పెట్రో రేట్లు తగ్గాల్సిందే

పెట్రో రేట్లు తగ్గాల్సిందే
  • ఎకానమీ ఓకే.. వ్యాపారాలు బాగున్నయ్‌
  • క్రిప్టోకరెన్సీపై త్వరలో ప్రకటన చేస్తం
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ప్రస్తుత పెట్రో రేట్ల వల్ల జనంపై విపరీతమైన భారం పడుతున్నదని, ధరలు తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ అన్నారు. పెట్రోల్‌‌, డీజిల్‌‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఎక్కువగా పన్నులు వేస్తున్నాయని, వీటిని తగ్గించడానికి ఇరు వర్గాలూ చర్చించాలని ఆమె సూచించారు. పెట్రో ప్రొడక్టులను జీఎస్టీ పరిధిలోకి తేవాలా ? వద్దా ? అనే విషయంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.   ఢిల్లీలో ఇండియన్ విమెన్స్‌ ప్రెస్‌కార్ప్స్‌ నాయకులతో ఆమె మాట్లాడుతూ కేంద్రం ఎక్సైజ్‌‌, రాష్ట్రాలు వ్యాట్‌‌/సేల్స్‌‌ ట్యాక్సులను పెంచుతూ పోవడం వల్ల ధరలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోల్‌‌ రేటు రూ.100కు చేరిన నేపథ్యంలో మంత్రి ఈ కామెంట్స్‌‌ చేశారు. పెట్రోల్‌‌ ధరలో 60 శాతం వరకు ట్యాక్సులే ఉంటున్నాయి. వీటిని తగ్గించాలనే డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. పెట్రో ప్రొడక్టులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని చాలా మంది కోరుతున్నారు. దీనిపై నిర్మల స్పందిస్తూ కేంద్రంతోపాటు రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఇది జరుగుతుందని చెప్పారు. 

క్రిప్టో కరెన్సీపై...

బిట్‌‌కాయిన్‌‌ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను బ్యాన్‌‌ చేయబోతున్నారన్న వార్తలపై స్పందిస్తూ ఈ విషయం గురించి తాము ఆర్‌‌బీఐతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. ‘‘క్రిప్టోకరెన్సీపై ఆర్‌‌బీఐకి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అన్ని ప్రపోజల్స్‌‌ను పరిశీలిస్తున్నాం. ఒక విధానాన్ని ఖరారు చేశాక ప్రకటన చేస్తాం. మన ఎకానమీ పుంజుకుంటోంది. తాము పూర్తిస్థాయి కెపాసిటీతో వ్యాపారం చేస్తున్నామని చాలా ఇండస్ట్రీ గ్రూపులు నాకు చెప్పాయి. చాలా సెక్టార్ల నుంచి పాజిటివ్‌‌ రెస్పాన్స్‌‌లు వచ్చాయి’’ అని వివరించారు. ఇండస్ట్రీలకు సాయం చేయడానికి రూ.27 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అప్పుల ద్వారానే స్టిములస్‌‌ ఇచ్చామని, ఈ భారాన్ని ట్యాక్స్‌‌పేయర్లపై మోపబోమని నిర్మల అన్నారు.

కెయిర్న్ ఆర్బిట్రేషన్ ఐటీ దాడులు

రెట్రోస్పెక్టివ్‌‌ ట్యాక్స్‌‌ కేసులో కెయిర్న్‌‌ కంపెనీకి 1.2 బిలియన్‌‌ డాలర్ల అవార్డు ఇవ్వడంపై ప్రభుత్వం అప్పీల్‌‌ చేస్తుందని చెప్పారు. పన్నులు వేసే హక్కు తమకు ఉంటుందని, కెయిర్న్‌‌ ఆ హక్కును ప్రశ్నించడం సాధ్యం కాదని అన్నారు. అప్పీలు చేయడం తన డ్యూటీ అన్నారు. కెయిర్న్‌‌ వల్ల ఎఫ్‌‌డీఐలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని తరచూ విమర్శించే అనురాగ్‌‌ కశ్యప్‌‌, తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు జరగడంపై మాట్లాడుతూ 2013లోనూ దాడులు జరిగాయని అన్నారు. పన్నుల ఎగవేతే ఇందుకు కారణమని అన్నారు. గత ప్రభుత్వాలు యాక్టర్లపై దాడులు చేస్తే తప్పు లేనప్పుడు, తాము దాడులు చేస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కొందరు వ్యక్తుల ఇండ్లపై ఐటీ దాడులపై స్పందించాలని అడగడం సరికాదని అన్నారు.