస్క్రైబ్ చేయండి’ అని చాలా మంది పేషెంట్లు అడుగుతున్నారని, కొందరు కేవలం వాటి కోసమే తమని సంప్రదిస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయని, వీటిలో చ్యవనప్రాశ్, ఇందుకాంధాగృదం, అమృతారిష్టం, అశ్వగ్రంథ చూర్ణం, ఆయుస్కావద చూర్ణం, ద్రాక్షాది కషాయంలో ఏదైనా వాడొచ్చని సికింద్రాబాద్ లో కేరళ ఆర్య ఆయుర్వేద వైద్యశాల నిర్వహిస్తున్న డాక్టర్ సుబిన్ బి.ఎస్ తెలిపారు. వంటింట్లో ఉండే అల్లం, మిరియాలు, ఉసిరి, తులసి, అశ్వగంధ, నిమ్మ, దాల్చిన చెక్కల ద్రవాలు తాగడం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆయన చెప్పారు.

హెల్త్, ఆర్గానిక్ ఫుడ్పై ఖర్చెక్కువ

ఆయుర్వేద లేహ్యం ‘చ్యవన్‌‌ప్రాశ్‌‌’.. ఎన్నో ఏళ్లుగా వాడకంలో ఉన్న సంప్రదాయ మందు. ఇది అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్‌‌. కరోనా కారణంగా దీని అమ్మకాలు 81 శాతం పెరిగాయని ప్రముఖ సర్వే సంస్థ నీల్సన్‌‌ వెల్లడించింది. బలం కోసం వాడే ఇతర లేహ్యాల సేల్స్‌‌ కూడా 60 శాతం పెరిగాయి. తేనె అమ్మకాలు 38 శాతం పెరిగినట్లు ఈ గ్రోసరీస్‌‌ సంస్థ గ్రోఫర్స్‌‌ తెలిపింది. పసుపు అమ్మకాలు 38 శాతం పెరిగినట్లు నీల్సన్‌‌ ప్రకటించింది. ఇమ్యూన్‌‌ బూస్టర్ల మీద సర్వే చేస్తే.. 56 శాతం ప్రజలు హెల్త్‌‌, ఆర్గానిక్‌‌ ఫుడ్‌‌, ఫిట్‌‌నెస్‌‌పై గతంలో కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారని వెల్లడైంది. సాధారణంగా హెల్త్‌‌ ప్రొడక్టుల సేల్స్‌‌ ఏటా 5 నుంచి 10 శాతం పెరుగుతాయి. ప్రస్తుతం 20 నుంచి 40 శాతానికి జంప్‌‌ అయినట్లు మరో సర్వే తేల్చింది. ఆలివ్‌‌, సోయా, మస్టర్డ్‌‌ ఆయిల్స్, బ్రెడ్‌‌, బిస్కెట్స్, చాక్లెట్స్ డ్రింక్స్‌‌, మల్టీ గ్రెయిన్‌‌ బార్స్‌‌ వంటి సేల్స్ 30 శాతం పెరిగాయి. మెడికల్‌‌ షాపుల్లో మల్టీ విటమిన్లు, ప్రోటీన్ పౌడర్లు, ఆయుర్వేద పొడులు, హోమియో మందులు, ఇతర ఎనర్జీ, ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్టుల అమ్కకాలు భారీగా పెరిగాయి. యువతలో ఫిట్ నెస్ కాన్సియస్నెస్ కూడా ఈ మార్కెట్ డిమాండ్ పెరగడానికి కారణమని అంటున్నారు.

సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియో

సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియో మందుల గురించి చాలా మంది ఎంక్వయిరీ చేస్తున్నట్లు స్టోర్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ‘‘కరోనా వచ్చినప్పటి నుంచి మనవాళ్లు హోమియో మందుల గురించి తెలుసుకుంటున్నారు. మాలాంటి వాళ్లం ఉచితంగా పంచిపెట్టాం. హోమియోపతిలో రోగ నిరోధక శక్తిని పెంచే అర్సానిక్ ఆల్బం–30, కాంఫోర్–1ఎం అనే మందులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రివెంటివ్ గా కూడా వాడవచ్చు. సైడ్ ఎఫెక్టులు ఉండవు’’ అని హోమియో డాక్టర్ వాకిటి రాంరెడ్డి తెలిపారు. రోగ లక్షణం, శరీరతత్వం బట్టి కొన్ని మందులు ఇస్తామని, అవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయని వివరించారు.

అవసరాన్ని బట్టి వాడాలి
చాలా మంది ఇమ్యూనిటీ పెంచే మెడిసిన్స్ గురించి అడుగుతున్నారు. అవసరాన్ని బట్టి వాడవచ్చు. వీలైనంత వరకు ఆహారంలో పోషకాలు పెంచడం మంచిది. బాదం, కిస్మిస్, కాజు లాంటి డ్రై ఫ్రూట్స్ తినాలి. నిద్ర కూడా చాలా ముఖ్యం. విటమిన్ సీ, బీ కాంప్లెక్స్ వాడొచ్చు. జింక్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.                                  – డాక్టర్ రాజశ్రీ

మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు అడుగుతున్నరు
చాలా మంది మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు అడుగుతున్నరు. కొందరు బీ12, సీ, డీ విటమిన్లను ప్రత్యేకంగా అడుగుతున్నరు. మరికొందరు బలాన్ని ఇచ్చే పౌడర్లు, ప్రొటీన్ పౌడర్లను కొంటున్నరు.                          – వీరబాబు, మెడికల్ షాపు నిర్వాహకుడు, నేరెడ్ మెట్

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest Updates