త‌న ఫిర్యాదు ప‌ట్టించుకోలేదంటూ సెల్ టవర్ ఎక్కి యువ‌కుడి హల్ చల్

చిత్తూరు: త‌న ఫిర్యాదును పోలీసులు ప‌ట్టించుకోలేదంటూ రామకుప్పంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హ‌ల్ చ‌ల్ చేశాడు. త‌న‌కు న్యాయం చేయ‌కుంటే సెల్ టవర్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. వివరాల్లోకి వెళ్తే.. రామకుప్పం మండలం ముద్దనపల్లె గ్రామానికి చెందిన నారాయణస్వామి (30) చీటీల వ్యాపారి లోకేష్ కు రూ.40వేలు చీటి డబ్బులు ఇవ్వాల్సివుంది. కాగా, గురువారం లోకేష్ చీటి డబ్బుల విషయమై నారాయణస్వామితో గొడవ పడ్డాడు లోకేష్. ఈ క్రమంలో నారాయణ స్వామిని లోకేష్ కొట్టడంతో తనకు న్యాయం చేయాలంటూ నారాయణస్వామి రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే, పోలీసులు లోకేష్ తో కుమ్మక్కై ఫిర్యాదు చేసిన తననే కొట్టారంటూ నారాయణస్వామి శుక్ర‌వారం రామకుప్పం పోలీస్ స్టేషన్ సమీపంలోనే సెల్ టవర్ ఎక్కాడు. న్యాయం చేయకపోతే పైనుండి దూకేస్తానని హల్చల్ చేయడంతో పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకొని నారాయణస్వామికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా కిందకు దిగేందుకు నారాయణస్వామి ససేమిరా అనడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Latest Updates