ధోనీ రనౌట్ మలుపు తిప్పిందా..? లేక ధోనీనే ముంచాడా..?

మహేంద్రసింగ్ ధోనీ. క్రికెట్ లో ఈ పేరు వింటే అభిమానుల్లో వైబ్రేషన్ పుడుతుంది. అతడి కెరీర్ అలా సాగింది మరి. ఇండియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్. ఓడిపోతామనుకున్న మ్యాచ్ లను గెలిపించడం మాహి స్పెషల్. బెస్ట్ ఫినిషర్ అని ధోనీకి పేరు. కానీ.. సమకాలీన క్రికెట్ లో ధోనీ పేరు చెబితే.. ఎందుకో చాలామందికి విసుగు కలుగుతోంది. ఐపీఎల్ లో ఆడే ధోనీ.. కీలకమైన వరల్డ్ కప్ లో ఇండియాకు ఆ మెరుపు ముగింపు ఇవ్వలేకపోయాడు. ఇంగ్లండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ధోనీ వైఫల్యం ఇండియాను ముంచింది. తాజాగా.. అత్యంత కీలకమైన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ధోనీ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు.

గప్తిల్ డైరెక్ట్ త్రో.. ధోనీ రనౌట్.. బ్యాడ్ లక్

స్కోరు బోర్డు చూస్తే… ధోనీ ఖాతాలో హాఫ్ సెంచరీ (50 రన్స్.. 72 బాల్స్ లో) ఉంది. హార్దిక్ పాండ్యాతో కలిసి వికెట్ల పతనం అడ్డుకున్నాడు. జడేజాతో కలిసి 116 రన్స్ భాగస్వామ్యం అందించాడు. ఐతే.. అందులో మేజర్ షేర్ జడేజాదే(77). జడేజా ఔటైనప్పుడు.. గెలిపించాల్సిన బాధ్యత ధోనీపైనే పడింది.

మరో 32 రన్స్ కొడితే ఇండియా గెలిచేదే. ఐపీఎల్ లో గనుక ఈ టార్గెట్ ఉంటే.. ధోనీ ఊదిపడేస్తాడు అన్న ధీమా ఉండేది. ఆ భావన నిజం చేస్తూ.. ధోనీ ఓ భారీ సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించాడు. ఐతే… ఆ తర్వాత దురదృష్టవశాత్తూ .. గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రోతో ఔటయ్యాడు. ఈ రనౌట్ ఇండియాకు టర్నింగ్ పాయింట్ అని చాలామంది చెబుతున్నారు. ధోనీ రనౌట్ కాకపోయి ఉంటే… మ్యాచ్ ఎలా ఉండేదన్నది ఎవరూ ఊహించలేనిది. ఇక్కడే మరో విశ్లేషణ కూడా నడుస్తోంది.

వేగంగా ఆడలేకపోయాడా..

మ్యాచ్ లో అవసరమైనప్పుడు ధోనీ భారీ షాట్లు కొట్టలేకపోయాడనేది ధోనీపై ప్రధాన ఆరోపణ. ఓ పక్క రవీంద్ర జడేజా బౌండరీలతో హోరెత్తిస్తుంటే… సింగిల్స్, డబుల్స్ తో ధోనీ అతడికి సహకారం అందిస్తూ వెళ్లాడు. ఐతే.. ఉన్న బంతులకు, చేయాల్సిన పరుగులకు మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నం ధోనీ చేయలేదు. భారీ షాట్లతోనే అది సాధ్యం. సమన్వయం అందిస్తూనే.. ధోనీ కూడా కొన్ని బౌండరీలైనా కొట్టాల్సింది అనేది సగటు క్రికెట్ అభిమాని వాదన. అలా ధోనీ ఆడకపోవడమే… ఒత్తిడి పెరిగిపోవడానికి ఓ కారణం అయ్యిందని ధోనీపై విమర్శలు చేస్తున్నారు అభిమానులు.

Latest Updates