ఇళ్ల మ‌ధ్య కూలిన విమానం: ఫ్లైట్ లో 90 మంది ప్ర‌యాణికులు

పాకిస్థాన్ లో ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగింది. కొద్ది క్ష‌ణాల్లో విమానాశ్ర‌యంలో ల్యాండ్ అవుతుంద‌న‌గా.. పాక్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ లైన్స్ కు చెందిన A-320 ఎయిర్ బ‌స్ విమానం కూలిపోయింది. క‌రాచీ ఎయిర్ పోర్టుకు స‌మీపంలో ఉన్న‌ మోడ‌ల్ కాల‌నీలోని ఇళ్ల‌పై ఫ్లైట్ క్రాష్ అయింది. ఆ స‌మయంలో విమానంలో సుమారు 100 మంది ఉన్నార‌ని తెలుస్తోంది. లాహోర్ నుంచి క‌రాచీ వెళ్తుండగా విమానం క్రాష్ అయిన‌ట్లు పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ అధికారి అబ్దుల్లా హ‌ఫీజ్ ప్ర‌క‌టించారు. ఆ విమానంలో 90 మంది ప్ర‌యాణికులు ఉండ‌గా.. 8 మంది సిబ్బంది ఉన్నార‌ని చెప్పారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఏమైనా ప్రాణ న‌ష్టం జ‌రిగిందా లేదా అన్న స‌మాచారం ఇంకా తెలియ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. విమానంలో ఉన్న ప్రయాణికులు క్షేమం కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు పార‌ద‌ర్శ‌కంగా స‌మాచారం వెల్ల‌డిస్తామ‌ని అన్నారు.

క‌రాచీ ఎయిర్ పోర్టు స‌మీపంలో విమానం కూలిన ప్రాంతంలో దట్టంగా పొగ‌లు అలుముకున్నాయి. ఒక్క‌సారిగా భారీ శ‌బ్ధం, చుట్టూ పొగ‌లు క‌మ్ముకోవ‌డంతో ఇళ్ల‌లో నుంచి జ‌నం భ‌యంతో ప‌రుగులు తీశారు. వెంట‌నే ఫైరింజ‌న్లు, అంబులెన్స్ లు ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్నాయి. స‌హాయ చ‌ర్య‌లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డానికి ఆర్మీ ఏవియేష‌న్ హెలికాప్ట‌ర్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.

Latest Updates