ఒకప్పుడు ఇంటి నాలుగు గోడలకే మధ్యే ఉండే పెంపుడు కుక్కలు, పిల్లులు ఇప్పుడు మనుషులతోపాటు కెఫేల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. పెట్స్‌ను ఫ్యామిలీ మెంబర్స్‌లా చూస్తుండడంతో సిటీలో పెట్-ఫ్రెండ్లీ కెఫేలు పుట్టుకొచ్చాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ఉన్నపెట్ కెఫేలు పెట్స్‌కి స్వాగతం పలుకుతున్నాయి. పెట్స్ యజమానులంతా ఒకచోట చేరి సరదాగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడానికి ఈ కెఫేలు బెస్ట్ ప్లాట్‌ఫామ్స్ అయ్యాయి. అంతేకాదు.. పెట్స్ కోసం స్పెషల్ మెనూ, ప్లే జోన్, బర్త్‌డే పార్టీ, అడాప్షన్ ఈవెంట్లతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాయి.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిలింనగర్, కోకాపేట, సికింద్రాబాద్, సైనిక్ పురి, బేగంపేట.. ఇలా పలు ప్రాంతాల్లో పెట్-ఫ్రెండ్లీ కెఫేలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పెంపుడు జంతువులకు ప్రత్యేకంగా కూర్చునే ప్రదేశాలు, ఆట వస్తువులు, ప్రత్యేక మెనూలు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ కెఫేలు. సోషల్ మీడియాలో పెట్స్‌తో దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఇవి బాగా ఫేమస్ అవుతున్నాయి. వీకెండ్స్‌లో అయితే పెట్ లవర్స్కోసం నిర్వహించే మీటప్స్, బర్త్‌డే పార్టీలకు కూడా ఈ కెఫేలు వేదికలుగా మారుతున్నాయి. ఈ కెఫేల్లో వివిధ జాతుల కుక్కలు, పిల్లులు కనువిందు చేస్తాయి.
పెట్స్‌తో ఆడుకోవచ్చు..
బంజారాహిల్స్ వెంకట్ నగర్ బీఎన్ఆర్ కాలనీలోని ‘రోస్టరీ కాఫీ హౌస్’ ఒక బంగ్లాను మోడర్న్ కెఫేగా మార్చింది. ఇక్కడ ఓ వైపు కాఫీ సిప్ చేస్తూ.. మరోవైపు పెట్స్‌తో ఆడుకోవచ్చు. తమ పెంపుడు జంతువులు ఇతర జంతువులతో కలిసి ఆడుకుంటున్నప్పుడు, ప్రశాంతంగా సమయం గడపాలనుకునే వారి కోసం కూడా సౌకర్యాలున్నాయి. పెట్ ఓనర్స్ అమెరికన్, కాంటినెంటల్, ఇటాలియన్ రుచులతోపాటు పిజ్జా, బర్గర్లు ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. అలాగే, రాయదుర్గ్‌లోని బీఎన్ రెడ్డి కాలనీలోని ‘లిల్లీ -ద బోహో కెఫే’లో మ్యాంగో ఫుడ్డింగ్, బేబీ కార్న్ ఫ్రైస్, కొరిసెంట్ చికెన్‌ను ఆస్వాదిస్తూ పెట్స్‌తో గడపొచ్చు. ఈ కెఫేలో పెట్స్‌కి ఇష్టమైన బాయిల్డ్ చికెన్ కూడా ఉంటుంది.
మాదాపూర్ కావూరిహిల్స్‌లో ఉన్న ‘వైల్డ్ గోట్ కెఫే’లోని కార్నర్ టేబుల్‌పై పెట్‌తో కలిసి భోజనం చేయొచ్చు. జూబ్లీహిల్స్‌లోని పార్క్ వ్యూ ఎన్‌క్లేవ్‌లో ఉన్న ‘అర్బన్ నేమో కెఫే అండ్ గార్డెన్’ నేచర్ లవర్స్‌కే కాదు సూపర్ పెట్ ఫ్రెండ్లీ కూడా అంటారు కస్టమర్స్. జూబ్లీహిల్స్ సీబీఐ కాలనీలోని ‘ద హోల్ ఇన్ ద వాల్ కెఫే’ పిల్లులకు సేఫెస్ట్ ప్లేస్ అంటున్నారు.
