చేసిండు, చెప్పిండు.. గెలిచిండు!

ఆమ్ ఆద్మీ పార్టీ  ప్రచారంలో ఆర్భాటం లేదు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారంతే….మందు పోయించలేదు, పైసలు పంచలేదు….ఫ్రీగా బైక్ లు ఇస్తాననో, గ్రైండర్లు పంచుతాననో హామీలు ఇవ్వలేదు. కిందటి ఐదేళ్ళలో చేసిన పనులు చెప్పారంతే. చేసిన పనులేమిటంటే….కుటుంబానికి అవసరమైనన్ని మంచినీళ్ళు సప్లయ్ చేయడం….గరీబోళ్ళకు కరెంటు బిల్లు కట్టే అవసరం లేకుండా మినహాయింపు ఇవ్వడం, వాడవాడకూ ఓ మినీ ఆస్పత్రి కట్టించి జనం బాగోగులు కనిపెట్టుకుని ఉండడం, పిల్లలకోసం మంచి స్కూళ్ళు కట్టించి, చక్కగా చదువు చెప్పించడం….చాలవా ఇవి! సగటు మనిషికి కావల్సింది ఇవే కదా. అందుకే జనం మూడోసారీ ఆప్​ సర్కారే కావాలన్నారు. బంపర్ మెజారిటీ ఇచ్చారు. ఎలక్షన్లలో ఇట్లా కూడా గెలవవచ్చునని ముచ్చటగా మూడోసారి కూడా రుజువు చేసింది ఆప్​.

రాజకీయాల్లో కొత్త మోడల్​

కేజ్రీవాల్​ మొదటిసారి గెలిచాక 48 రోజులకే రాజీనామా చేసి, రెండోసారి కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారానికొచ్చినప్పటి నుంచీ జనం అవసరాలే ఎజెండాగా పనిచేశారు. ఇండియన్​ రెవెన్యూ సర్వీస్​ (ఐఆర్​ఎస్​) ఆఫీసర్​గా గడించిన అనుభవంతో కేజ్రీవాల్​ మంచి వ్యూహంతో పనిచేస్తూ వచ్చారు. ప్రజలకు కావలసిన కనీస సదుపాయాల్ని గుర్తించి… ఆ దిశగానే స్కీమ్​లు, పనులు చేపట్టారు. ముఖ్యంగా వాటర్​, కరెంట్​, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్​పోర్టు రంగాలపై దృష్టి పెట్టారు. 200 యూనిట్లలోపు వాడితే ఫ్రీ కరెంటు పథకం ప్రవేశపెట్టారు. ఇది పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చాలా లాభం చేసింది. అలాగే, నీళ్లకు కటకటలాడే ఢిల్లీవాసులకు ఊరట కల్పించారు. ఇళ్లలో వాడుకోవడానికి నెలకు 20,000 లీటర్లపై బిల్లు లేకుండా చేశారు. దీనివల్ల ఏ, బీ, సీ, డీ కేటగిరీ కాలనీల్లోని 4 లక్షల 90 వేల పైచిలుకు వాడకందార్లకు లాభం కలిగింది.  పోయినేడాది ఆగస్టులో ఈ, ఎఫ్​, జీ, హెచ్​ కేటగిరీ కాలనీల్లో జనాలకు పూర్తిగా వాటర్​ ఎరియర్స్​ (బకాయిలు) రద్దు చేసేశారు. ఇది 17 లక్షల 70 వేల మంది వరకు ఉపయోగపడింది. ఇళ్లకు వాడుకునేవాళ్లకే కాకుండా కమర్షియల్​గా నీళ్లను వాడేవారికోసం 25 నుంచి 75 శాతం వరకు రిబేట్​ ప్రకటించారు. ఇవన్నీ నేరుగా ఢిల్లీ  కాలనీల్లోని పేద, దిగువ మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకున్నాయి.

అభివృద్ధికి సంబంధించి ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ ఒక మోడల్ ను పరిచయం చేశారు. అంతేకాదు ఈ మోడల్ ను భవిష్యత్తులో కూడా తమ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు బతుకు మీద భరోసా కల్పించారు. ఇది చిన్న విషయం కాదు. చందమామను తెచ్చి తమ చేతుల్లో పెట్టాలని ప్రజలు కోరుకోవడం లేదు. కనీస సదుపాయాలు కల్పించడంపై  పాలకులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకోవడం సహజం. కేజ్రీవాల్ చేసింది అదే. అందుకే  ఢిల్లీ ప్రజలు వరుసగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీకి  జై కొట్టారు.

మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో ‘ఆప్’ని పట్టించుకోని ఢిల్లీ ఓటర్లు… ఈసారి అదే పార్టీని ముద్దాడారు. లోక్​సభకు, అసెంబ్లీకి ఉండే తేడాని స్పష్టంగా చూపించారు. కేంద్రంలో దేశ రక్షణకు ఏ పార్టీ ఉండాలో, రాష్ట్రంలో తమ బతుకుల బాగోగులు చూడడానికి ఏ పార్టీ ఉండాలో కచ్చితంగా నిర్ణయించుకున్నారు. పెద్ద పెద్ద సమస్యల జోలికి పోకుండా తమకు కనీస సదుపాయాలు కల్పిస్తాడన్న నమ్మకంతో కేజ్రీవాల్​కి మూడోసారి అధికారం కట్టబెట్టారు.

ఎన్నికలనగానే కనిపించే హడావుడి ఏదీ ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్​లో కనిపించలేదు. ఓటర్లకు పంచిపెట్టడానికి లిక్కర్​​ లేదు, లిక్విడ్​ క్యాష్​ పట్టుబడలేదు. ఎలక్షన్స్​ అంటే కోట్ల రూపాయలు కుమ్మరించడమే అనుకోలేదు. గాలిలో చేతులూపి స్వర్గం దించుతానన్న వాగ్దానాల జోలికి వెళ్లలేదు. అసలు ఇలా కూడా గెలవవచ్చునా అని ఎనలిస్టులుసైతం ముక్కున వేలేసుకునేలా కేజ్రీవాల్​ వండర్​ఫుల్​ విన్నింగ్​ సొంతం చేసుకున్నారు. పూర్తిగా లోకల్​ ఇష్యూలతో జరిగిన బిగ్​ ఫైట్​లో ఆమ్​ ఆద్మీ పార్టీ పైచేయి సాధించింది. ఈ కిటుకు కనిపెట్టడంలో ఫెయిలైన బీజేపీ చతికిలపడింది. ప్రచారానికి 11 మంది సీఎంల్ని, 200 మంది ఎంపీల్ని దింపినా ఓటర్లు పట్టించుకోలేదు. తమ ఓటుకు తగినట్లుగా పనితనం చూపించగలడని కేజ్రీవాల్​ని నమ్మారు. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 62 సీట్లను కట్టబెట్టారు. మూడు సీట్లనుంచి ఎనిమిది సీట్లకు ఎదగడం ఒక్కటే బీజేపీకి మిగిలింది.

కరెంటు కష్టాలు తీరాయి

నీళ్ల తర్వాత ప్రజలకుండే పెద్ద కష్టం కరెంటు. ఈ కష్టాలు తీర్చడంలో  కేజ్రీవాల్ గవర్నమెంట్ చాలా వరకు సక్సెస్ అయిందంటారు ఎనలిస్టులు. గతంలో కరెంటు బిల్లులు కట్టలేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవాళ్లు. ఈ పరిస్థితుల్లో 200 యూనిట్లలోపు వాడేవారికి  ఫ్రీ కరెంటు ఇచ్చే పథకం పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చాలా లాభం చేసింది. కరెంటు బిల్లుల కోసం కట్టే డబ్బులన్నీ  ఆయా వర్గాలకు ఆదా అయ్యాయి.

అవినీతి మచ్చ అంటని నేత

కేజ్రీవాల్ ది అవినీతి మచ్చలేని రాజకీయ జీవితం. ప్రత్యర్థులు కూడా ఆయనపై మిగతా విమర్శలు చేస్తారే కానీ ఫలానా ఇష్యూలో అవినీతికి పాల్పడినట్లు  ఆరోపణలు చేసే సాహసం ఎవరూ చేయలేదు. అంతేకాదు తన చుట్టూ కోటరీని కూడా ఏర్పాటు చేసుకోలేదు. ప్రజలకు ఏది లాభం చేస్తుందంటే ఆ నిర్ణయం తీసుకోవడమే బెటర్ అనే దృక్పథంతోనే  పనిచేశారు.

