లవర్‌కి వేరే పెళ్లి.. కోపంతో ఆమె కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పు

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమించిన అమ్మాయిని తనకిచ్చి పెళ్ళి చేయలేదని నిద్రిస్తున్న అమ్మాయి కుటుంబసభ్యులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సజీవదహనం కాగా మరో ఇద్దరు ఎనభైశాతం గాయాలతో కొన ఊపిరితో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు చిన్నారులకు కూడా గాయాలయ్యాయి. నిందితుడు శ్రీనువాస్ రాత్రి ఒంటి గంటన్నర సమయంలో దుళ్ల పెట్రోల్ బంకులో సీసాలో పెట్రోల్ కొట్టించుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది.

శ్రీనువాస్ ఈ నెల 17న కూడా అమ్మాయి ఇంటి పైకి గొడవకు వచ్చి అమ్మాయి తల్లిని కత్తితో నరికాడు. ఆ దాడిపై అమ్మాయి కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేసినా.. పోలీసులు కనీసం విచారణకు కూడా రాలేదు. దాడిలో గాయపడ్డ తల్లిని చూడటానికి భీమవరంలో ఉండే పెద్ద కుమార్తె గంటా దుర్గాభవాని పిల్లలతో కలిసి పరామర్శకు వచ్చింది. వీరంతా రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో.. వారి దగ్గరి బంధువైన నిందితుడు శ్రీనువాస్ వారింటికి వచ్చి గదిలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో ఆ మంటల్లో అమ్మాయి తమ్ముడు కోట్ని రాము(18), అక్క కూతురు విజయలక్ష్మి (5) సజీవ దహనం అయ్యారు. తల్లి సత్యవతి, అక్క దుర్గా భవానిలు చావు బతుకుల మధ్య ఉన్నారు. అక్క కుమారులు ఏసు కుమార్, దుర్గా మహేష్‌లకు గాయాలయ్యాయి. అమ్మాయిని ముందుగా నిందుతుడు శ్రీనువాస్‌కి ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించారు. కానీ, శ్రీనువాస్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసి..ఏడాదిన్నర క్రితం వేరే అబ్బాయికిచ్చి వివాహం చేశారు. దాంతో కక్ష పెంచుకున్న శ్రీనువాస్ అమ్మాయి కుటుంబంపై దారుణానికి ఒడిగట్టాడు.

For More News..

మార్కెట్‌పై ఉగ్రవాదుల దాడి.. 36 మంది మృతి

ఇంటర్ బాలుడిపై 11 మంది విద్యార్థుల లైంగిక దాడి

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

Latest Updates