రెస్క్యూ చేసిన వాటికి ఆశ్రయం
ఎనిమిదేండ్ల కిందట దేవెన్ బహేటి, సోనమ్ సింగ్‌లు బంజారాహిల్స్ రోడ్డు నంబరు12లోని ‘ద పెట్ కెఫే’ను కలిసి ఏర్పాటుచేశారు. వివిధ వాహనాలు తగలడం లేదా ఇతర కారణాల వల్ల గాయపడిన జంతువులను రక్షించి, వాటికి ఆశ్రయం కల్పిస్తోంది ఈ కెఫే. ‘‘మా పెట్ కెఫేలో కుక్కలు, పిల్లులు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి కళ్లు కనిపించవు. మరికొన్ని పక్షవాతంతో బాధపడుతున్నాయి. ప్రతీ పెంపుడు జంతువుకు ఒక కథ ఉంటుంది. మేం రెస్క్యూ చేసి కెఫేలో ఉంచిన జంతువులతో సమయం గడపాలనుకునే పెట్ లవర్స్ చాలామంది ఇక్కడకు వస్తుంటారు’’ అని పెట్ కెఫే నిర్వాహకుడు దేవెన్ బహేటి చెప్పారు. గత ఎనిమిదేండ్లలో తాము 786 జంతువులను దత్తత తీసుకున్నట్లు దేవెన్ తెలిపారు.
పెట్స్‌తో ఆడితే ఒత్తిడి దూరం
పెట్లవర్స్ కెఫేకు వచ్చి గంటల తరబడి గడపడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కాసేపు ప్రశాంతత కోసం కెఫేలకు వచ్చిన జంతు ప్రేమికులు 2 నుంచి 4 గంటలు గడుపుతుంటారు. అలా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంటారు. ఈ కెఫేలో రకరకాల వంటకాలు, ఫొటో బూత్, ప్రత్యక్ష కార్టూన్లు,పెట్స్ ప్లే జోన్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ‘‘మా జంతువులన్నింటికీ టీకాలు వేయడం వల్ల పెట్ లవర్స్‌కు పూర్తి సేఫ్టీ ఉంటుంది. దీంతో పబ్లిక్ కూడా వాటిని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు’’ అని చెప్పారు పెట్ నిర్వాహకురాలు సోనమ్ సింగ్.
రోజురోజుకు పెరుగుతున్నాయి
మణికొండ ప్రాంతంలో ఉన్న ‘కెఫే డి లోకో’ సిటీలో ఫేమస్ పెట్ కెఫేలలో ఒకటి. ఇక్కడ కుక్కల కోసం ప్రత్యేక ఆహారం, విశాలమైన ఓపెన్ స్పేస్, పెట్ ఈవెంట్లు దీని ప్రత్యేకత. ఈ కెఫేలు పెట్స్‌తో కలిసి కూర్చునేందుకు అవుట్‌డోర్ లేదా గార్డెన్ సీటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇదే కాకుండా సిటీలో పెట్ ఫ్రెండ్లీ కెఫేల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బెల్ పోస్టో ద కెఫే, లాస్ట్ హౌస్ బై ద లేక్, బ్యాక్ యార్డ్, లే వాంటేజ్ కెఫే బార్, కహానీ, బాతాఖానీ, ద గ్రైండ్, థిస్ ఈజ్ ఇట్, అరోమలే కెఫే అండ్ క్రియేటివ్ కమ్యూనిటీ, అస్టర్ కెఫే అండ్ కిచెన్లు ఫ్రెండ్లీ పెట్ కెఫేలుగా ఫేమస్ అయ్యాయి. సిటీలో టాప్ సెవెన్ పెట్ ఫ్రెండ్లీ కెఫేలకు జొమాటో రేటింగ్ కూడా ఇచ్చింది. వాటిలో ఐరన్ హిల్స్, రోస్టరీ కాఫీ హౌస్, ఈ వోక్ ద వెగాన్ కెఫే వంటివి ఉన్నాయి. స్విగ్గీ డైన్ అవుట్ జాబితాలో చోటు దక్కించుకున్న బెల్ పోస్టో ది కెఫేలో ఆర్టిసన్ కాఫీ, బ్రేక్‌ఫాస్ట్ క్రోయిసెంట్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
పెట్స్ రెసిడెంట్ జోన్
జూబ్లీహిల్స్‌లో ఓ వెజిటేరియన్ రెస్టారెంట్లో కింది భాగంలో ప్రత్యేకంగా పెట్స్ లవర్స్ కోసం తేజస్వీ ‘పెట్స్ రెసిడెంట్ జోన్’ ఏర్పాటుచేశారు. ‘‘చిన్నప్పటి నుంచి నాకు ఒక పెంపుడు జంతువు కావాలని ఉండేది. కానీ మా కుటుంబం దానికి ఒప్పుకోలేదు. నేను నా చుట్టూ ఉన్న వారితో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, ఇది కేవలం నా కథ మాత్రమే కాదని నాకు అర్థమైంది. దేశం అంతటా ఎన్నో కుటుంబాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
కొందరు ఒక పెంపుడు జంతువును పెంచుకోవాలని ఎంతగానో కోరుకుంటారు. కానీ దాని పోషణ ఖర్చు, బాధ్యత మానసిక భారం కావొచ్చు. తగినంత సమయం లేదా ఇంట్లో సరైన స్థలం లేకపోవడం కావొచ్చు. అందుకే జంతువులతో గడిపే ఒక ప్రదేశాన్ని మేం సృష్టించాలనుకున్నాం. ఆ ఆనందాన్ని ప్రజలకు కొద్దికాలం పాటు అరువుగా ఇవ్వడమే మా లక్ష్యం” అని తేజస్వీ చెప్పారు. అంతేకాదు.. ‘‘ఒక కుక్క మీ ఒడిలో తలపెట్టి విశ్రాంతి తీసుకోవడం లేదా ఒక పిల్లి మీ పక్కన ముడుచుకుని పడుకోవడం వల్ల ఒత్తిడి తక్షణమే తగ్గుతుంది. ఫోన్ చూడటం మానేస్తారు. పెంపుడు జంతువులు మనలో ఒక విధమైన ఉత్తేజాన్ని కలిగిస్తాయి’’ అంటారామె.
