కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్?

కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్?

న్యూఢిల్లీ: దేశంలో మరోమారు హ్యాకింగ్ కలకలం చెలరేగింది.  పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న వార్త సంచలనం రేపుతోంది. తాజాగా లీక్ అయిన ఓ డేటాబేస్‌లో వారందరి ఫోన్ నంబర్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. మోడీ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు కీలక విపక్ష నేతలు, సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితోపాటు 40 మంది జర్నలిస్టులు, భద్రతా సంస్థల తాజా, మాజీ అధిపతులు నంబర్లు ఈ జాబితాలో ఉన్నాయని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్ కంపెనీకి చెందిన పెగాసస్ అనే స్పైవేర్ సాయంతో ఈ హ్యాకింగ్ జరిగినట్లు తెలుస్తోందని ప్రముఖ వార్తా సంస్థ ‘ది వైర్’ ఓ కథనంలో వెల్లడించింది. 

ఈ హ్యాకింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో తమ జోక్యం ఏమీ లేదని కేంద్ర సర్కారు తేల్చిచెప్పింది. దేశ ప్రజల గోప్యతా హక్కును రక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ‘ది వైర్’ కథనం ప్రకారం.. పెగాసస్‌తో టార్గెట్‌గా చేసుకున్న వారి లిస్టులో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారు. ఇందులో కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయ నిపుణులు, బిజినెస్‌మెన్లు, ప్రభుత్వ అధికారులు, సైంటిస్టులు, పౌర హక్కుల కార్యకర్తలు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇండియాతోపాటు అజర్‌బైజాన్, బహ్రెయిన్, హంగేరి, మెక్సికో, మొరాకో, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందిన ప్రముఖుల పేర్లు ఈ డేటాబేస్‌లో ఉండటం గమనార్హం.