మన గడ్డపై ఆలుగడ్డ పండొద్దట

PepsiCo offers to settle case against Gujarat potato farmers
  • గుజరాత్ రైతులపై పెప్సికో జులుం
  • కాపీరైట్ హక్కులను కొల్లగొట్టారంటూ 4.2 కోట్ల దావా
  • పండించిన వాటిని నాశనం చేసేయాలని కోర్టులో డిమాండ్
  • కేసు జూన్ 12కి వాయిదా

దేశ రైతులపై కూల్ డ్రింకులమ్మే సంస్థ పెప్సీకో దావా వేసింది. ఎందుకో తెలుసా..? లేస్ చిప్స్ తెలుసుగా. ఆ చిప్స్ లో వాడే ఆలుగడ్డలను పండించినందుకంట. ఆ చిప్స్ ను తయారు చేసే ఆలుగడ్డలపై కంపెనీకి ‘కాపీ రైట్ ’ హక్కులున్నాయట. కాబట్టి ఎవరూ ఆ ఆలుగడ్డలను పండించొద్దట. గుజరాత్ రైతులు అవే ఆలుగడ్డలు పండించే సరికి కంపెనీకి కోపమొచ్చి నట్టుంది. విచిత్రంగా ఉన్నా ఇప్పటికే ఆ దిశగా సంస్థ చర్యలు కూడా మొదలెట్టేసింది.

ఈ నెలలో ఇప్పటికే పెప్సికో ఇండియా.. గుజరాత్ లో రూ.4.2 కోట్లకు కేసు వేసింది. శుక్రవారం అహ్మదాబాద్ సివిల్ కోర్టు ఆ కేసును విచారించింది. రైతులు పండించడం ఆపేస్తే కేసును వెనక్కు తీసుకుం టామని పెప్సికో తరఫు లాయరు కోర్టుకు వివరించారు. ఈ రకం ఆలుగడ్డలను తాము రిజిస్టర్ చేసుకున్నామని, కాబట్టి ఏ రైతూ వాటిని వాడడానికి వీల్లేదని చెప్పారు.ఆ రకం ఆలుగడ్డలను పండించబోమని, ఇప్పుడు పండించిన వాటిని నాశనం చేస్తామని ఒప్పుకుంటేనే కేసు వాపసు తీసుకుంటామని చెప్పారు. లేదంటే పెప్సికోతో ఒప్పందం చేసుకుని పంటను నేరుగా సంస్థకే అమ్మాలని తేల్చి చెప్పారు. ఈ ఆఫర్ పై ఆలోచించుకునేందుకు కొంత టైం కావాలని రైతుల తరఫు లాయరు చెప్పడంతో కోర్టు జూన్ 12కు కేసును వాయిదా వేసింది.

కేసులో భాగంగా మొక్కల రకాల రక్షణ, రైతు హక్కుల చట్టం 2001లోని సెక్షన్ 64ను కోర్టుకు పెప్సికో గుర్తు చేసింది. అయితే, పేటెంట్‌‌లోని మొక్కల రకాల రక్షణ, వాడకం, విత్తడం, మార్పిడి వంటివి రైతులు చేసుకోవచ్చని చెప్పే అదే చట్టంలోని సెక్షన్ 39ను రైతుల తరఫు లాయర్ ఎత్తి చూపారు.అయితే, కంపెనీ తీరుపై గుజరాత్ రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

రైతులను కార్పొరే ట్లు ఎలా దోచుకుంటున్నారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేస్ చిప్స్, పెప్సికో ఆలుగడ్డ ఉత్పత్తులను నిషేధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ తరఫున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. నేషనల్ జీన్ ఫండ్ ద్వారా కోర్టులకయ్యే ఖర్చులను భరించాలని కోరారు.రైతులకు హక్కులపై అవగాహన ఉండదని భావిం చేఇలాంటి కేసులు వేస్తు న్నారని ఆరోపించారు.  పెప్సికో పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా , డబ్ల్యూటీవో తర్వాత ఇండియాలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్ ) కింద రైతులపై కేసువేయడం ఇదే తొలిసారని గుజరాత్ ఖేదుత్ సమాజ్ బద్రీభాయ్ జోషి అన్నారు. ఇలాంటి ఘటనలు రైతుల భవిష్యత్తు పై ప్రభావం చూపిస్తాయని హెచ్చరిం చారు.

Latest Updates