తాపీ మేస్త్రీ తమ చెల్లిని ప్రేమించాడని… ఇంటిముందే తెగనరికారు

person-attacked-by-girl-family-members-in-tamilnadu

చూస్తేనే ఒల్లు జలదరించే సంఘటన ఇది. చదివితే ఒళ్లు గగుర్పొడిచే దారుణం ఇది. తమ ఇంటి అమ్మాయిని ప్రేమించిందని .. ఆ యువకుడి ఇంటికి వెళ్లి మరీ అత్యంత కిరాతకంగా దాడిచేశారు అమ్మాయి కుటుంబసభ్యులు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో దారుణం జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు హాస్పిటల్ లో చావుతో పోరాడుతున్నాడు. దాడి ఘటన ప్రత్యక్షంగా చూసినవాళ్లు భయంతో వణికిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలోనూ రికార్డై ఇపుడు బయటకు వచ్చాయి.

తిరుచ్చి జిల్లా… తిరువనాయి కోయిల్.. తిమ్మరాయ సముద్రంలో మణికంఠ అనే యువకుడు… కూలీగా పనిచేస్తున్నాడు. బిల్డింగ్ పనుల్లో తాపీ మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక భారతి వీధికి చెందిన ఓ అమ్మాయి, మణికంఠ ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం… అమ్మాయి అన్న శివకు తెలిసింది. తాపీమేస్త్రీతో ప్రేమవ్యవహారం ఏమాత్రం నచ్చని శివ.. తన కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ను వెంటపెట్టుకుని… మణికంఠ ఇంటికి వెళ్లాడు. ఇంట్లోనుంచి ఎప్పుడెప్పుడు బయటకొస్తాడా అని ఎదురుచూసిన వాళ్లు… మాటువేసి.. రాడ్లు,కత్తితో దాడిచేశారు. అతడి ఇంట్లోకి వెళ్లి మరీ రాడ్లతో కొడుతూ.. కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో విచక్షణ లేకుండా నరికారు. ముందు ప్రతిఘటించినా.. కత్తి గాట్లతో అతడు నిస్సహాయ స్థితిలో కింద కుప్పకూలిపోయాడు. ఐనప్పటికీ.. వాళ్లు  కత్తి, రాడ్లతో కొట్టి తమ కసి తీర్చుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు.

తీవ్రంగా గాయపడిన యువకున్ని స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. యువకుడి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates