బీహార్ పోల్స్.. మోడీ పేరు వింటే జనాల్లో ఎక్కడలేని ఉత్సాహం: ఫడ్నవీస్

ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న నమ్మకమే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపిస్తుందని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ పోల్ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రధాని మోడీ పేరు చెబితే జనాల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోందని ఫడ్నవీస్ అన్నారు. యావత్ దేశం మొత్తం ప్రజల్లో మోడీపై ఉన్న ప్రేమ, నమ్మకం అలాంటిదని ఆయన చెప్పారు. మోడీపై ఉన్న ఈ నమ్మకం కేవలం బీజేపీకి మాత్రమే కాదు, తమ మిత్ర పక్షాలకు కూడా బెనిఫిట్ అవుతోందని అన్నారు. బీహార్‌లోనూ అదే జరగబోతోందని  చెప్పారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలూ బీజీబిజీగా ఉన్నాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న.. మూడు దశల్లో జరిగే ఈ ఎలక్షన్స్‌లో మళ్లీ అధికారం సొంతం చేసుకోవాలని బీజేపీ, జేడీయూ కూటమి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సహా సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులను సైతం ఆ రాష్ట్రంలో ప్రచారంలో దించుతోంది బీజేపీ. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 121, జేడీయూ 122 సీట్లలో పోటీ చేయబోతున్నాయి. అయితే తమ కూటమిలో కొత్తగా భాగమైన హిందుస్థానీ అవామ్ మోర్చాకు జేడీయూ, వికాస్‌శఈల్ ఇన్సాన్ పార్టీకి బీజేపీ తమ కోటా సీట్లలో నుంచి కొన్నింటిని కేటాయిస్తున్నాయి. ఎన్డీఏలోనే భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మాత్రం ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తీరు వల్లే తమ పార్టీ విడిగా పోటీ చేయాల్సి వచ్చిందని  ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చెబుతున్నారు. నవంబర్ 10న ఎన్నికల కౌంటింగ్ నాడు విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మాత్రం బీజేపీ, ఎల్జేపీ కూటమేనని ఆయన ధీమాగా ఉన్నారు. ఇక కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ రావడంతో ఆ పార్టీలో హుషారు పెరిగింది.

Latest Updates