చైనాకు అమెరికా చెక్.?

చైనా–అమెరికాల మధ్య ట్రేడ్‌‌‌‌వార్‌‌‌‌ కొత్త టర్న్‌‌‌‌ తీసుకోబోతోందా ?   తమ ఎక్సేంజ్​‌‌‌‌లలో ట్రేడవుతున్న  చైనా కంపెనీల షేర్లను    డీలిస్ట్‌‌‌‌ చేయాలని  అమెరికా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలతో   ఇటు అమెరికాలోని పెద్ద,  పెద్ద ఫండ్‌‌‌‌ మేనేజర్లు, అటు చైనా కంపెనీల బాస్‌‌‌‌లు  భయాందోళనలో పడ్డారు.   డీలిస్టింగ్‌‌‌‌ ఆలోచనేదీ లేదని, ఆ ప్రచారం అబద్ధమని వైట్‌‌‌‌హౌస్‌‌‌‌ ట్రేడ్‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌ పీటర్‌‌‌‌ నవరో సోమవారం వివరణ ఇచ్చిన తర్వాత  జేడీ.కామ్‌‌‌‌, అలీబాబా గ్రూప్‌‌‌‌  వంటి చైనా కంపెనీల షేర్లు  కోలుకున్నాయి.

నవరో మాటలు ఇన్వెస్టర్లలో భయాలను కొంత తగ్గించినా,  భవిష్యత్‌‌‌‌లో అమెరికా ప్రభుత్వం చైనా కంపెనీలను యూఎస్‌‌‌‌ ఎక్సేంజ్​‌‌‌‌ల నుంచి  వెళ్లగొట్టొచ్చనే అనుమానాలు మాత్రం ఇంకా ఇన్వెస్టర్లను పట్టి పీడిస్తున్నాయి.  బ్లాక్‌‌‌‌రాక్‌‌‌‌, టీ. రోవ్‌‌‌‌ ప్రైస్‌‌‌‌ అసోసియేట్స్‌‌‌‌, వాన్‌‌‌‌గార్డ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ సహా పలు యూఎస్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ సంస్థలు  దాదాపు 40 బిలియన్ డాలర్లు (2,84,568 కోట్లు ) అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయి.   సోమవారం తర్వాత చైనా మార్కెట్లకు వారం రోజులు సెలవులు. పీపుల్స్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ చైనా ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సెలవులు ప్రకటించారు.  యూఎస్‌‌‌‌లో లిస్టయిన చైనా కంపెనీలలో షేర్ల ట్రేడింగ్‌‌‌‌ మాత్రం  యథాప్రకారం జరుగుతుంది.  ఆ షేర్లలో ఒడిదుడుకులు హెచ్చుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

చైనా కంపెనీల విషయంలో ఇప్పటికే అమెరికా స్టాక్‌‌‌‌ ఎక్సేంజీల్లో వివక్ష కనిపిస్తోంది. చిన్న సైజు చైనా కంపెనీలు పబ్లిక్‌‌‌‌ ఇష్యూ ప్రతిపాదనలతో ముందుకు వస్తే  నాస్​డాక్​‌‌‌‌  అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్టు విమర్శలున్నాయి.  చైనా కంపెనీలు అమెరికా మార్కెట్లో లిస్టింగ్‌‌‌‌ కోరుకుంటున్నప్పటికీ, నిధుల సమీకరణలో ఎక్కువ భాగం చైనా నుంచే తెచ్చుకుంటున్నాయనేది నాస్​డాక్​‌‌‌‌ వాదన. అమెరికా ఇన్వెస్టర్ల పెట్టుబడులు వీటిలో తక్కువగానే ఉంటున్నాయని నాస్​డాక్​‌‌‌‌  చెబుతోంది. కొన్ని కంపెనీల షేర్లలో లిక్విడిటీనే ఉండటం లేదని అంటోంది. గతేడాది చైనా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫార్మసీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌  సంస్థ ఒకటి నాస్​డాక్​‌‌‌‌ లిస్టింగ్‌‌‌‌ ద్వారా 10 కోట్ల డాలర్లు సమీకరించింది. ఎక్కువ భాగం  షేర్లను కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్స్‌‌‌‌ పరియస్తులకు, సన్నిహితులకు  విక్రయించారు. అలాగే మరికొన్ని చైనా కంపెనీల్లో కూడా చైనా వాళ్లకే ఎక్కువ వాటాలుంటున్నాయి. దీనివల్ల  అమెరికా ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఉండటం లేదన్నది నాస్​డాక్​‌‌‌‌ వర్గాల వాదన. ఈ కంపెనీలకు చెక్‌‌‌‌ పెట్టేందుకు నాస్​డాక్​‌‌‌‌ కొత్త లిస్టింగ్‌‌‌‌ నిబంధనలను కూడా తెరపైకి తెచ్చింది. ఈ నిబంధనలు కేవలం నిధుల సమీకరణ కోసమే అమెరికా లిస్టింగ్‌‌‌‌కు ఎగబడే చైనా కంపెనీలకు చెక్‌‌‌‌ పెట్టే అవకాశం ఉంది.

అక్కడి కంటే ఇక్కడే బెటర్‌‌‌‌…

చైనాలోని కంట్రోల్స్​వల్ల తమకు కావల్సిన డాలర్లను సమకూర్చుకోవడం చైనా కంపెనీల ప్రమోటర్లు, వారి సన్నిహితులకు వీలు కాదు. ఈ కారణంతోనే ఆ కంపెనీలు నాస్డాక్‌‌‌‌ లిస్టింగ్‌‌‌‌ కోసం ఎగబడుతున్నాయి. నాస్డాక్‌‌‌‌ లిస్టింగ్ హోదా చూపించి, చైనాలో అప్పులు ఇచ్చే వాళ్లను సమాధానపరచడం సులభం కావడంతోనూ చైనా ప్రమోటర్లు అందుకు ఇష్టపడుతున్నారు. పబ్లిక్‌‌‌‌ ఇష్యూకు వెళ్లినందుకు చైనాలోని లోకల్‌‌‌‌ అథారిటీస్‌‌‌‌ నుంచి ఇన్సెంటివ్స్‌‌‌‌ను కూడా ఆ కంపెనీలు పొందుతున్నాయి.  చైనా స్టాక్‌‌‌‌ మార్కెట్లో లిస్టింగ్‌‌‌‌ పొందడం నాస్డాక్‌‌‌‌లో పొందడమంత సులభం కాదు. చైనా స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ లిస్టింగ్‌‌‌‌ చాలా కఠినమైనది. ముఖ్యంగా నష్టాలతో నడిచే కంపెనీలు చైనా స్టాక్‌‌‌‌ మార్కెట్లో ఐపీఓలు చేయలేవు. పక్కనే ఉన్న హాంకాంగ్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌ రూల్స్‌‌‌‌ కూడా నాస్డాక్‌‌‌‌తో పోలిస్తే కఠినమేనని చెబుతారు. రెఫినిటివ్‌‌‌‌ డేటా ప్రకారం 2000 సంవత్సరం నుంచీ చూస్తే, అమెరికా స్టాక్‌‌‌‌ మార్కెట్లో చైనా కంపెనీలు 7000 కోట్ల  డాలర్లకు పైగా నిధులు సమీకరించాయి. నాస్‌‌‌‌డాక్‌‌‌‌ తరహాలోనే యూఎస్‌‌‌‌లో మరో ప్రధాన స్టాక్‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌ అయిన న్యూయార్క్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌ కూడా   చైనా కంపెనీల లిస్టింగ్‌‌‌‌  పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  ఐతే, నాస్డాక్‌‌‌‌ తరహాలో నిబంధనల మార్పును ఇప్పటిదాకా న్యూయార్క్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌ ప్రకటించలేదు.