మగవాళ్ల టాయిలెట్లో డైపర్ చేంజింగ్ రూమ్: ట్విట్టర్ లో వైరల్

బెంగళూరు: ఒక్క ఫొటో.. ఒకే ఒక్క ఫొటో.. ట్విట్టర్ లో బెంగళూరు ఎయిర్ పోర్టును వైరల్ గా మార్చేసింది. మగవాళ్ల టాయిలెట్లలో డైపర్ చేజింగ్ రూమ్ ఉన్న ఫొటో అది. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మగవాళ్ల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సదుపాయంపై ట్విట్టర్ లో ప్రసంశల వర్షం కురిసింది. తమ చిన్నారుల డైపర్లను మార్చాల్సి వచ్చినప్పుడు తండ్రులు మరొకరిపై ఆధారపడకుండా ఈ సదుపాయం కల్పించడం బేష్ అని మెచ్చుకున్నారు.

మాల్దీవ్స్ కు చెందిన అలీ సమ్హాన్ అనే ప్రయాణికుడు బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు ఈ ఫొటోను తీసి ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ‘బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని మగవాళ్ల టాయిలెట్లలో దీనిని చూశాను’ అంటూ మెచ్చుకోలుగా డైపర్ చేంజింగ్ రూమ్ ఫొటోను ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన కొందరు అలీని విమర్శించగా… అతడు తన ఉద్దేశాన్ని వివరిస్తూ మళ్లీ ట్వీట్ చేశాడు. మరికొందరు ఎయిర్ పోర్టు అధికారులను ప్రశంసించారు. నాన్న ప్రేమకు గుర్తింపు అంటూ కొందరు, ఒంటరి తండ్రులకు మేలు చేస్తుందంటూ కొందరు మెచ్చుకున్నారు. మరికొందరైతే పిల్లల డైపర్లు మార్చడం కేవలం తల్లి పనేనా, తండ్రి కూడా మార్చొచ్చు, పేరెంటింగ్ అనేది ఉమ్మడి బాధ్యత అంటూ ట్వీట్లు పెట్టారు. అన్ని విమానాశ్రయాల్లోనూ ఈ సదుపాయం ఉండాలన్నారు.

దీనిపై బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులు కూడా స్పందించారు. చాలా ఏళ్ల క్రితమే ఈ డైపర్ చేజింగ్ రూమ్ లను పెట్టామని చెప్పారు. మహిళలతోపాటు మగవారి రెస్ట్ రూమ్స్ లో కూడా వీటిని పెట్టడంపై చాలా ప్రశంసలు వచ్చాయన్నారు.

Latest Updates