సీసీ కెమెరాలతో జనం సెల్ఫ్‌‌ పోలీసింగ్‌‌

సీసీ కెమెరాలతో జనం సెల్ఫ్‌‌ పోలీసింగ్‌‌
  • ఇండ్లలో ఏర్పాటు చేసినవి 5,17,188 సీసీటీవీ కెమెరాలు
  • కమ్యూనిటీ తరఫున కాలనీల్లో మరో 59 వేలు
  • మోస్ట్‌‌ సీసీటీవీ సర్వైలెన్స్‌‌ సిటీల్లో గ్రేటర్‌‌కు టాప్‌‌ 16 ర్యాంక్‌‌
  • 75 శాతం కేసులు సీసీ ఫుటేజీ సాయంతోనే సాల్వ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగుఖైరతాబాద్ లో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది.. పోలీసులు రెండు రోజుల్లోనే దొంగలను పట్టుకున్నారు. కరీంనగర్ టౌన్ లో ఓ హత్య జరిగింది.. 24 గంటల గడవక ముందే నిందితుడు దొరికాడు. మహబూబ్ నగర్ లో ఓ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన పాప మిస్ అయింది.. సాయంత్రానికి ఆచూకీ దొరికింది.. ఈ మూడు ఘటనల్లోనూ హెల్ప్ అయింది సీసీ కెమెరాలు. వాటిలో రికార్డయిన వీడియోలు.. చాలా కేసులు పరిష్కరించడంలో తోడ్పడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఏటీఎంలలోనే కాదు.. ఇండ్ల కాంపౌండ్లలో కూడా సీసీ టీవీలు కనిపిస్తున్నాయి. జనం సెల్ఫ్ పోలీసింగ్ వైపు మళ్లుతున్నారు.ఇలా రాష్ర్టంలో ప్రజలు 5,76,825 సీసీకెమెరాలు అమర్చుకున్నారు. ఒక్క గ్రేటర్‌‌ హైదరాబాద్ పరిధిలోనే 4,98,234 కెమెరాలున్నాయి. బ్రిటన్ కు చెందిన కంపారిటెక్‌‌ అనే సంస్థ జరిపిన సర్వేలో మోస్ట్‌‌ సీసీటీవీ సర్వైలెన్స్‌‌ టాప్ 20 సిటీల్లో గ్రేటర్‌‌ హైదరాబాద్ కు 16వ ర్యాంక్‌‌ వచ్చింది.

ఒక కెమెరా.. 100 మంది పోలీసులు..

ప్రతి దానికి పోలీసులపై ఆధారపడటం కంటే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం బెటర్ అని జనం భావిస్తున్నారు. ఏదైనా నేరం జరిగితే నిందితులను పట్టుకునేందుకు పోలీసులకు సీసీ కెమెరాల్లోని వీడియోలే సాయపడతాయని భావిస్తున్నారు. ఈ కెమెరాలు ఉన్న చోట తప్పు చేయాలంటే నేరగాళ్లు కూడా భయపడతారని అనుకుంటున్నారు. అదీకాక పోలీసులు అన్ని సందర్భాల్లో అన్ని ప్రాంతాల్లో నిఘా వేయడం అసాధ్యం కనుక సీసీటీవీ ఫుటేజీ ఉంటే ఇన్వెస్టిగేషన్‌‌కు ఈజీ అవుతుందని మరికొందరు కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సిటీల్లో చైన్‌‌ స్నాచింగ్‌‌ మొదలుకొని మర్డర్ల వరకు నేరాలను చేధించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమాని ఆ శాఖ అధికారులే చెబుతారు. అందుకే సీసీటీవీలు పెట్టుకోమని జనాలకు చెబుతున్నారు. ఇళ్లలోనే కాకుండా కాలనీ సంఘాలు వీధుల్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకొని దాన్ని పోలీస్‌‌ స్టేషన్‌‌తో అనుసంధానిస్తే నేరాలను ఈజీగా అరికట్టవచ్చని చెబుతున్నారు. దీని కోసం ‘నేను సైతం’ పేరిట క్యాంపెయిన్‌‌ నిర్వహించారు.

75 శాతం కేసులకు పరిష్కారం

పోలీసులు ఇచ్చిన పిలుపుకు స్పందించి రాష్ట్రవ్యాప్తంగా జనం నేను సైతంలో భాగంగా 5,17,188 కెమెరాలు తమ ఇండ్లలో ఏర్పాటు చేసుకున్నారు. కాలనీల్లోని వీధుల్లో 59,637 కెమెరాలు బిగించుకున్నారు. కేవలం గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలోనే 4,98,234 కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల సాయంతో గమనిస్తూ ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే జనం తమను అలెర్ట్‌‌ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. కాలనీ వీధుల గురించి సమాచారం కూడా ఇలానే వస్తుందంటున్నారు. దాంతో తమ టీమ్‌‌లు వేగంగా ఆ ప్రాంతాలకు చేరుకొని విషయం తెలుసుకునేందుకు ఉపయోగపడుతోందన్నారు. చాలా కేసుల్లో సీసీటీవీ ఫుటేజే దర్యాప్తుకు ఉపయోగపడుతుందంటున్నారు. 75 శాతం కేసుల్ని ఈ ఫుటేజీ సహాయంతోనే సాల్వ్‌‌ చేస్తున్నామని చెబుతున్నారు. జనం కాలనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌‌ వద్ద సీసీ కెమెరాలతో సెక్యూరిటీ పెంచారు. స్థానికంగా కంట్రోల్‌‌ రూమ్‌‌ ఏర్పాటు చేసుకుని ఫుటేజ్‌‌ పరిశీలిస్తున్నారు. దీంతో ఎక్కడ నేరం జరిగిన ‘నెట్ వర్క్ వీడియో రికార్డింగ్’ ‘డిజిటల్ వీడియో రికార్డింగ్’ సిస్టమ్ ద్వారా నిందితులను పట్టిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి స్థానికులు ఇచ్చే సమాచారంతో పోలీసులు అలెర్ట్‌‌ అవుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగానే అంతర్రాష్ట్ర ముఠాల కదలికలను గుర్తిస్తున్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సీన్ ఆఫెన్స్‌‌లో సేకరించే ఫుటేజ్ ద్వారా నేరస్థులను గంటల్లోనే పట్టుకుంటున్నారు. తప్పు చేస్తే పోలీసుల కంటే ముందు సీసీ కెమెరాలు పట్టేస్తాయనే భయం నేరగాళ్లకు పట్టుకుంది.

ప్రపంచ నగరాలతో పోటీ

సిటీల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల నిఘా పెరిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది పోలీసులు ఉంటే  గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 20 వేల మంది పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. అయినా నేరస్తులకు, నేర స్వభావం ఉన్న వారిని అడ్డుకునేందుకు సీసీటీవీలే ఉపయోగపడుతున్నాయి. నేరాల రేటు, పోలీసుల పరిస్థితి అర్థం చేసుకున్న జనం సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవడంలో ప్రపంచంలోని పెద్ద పెద్ద సిటీలతో పోటీ పడుతున్నారు. లండన్‌‌లో 93 లక్షల మంది జనాభాకు 6,27,727 సీసీ కెమెరాలు ఉండగా హైదరాబాద్‌‌లో కోటి మందికి 4.98 లక్షల కెమెరాలు నిఘా కళ్లుగా మారాయి.