
- టాప్ యూపీఐ యాప్ ఫోన్‌పే
- ఎన్పీసీఐ డిసెంబర్ డేటాలో వెల్లడి
- 90 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్
న్యూఢిల్లీ: గూగుల్ పేని దాటేసి మరీ డిసెంబర్లో టాప్ యూపీఐ యాప్‌గా ఫోన్‌పే నిలిచింది. గత నెలలో ఫోన్‌పే 90.20 కోట్ల లావాదేవీలను జరపగా.. వాటి విలువ రూ.1.82 లక్షల కోట్లుగా ఉన్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డేటాలో వెల్లడైంది. వాల్‌మార్ట్‌కు చెందిన ఈ పేమెంట్ యాప్ గూగుల్ పేను దాటేసినట్టు ఎన్పీసీఐ డేటా పేర్కొంది. యూపీఐ ట్రాన్సాక్షన్ వాల్యుమ్‌లో ఫోన్‌పే 3.87 శాతానికి పైగా గ్రోత్‌ను రికార్డు చేసింది. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో ఫోన్‌పే ట్రాన్సాక్షన్ వాల్యులో కూడా 3.8 శాతం గ్రోత్ నమోదైంది. నవంబర్‌లో ఈ పాపులర్ పేమెంట్ యాప్ 86.84 కోట్ల లావాదేవీలను రికార్డు చేసింది. వీటి వాల్యు రూ.1.75 లక్షల కోట్లుగా ఉంది. మరోవైపు గూగుల్ పే ట్రాన్సాక్షన్ వాల్యుమ్ నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 11 శాతం తగ్గింది. దీంతో రెండో స్థానంలోకి గూగుల్ పే చేరింది. 85.44 కోట్ల లావాదేవీలను గూగుల్ పే డిసెంబర్లో నిర్వహించగా.. వీటి వాల్యు రూ.1.76 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. నవంబర్‌లో గూగుల్ పే 96 కోట్ల లావాదేవీలను రూ.1.61 లక్షల కోట్లుగా రిపోర్ట్ చేసింది.
ఫోన్‌పే, గూగుల్ పే రెండూ కలిపి డిసెంబర్ నెలలో మొత్తం యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాల్యుమ్‌లో 78 శాతానికి పైగా షేరును దక్కించుకున్నాయి. వీటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ మొత్తంగా 2,23.41 కోట్లుగా ఉన్నాయి. మొత్తం యూపీఐ ట్రాన్సాక్షన్ వాల్యులో ఈ రెండు యాప్స్‌కి 86 శాతానికి పైగా వాటా ఉంది. వీటి వాల్యు రూ.4,16,176.21 కోట్లుగా రికార్డయింది. ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత మూడో స్థానంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. ఎన్పీసీఐ డేటా ప్రకారం ఇది రూ.31,291.83 కోట్ల విలువైన 25.63 కోట్ల లావాదేవీలను రికార్డు చేసింది. ట్రాన్సాక్షన్ వాల్యుమ్‌లో లీడింగ్ యూపీఐ యాప్స్‌లో అమెజాన్ పే నాలుగో స్థానంలో, ఎన్పీసీఐ భీమ్ యాప్ ఐదో స్థానంలో ఉన్నట్టు ఎన్పీసీఐ డేటా పేర్కొంది.