ఆన్లైన్ పెట్ బేకరీ.. డాగ్ ఎలీషియస్
పెంపుడు జంతువులకు జన్మదిన వేడుకల సందర్భంగా వాటి ఓనర్స్ బర్త్ డే పార్టీలు నిర్వహిస్తుంటారు. వాటి కోసం ప్రత్యేకంగా కస్టమైజ్డ్ బర్త్‌డే కేక్స్, కప్‌కేక్స్, డోనట్స్, కుకీస్, ట్రీట్‌లు, యాక్సెసరీలు అందించేందుకు హైదరాబాద్‌కి చెందిన సౌమ్య ఆన్లైన్ బేకరీని ఏర్పాటుచేశారు. ‘‘కుటుంబంలోని ఇతర సభ్యుల్లాగే పెంపుడు జంతువులు కూడా ప్రత్యేక క్షణాలను జరుపుకోవడానికి అర్హమైనవని నేను ఎప్పుడూ భావించేదాన్ని. మనుషుల కోసం పలు రకాల కేకులు అందుబాటులో ఉన్నప్పటికీ, పెంపుడు జంతువుల కోసం సురక్షితమైన, కస్టమైజ్డ్ ఆహారాల కొరతను నేను గమనించాను. అదే పెట్ కిచెన్ పెట్టడానికి ప్రేరేపించింది. చాలా ఫ్యామిలీల్లో పెట్స్ కూడా విలువైన సభ్యులే. అందుకే వాటి యజమానులు తమ పెట్స్ ఫుడ్ గురించి మరింత శ్రద్ధ వహిస్తున్నారు. పెట్స్ పుట్టినరోజు వేడుకలు, దత్తత వార్షికోత్సవాలు, నామకరణ వేడుకలు, ఇతర ప్రత్యేక సందర్భాల కోసం మాకు ఆర్డర్‌లు వస్తుంటాయి’’ అని సౌమ్య చెప్పారు.
పెట్ పేరెంట్స్ కల్చర్
సిటీ పబ్లిక్‌లో పెట్ ఓనర్స్ అనే పదానికి బదులుగా ‘పెట్ పేరెంట్స్’ అనే భావన బలపడుతోంది. తమ పెంపుడు జంతువుల కోసం స్పెషల్ ఫుడ్, వస్త్రాలు, ఫొటోషూట్లు, అవుటింగ్‌లు ఏర్పాటు చేయడం కొత్త లైఫ్ స్టైల్‌గా మారుతోంది. దీంతో కాఫీ కప్పుతోపాటు ప్రేమ, స్నేహం, ఆప్యాయతలను పంచుకునే ఈ కెఫేలు హైదరాబాద్‌లో కొత్త సోషల్ కల్చర్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.
ప్రత్యేక వంటగది
గచ్చిబౌలిలో ఉన్న ‘కెఫే డి లోకో’లో పెట్ లవర్స్ ఒకరితో మరొకరు వారి పెంపుడు జంతువులతో అనుబంధం పెంచుకోవడానికి సాయపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. వారి దగ్గర పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక వంటగది ఉంది. పెట్స్‌కు బిర్యానీ, మీట్ లోఫ్, ఫ్రెంచ్ టోస్ట్‌ను అందిస్తుంది. ఈ కెఫేలో ఒక పెట్ స్కూల్ కూడా ఉంది. కెఫేలో మీరు మీ స్నేహితులతో సమయం గడుపుతున్నప్పుడు మీ పెంపుడు కుక్క రోజంతా ఇతర పెంపుడు జంతువులతో కలిసిమెలిసి ఉంటుంది.