పొల్యూషన్​పై కమిట్​మెంట్​

ఎయిర్ పొల్యూషన్ అంశం ఆమ్ ఆద్మీ పార్టీ  విజయావకాశాలను దెబ్బతీస్తుందని కొంతమంది భావించారు. అయితే పొల్యూషన్ ఇష్యూ ఎన్నికల్లో ప్రచార అంశం కాలేదు. పొల్యూషన్ తగ్గించడానికి కేజ్రీవాల్ తన వంతు బాధ్యతగా సరి – బేసి విధానం అమలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చేతుల్లో చేయడానికి అంతకంటే ఇంకేమీ లేదని సరిపెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలు ఏం కోరుకుంటారో అదే ఇవ్వడానికి కేజ్రీవాల్ ప్రయత్నించారు.  ఇక్కడ మొత్తం క్రెడిట్​ ఆయనకే ఇవ్వలేం. 15 ఏళ్ల పాటు వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ ఇప్పడు నీరుగారిపోయి ఉంది. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ మరోసారి తన మేజిక్​ చూపిస్తారని ఆశపడినా… అనారోగ్యం వల్ల ఆమె కన్నుమూశారు. దీంతో ఆ పార్టీని నడిపించే దిక్కు లేకుండ పోయింది. బీజేపీ నాయకుల్లో ఎవరికివారే అన్నట్లుగా ప్రచారం చేయడం కూడా కేజ్రీవాల్​కి కలిసొచ్చింది. లోకల్​ లీడర్లతో సమన్వయం చేసుకోవడంలో ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్​ మనోజ్​ తివారీ ఫెయిలయ్యారని అంటున్నారు ఎనలిస్టులు.

మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ

ఢిల్లీలో వర్కింగ్ ఉమెన్ పెద్ద సంఖ్యలో ఉంటారు. ప్రతి రోజూ బస్సుల్లో, మెట్రోల్లో టికెట్లు కొని ఆఫీసులకు వెళ్తుంటారు. ఇలాంటి వారికి లాభం చేయడానికి కేజ్రీవాల్ సర్కార్ మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించింది. దీని వల్ల ప్రతి మహిళకు నెలకు 2 వేల రూపాయల వరకు ఆదా అయిందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ
ఫ్యాక్టర్ బాగా పనిచేసిందంటారు ఎనలిస్టులు.

ప్రచార తీరు మారె

ఈసారి ఎన్నికల్లో  కేజ్రీవాల్ తన ఎన్నికల స్ట్రాటజీని పూర్తిగా మార్చారు. 2015 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తరువాత 2019 లోక్​ సభ ఎన్నికలు జరిగేంతవరకు ప్రధాని నరేంద్ర మోడీని కేజ్రీవాల్ విమర్శించేవారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ నగరంలోని  మొత్తం ఏడు లోక్ సభ నియోజకవర్గలను బీజేపీ గెలుచుకోవడంతో ఒక్కసారిగా కేజ్రీవాల్  స్ట్రాటజీ మారింది. అప్పటి నుంచి నరేంద్ర మోడీ పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. మోడీ పై చిన్నపాటి విమర్శ చేసినా, మళ్లీ జాతీయ అంశాలు తెరమీదకు వస్తాయని చివరకు అది బీజేపీ విజయావకాశాలను మెరుగు పరుస్తుందని గ్రహించి తెలివిగా వ్యవహరించారు. అందుకే ఆయన ఎన్నికల ప్రచారం అంతా స్థానిక అంశాల చుట్టూనే తిరిగింది. ప్రజల కనీస అవసరాల కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి గా ఢిల్లీ ప్రజల దృష్టిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

కార్పొరేట్​కు దీటుగా సర్కారీ స్కూళ్లు

ఢిల్లీలాంటి మహా నగరంలో మంచి స్కూళ్లలో చదివించడమనేది సామాన్యులకు సాధ్యం కాదు. అలాంటిది కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ బడులను ఏర్పాటు చేసింది ‘ఆప్’ ప్రభుత్వం. ఈ స్కూళ్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్ల నుంచి  టీసీలు తీసేసుకుని,  గవర్నమెంట్ పాఠశాలలకు పంపడం మొదలెట్టారు. మోడర్న్​గా క్లాస్​ రూమ్​లు కట్టించి, అన్ని హంగులతో పక్కా బిల్డింగ్​లు నిర్మించారు. పిల్లల భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. రెగ్యులర్​గా పేరెంట్స్​తో మీటింగ్​లు పెట్టడం, వాళ్ల పిల్లల చదువులపై  టీచర్లు రివ్యూ చేయడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

