బంగ్లాకు పింక్​ పోటు! భారీ స్కోరు దిశగా టీమిండియా

కోల్‌‌కతాఎక్కడ లేని హైప్‌‌.. మరెక్కడ లేని ఉత్కంఠ.. క్రికెట్‌‌ ప్రపంచం మొత్తం గుర్తుంచుకునేలా ఏర్పాట్లు.. ఓ దేశ ప్రధాని, ఓ రాష్ట్ర సీఎం.. రాజకీయ ఉద్దండులు.. క్రికెట్‌‌ లెజెండ్స్‌‌.. ఇతర క్రీడల ప్రముఖులు.. ఇలా ఆద్యంతం ఓ పండుగల మొదలైన పింక్‌‌ టెస్ట్‌‌… పూర్తి ఏకపక్షంగా సాగింది. బంగ్లాదేశ్‌‌ స్థాయి తక్కువే అయినా కనీస పోరాటస్ఫూర్తి కూడా చూపలేకపోయింది. టీమిండియా పేసర్ల దాటికి ప్రత్యర్థులు పెవిలియన్‌‌కు క్యూ కట్టిన వేళ.. కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ (93 బంతుల్లో 8 ఫోర్లతో 59 బ్యాటింగ్‌‌) మాస్టర్‌‌ క్లాస్‌‌ ఇన్నింగ్స్‌‌, చతేశ్వర్‌‌ పుజారా (105 బంతుల్లో 8 ఫోర్లతో 55) హాఫ్‌‌ సెంచరీ.. తొలి రోజే ఇండియాకు లీడ్‌‌ను అందించాయి. దీంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 46 ఓవర్లలో 3 వికెట్లకు 174 రన్స్‌‌ చేసింది. కోహ్లీతో పాటు రహానె (23 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా 68 పరుగుల ఆధిక్యంలో ఉంది. 43 రన్స్‌‌కే 2 వికెట్లు కోల్పోయిన ఇన్నింగ్స్‌‌ను కోహ్లీ, పుజారా మూడో వికెట్‌‌కు 94 రన్స్‌‌ జోడించి ఆదుకున్నారు. మూడో సెషన్‌‌ చివరలో పుజారా అనవసరంగా ఔటైనా, రహానె వికెట్‌‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అంతకుముందు గ్రీన్‌‌ టాప్‌‌ వికెట్‌‌పై ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన బంగ్లాదేశ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 30.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. షాద్మన్‌‌ (29) టాప్‌‌ స్కోరర్‌‌. లిటన్‌‌ దాస్‌‌ (24), నయీమ్‌‌ హసన్‌‌ (19) మాత్రమే డబుల్‌‌ డిజిట్‌‌ స్కోరు సాధించారు.

ఉమేశ్‌‌ కేక

టాస్‌‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌‌ మొమినుల్‌‌ బ్యాటింగ్‌‌ ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించగా, సీమర్‌‌ ఫ్రెండ్లీ వికెట్‌‌పై  ఇషాంత్‌‌, ఉమేశ్‌‌, షమీ దుమ్మురేపారు. కచ్చితమైన లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌, స్వింగ్‌‌, షార్ట్‌‌ పిచ్‌‌లతో బంగ్లా బ్యాట్స్‌‌మెన్‌‌ను బెంబేలెత్తించారు. ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌ లేకుండానే బరిలోకి దిగిన ఓపెనర్లు షాద్మన్‌‌, కైస్‌‌ (4).. తొలి ఆరు ఓవర్లలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులను ఎదుర్కొన్నారు. పింక్‌‌బాల్‌‌పై కలర్‌‌ ఎక్కువగా ఉండటంతో తొలి మూడు ఓవర్లలో అనూహ్యంగా బౌన్స్ అయ్యింది. తర్వాత గుడ్‌‌లెంగ్త్‌‌తో బాల్‌‌పై పట్టు సాధించిన పేసర్లు బంగ్లా ఇన్నింగ్స్‌‌ను పేకమేడలా కూల్చారు. ఏడో ఓవర్‌‌లో ఇషాంత్‌‌ దెబ్బకు కైస్‌‌ ఔటయ్యాడు. 11వ ఓవర్‌‌లో ఉమేశ్‌‌.. మూడు బంతుల తేడాలో మొమినుల్‌‌ (0), మిథున్‌‌ (0)  ఔట్‌‌ చేసి ఒత్తిడి పెంచాడు. మొమినుల్‌‌ క్యాచ్‌‌ను రోహిత్ సూపర్‌‌గా డైవ్‌‌ చేస్తూ ఒంటి చేత్తో పట్టాడు. తర్వాతి ఓవర్‌‌లోనే షమీ స్వింగ్‌‌కు ముష్ఫికర్‌‌ (0) వెనుదిరిగాడు. దీంతో వరుసగా 3, 4, 5 బ్యాట్స్‌‌మెన్‌‌ డకౌట్‌‌ కావడం సబ్‌‌కాంటినెంట్‌‌లో ఇదే తొలిసారి. బాల్‌‌ ఎక్కువగా స్వింగ్‌‌ అయినా.. వికెట్ల వెనుకాల సాహా ఆకట్టుకున్నాడు. ఉమేశ్‌‌ వేసిన ఆఫ్‌‌ స్వింగ్‌‌ బాల్‌‌ను వెంటాడిన షాద్మన్‌‌.. సాహాకు క్యాచ్‌‌ ఇచ్చాడు. ఇక మహ్మదుల్లా (6), లిటన్‌‌ దాస్‌‌ నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా.. షమీ షార్ట్‌‌ పిచ్‌‌, స్వింగ్‌‌కు దెబ్బలు తగిలించుకున్నారు. రెండో స్పెల్‌‌కు వచ్చిన ఇషాంత్‌‌ మళ్లీ చెలరేగాడు. 20వ ఓవర్‌‌లో అతని బౌలింగ్‌‌లో మహ్మదుల్లా ఇచ్చిన లో క్యాచ్‌‌ను సాహా అందుకున్నాడు. బాల్‌‌ ఫస్ట్‌‌ స్లిప్‌‌లో ఉన్న కోహ్లీ చేతుల్లోకి వెళ్తున్న తరుణంలో డైవ్‌‌ చేస్తూ సాహా సూపర్‌‌గా అందుకోవడం హైలెట్‌‌గా నిలిచింది. 21వ ఓవర్‌‌లో షమీ వేసిన బౌన్సర్‌‌.. లిటన్‌‌ దాస్‌‌ హెల్మెట్‌‌ను బలంగా తాకడంతో రిటైర్డ్‌‌హర్ట్‌‌గా వెనుదిరిగాడు. దీంతో బంగ్లా 73/6 తో ఎర్లీగా లంచ్‌‌కు వెళ్లింది.