స్కీమ్స్​ పాతవి, అమలే కొత్తది

నిజానికి కేజ్రీవాల్ సర్కార్ ప్రారంభించిన పాప్యులిస్టు స్కీమ్స్ ఏవీ కొత్తవి కావు. అన్నీ పాతవే. అటూ ఇటూగా  కొన్ని  రాష్ట్రాల్లో అమల్లో కూడా ఉన్నాయి. అయితే పథకాలు మొదలెట్టడమే కాదు వాటిని సమర్థంగా అమలు చేసే వ్యవస్థను కూడా కేజ్రీవాల్ ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రభుత్వం మొదలెట్టిన  ఏఏ పథకాలు ఎక్కడెక్కడ ఎలా అమలవుతున్నాయో, అమలు కాకపోతే ఎందుకు కావడం లేదో  కేజ్రీవాల్ రెగ్యులర్ గా సమీక్షించుకునేవారు. అధికారులతో మాట్లాడి అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకునేవారు.

పేదలకోసం మొహల్లా క్లినిక్స్​

ఆరోగ్యం కోసం ‘మొహల్లా క్లినిక్స్​’ మొదలెట్టారు. ఈ బస్తీ దవాఖానాలకు పేదలు ఎక్కువగా వచ్చేవారు. అన్ని రకాల చెకప్​లు చేసి, ప్రిస్క్రిప్షన్ చేతిలో పెట్టి పంపకుండా… అవసరమైన మందులుకూడా ఇచ్చేవారు. అవసరమైతే ఖరీదైన ఆపరేషన్లు  కూడా ఉచితంగా చేసేవారు. దీంతో మొహల్లా క్లినిక్​లు బాగా సక్సెస్ అయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపులో ఈ ‘మొహల్లా క్లినిక్స్​’ది కీలక పాత్ర అని అంటున్నారు ఎనలిస్టులు.

ఇంక్​ చల్లినా..వెనక్కి తగ్గలే

పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారానికొచ్చిన రికార్డు ఎన్టీఆర్​ది. ఆ నెక్ట్స్​ రికార్డు అరవింద్​ కేజ్రీవాల్​ది. ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​)ని 2012 నవంబర్​లో ఏర్పాటు చేసి, ఆ మరుసటి ఏడాది డిసెంబర్​లో పవర్​లోకి రాగలిగారు కేజ్రీవాల్​. ఢిల్లీలో 15 ఏళ్లుగా పాతుకుపోయిన కాంగ్రెస్​ని తన పార్టీ గుర్తు చీపురుతో ఊడ్చేశారు. ఆ తర్వాత వరుసగా 2015, 2020 ఎన్నికల్లోనూ గెలిచి… ఢిల్లీ ప్రజలకు ఖాస్ ఆద్మీ (నమ్మకస్తుడు) అయ్యాడు. కేజ్రీవాల్ ఇప్పడు మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కేజ్రీవాల్ మూస రాజకీయవేత్త కాదు. ఇండియన్​ రెవెన్యూ సర్వీస్​ ఆఫీసర్​. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే సాగించిన ఉద్యమంతో భుజం భుజం కలిపి నడిచిన ఉద్యమకారుడు. ఆమ్ ఆద్మీ పార్టీకి పురుడు పోసిన వాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలానికే ప్రజలు ఆదరించారు. ‘మార్పు కోసం…’ అంటూ వచ్చిన కేజ్రీవాల్ వల్ల తమ బతుకులు మారతాయని ఆశపడ్డారు. జనంలో కేజ్రీవాల్​కు పెరుగుతున్న ఆదరణ చూసి పొలిటికల్​ పార్టీలన్నీ బెంబేలెత్తాయి.

ఇక లాభం లేదనుకుని ఆయన ఇమేజ్ దెబ్బతీయడానికి నానా ప్రయత్నాలు చేశాయి. ఒక దశలో స్టింగ్ ఆపరేషన్​తో ఆయనపై బురద చల్లడానికి కూడా వెనకాడలేదు. సిమ్ కార్డులు అమ్ముకున్నారంటూ ప్రచారం మొదలెట్టాయి. అయితే, ఇవేమీ కేజ్రీవాల్ మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. ఎవరెన్ని రాళ్లేసినా, చొక్కాపై సిరా వేసి అవమానించినా కేజ్రీవాల్ వెనక్కి తగ్గలేదు. ఆయన సిన్సియారిటీ చూసి జనం కూడా ఆయన అడుగులో అడుగేస్తూ ముందుకు నడిచారు.

Latest Updates