ఇషాంత్‌‌ ట్రిపుల్‌‌

లంచ్‌‌ తర్వాత ఇషాంత్‌‌ నిప్పులు చెరిగాడు. పేస్‌‌తో పాటు గుడ్‌‌లెంగ్త్‌‌ను రాబడుతూ మూడు వికెట్లు తీశాడు. రెండోఎండ్‌‌లో షమీ కూడా ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌తో దాడి చేశాడు. మొత్తం ఇన్నింగ్స్‌‌లో స్పిన్నర్‌‌ జడేజా ఒకే ఒక్క ఓవర్‌‌ వేశాడంటే.. పేస్‌‌ డామినేషన్‌‌ను అర్థం చేసుకోవచ్చు. అసలు అశ్విన్‌‌ను బౌలింగ్‌‌కు దించే అవసరం కూడా రాలేదు. రెండో సెషన్‌‌లో ఓ ఎండ్‌‌లో స్థిరంగా బౌలింగ్‌‌ చేసిన ఇషాంత్‌‌.. వరుస విరామాల్లో ఎబాదత్‌‌ హుస్సేన్‌‌ (1), మెహిదీ హసన్‌‌ (8), నయీమ్‌‌ హసన్‌‌ను ఔట్‌‌ చేశాడు. చివర్లో అబు జాయేద్‌‌ (0)ను పెవిలియన్‌‌కు పంపిన షమీ.. తక్కువ స్కోరుకే బంగ్లా ఇన్నింగ్స్‌‌కు తెరవేశాడు.

తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఎదుర్కొన్న తొలి బంతిని మయాంక్‌‌ (14) బౌండరీ దాటించగా, ఆడిన మూడో బాల్‌‌ను రోహిత్‌‌ (21) భారీ సిక్సర్‌‌గా మలిచాడు. కానీ నాలుగో ఓవర్‌‌లో అల్‌‌ అమిన్‌‌.. టీమిండియాకు షాకిచ్చాడు. మంచి ఆఫ్‌‌ కట్టర్‌‌తో మయాంక్‌‌ను గల్లీలో పట్టేశాడు. దీంతో ఇండియా 26 రన్స్‌‌ వద్ద తొలి వికెట్‌‌ కోల్పోయింది. ఈ దశలో రోహిత్‌‌, పుజారా మరో వికెట్‌‌ పడకుండా 12 ఓవర్ల సెషన్‌‌ను ముగించారు.

స్కోరు బోర్డు 

బంగ్లాదేశ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌: షాద్మన్‌‌ (సి) సాహా (బి) ఉమేశ్‌‌ 29, కైస్‌‌ (ఎల్బీ) ఇషాంత్‌‌ 4, మొమినుల్‌‌ (సి) రోహిత్‌‌ (బి) ఉమేశ్‌‌ 0, మిథున్‌‌ (బి) ఉమేశ్‌‌ 0, ముష్ఫికర్‌‌ (బి) షమీ 0, మహ్మదుల్లా (సి) సాహా (బి) ఇషాంత్‌‌ 6, లిటన్‌‌ దాస్‌‌ (రిటైర్డ్‌‌హర్ట్‌‌) 24, నయీమ్‌‌ (బి) ఇషాంత్‌‌ 19, ఎబాదత్‌‌ (బి) ఇషాంత్‌‌ 1, మెహిదీ హసన్‌‌ (సి) పుజారా (బి) ఇషాంత్‌‌ 8, అల్‌‌ అమిన్‌‌ (నాటౌట్‌‌) 1, అబు జాయేద్‌‌ (సి) పుజారా (బి) షమీ 0, ఎక్స్‌‌ట్రాలు: 14, మొత్తం: 30.3 ఓవర్లలో 106 ఆలౌట్‌‌.

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: మయాంక్‌‌ (సబ్‌‌) మెహిదీ హసన్‌‌ (బి) అల్‌‌ అమిన్‌‌ 14, రోహిత్‌‌ (ఎల్బీ) ఎబాదత్‌‌ 21, పుజారా (సి) షాద్మన్‌‌ (బి) ఎబాదత్‌‌ 55, కోహ్లీ (బ్యాటింగ్‌‌) 59, రహానె (బ్యాటింగ్‌‌) 23, ఎక్స్‌‌ట్రాలు: 2, మొత్తం: 46 ఓవర్లలో 174/3.

Latest Updates