తొలి మహిళా IAF ఆఫీసర్.. వింగ్ కమాండర్ విజయలక్ష్మి మృతి

దేశంలో తొలి మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వింగ్ కమాండర్, డాక్టర్ విజయలక్ష్మి రమణన్ మరణించారు. 96 ఏళ్ల వయసు ఉన్న ఆమె వృద్ధాప్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. 1924 ఫ్రిబ్రవరిలో పుట్టిన ఆమె వైద్య విద్య చదివారు. గైనకాలజిస్టుగా ప్రాక్టీస్ కూడా చేసిన ఆమె 1955లో తన భర్త ప్రోత్సాహంతో ఆర్మీలో చేరారు. ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్‌లో రిక్రూట్ అయిన ఆమె తన సర్వీస్ ముగిశాక ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యారు. భారత వాయుసేన (IAF)లో తొలి మహిళా ఆఫీసర్‌గా రికార్డ్ సృష్టించారు. 24 ఏళ్ల పాటు ఎయిర్ ఫోర్స్‌లో సర్వీస్ చేసిన విజయలక్ష్మి 1979లో వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయ్యారు.

ఎయిర్ ఫోర్స్‌లో విజయలక్ష్మిని అంతా ఆఫీసర్ 4971 అని పిలిచేవారు. అంతా మగవాళ్లే ఉన్న వాయుసేనలో ఏకైక మహిళగా వారికి దీటుగా పని చేసేవారు. ఎప్పుడైనా మగవాళ్లతో పని చేయడం పట్ల భయపడ్డారా అని గతంలో ఓ డాక్యుమెంటరీలో ప్రశ్నించగా.. ‘‘అప్పటి వరకు ఎప్పుడూ నేను మగవాళ్లతో కలిసి పని చేయలేదు. దాంటో మొదట్లో కొంచెం భయపడిన మాట వాస్తవమే. అయితే జీవితంలో దేనినైనా ఎదుర్కొనే సత్తా నాకు ఉంది. ఆ ధైర్యంతో మగవాళ్లతో పోటీగా పనిచేసేదాన్ని’ అని చెప్పారు. తన భర్త కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ అని, ఆయన ప్రోత్సాహంతోనే తాను సైన్యంలో చేరానని అందులో తెలిపారు. తాను సర్వీస్‌లో ఉండగా ఆర్మీలో పది, 20 మంది వరకు ఆడవాళ్లు ఉండేవారని, ఎయిర్ ఫోర్స్‌లో మాత్రం తానే ఏకైక మహిళా ఆఫీసర్‌నని, అయినప్పటికీ ఎటువంటి వివక్ష తాను ఎదుర్కోలేదని చెప్పారు.

విజయలక్ష్మి ఎయిర్ ఫోర్స్‌లో ఒకే ఒక్క మహిళా ఆఫీసర్ కావడంతో ఆమెకు తొలినాళ్లలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అప్పటి వరకు మహిళా ఆఫీసర్ల యూనిఫామ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నతాధికారులకు రాలేదు. దీంతో ఎయిర్ ఫోర్స్ బ్లూ శారీ, వైట్ బ్లౌజ్‌తో తానే సొంతంగా యూనిఫామ్ డిజైన్ చేసుకున్నారు విజయలక్ష్మి. దానినే ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ మహిళా ఆఫీసర్లకు యూనిఫామ్‌గా కొనసాగించింది.

1966లో సికింద్రాబాద్ ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్‌లో సీనియర్ అధికారులతో మాట్లాడుతున్న విజయ లక్ష్మి

జలహళ్లి, కాన్పూర్, సికింద్రాబాద్‌లలోని ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్స్‌లోనూ విజయలక్ష్మి విధులు నిర్వర్తించారు. మెడికల్ బోర్డు అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్‌తో పాటు నర్సింగ్ ఆఫీసర్లకు గైనకాలజీ క్లాసులు కూడా చెప్పేవారామె. 1962, 1966, 1971 సంవత్సరాల్లో జరిగిన యుద్ధాల్లో గాయపడిన వాయుసేన సైనికులకు ఆమె ట్రీట్మెంట్ చేశారు. 1971లో షార్ట్ సర్వీస్ నుంచి ఆమెను పర్మనెంట్ సర్వీస్‌ కమిషన్‌కు మార్చింది వాయుసేన. 1979లో వింగ్ కమాండర్ హోదాలో ఆమె పదవీ విరమణ చేశారు. 1977లో ఆమె సేవలకు గుర్తింపుగా నాటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా విశిష్ఠ సేవా పతకం అందుకున్నారు విజయలక్ష్మి.

చనిపోయే కొద్ది రోజుల ముందు వరకు కూడా విజయలక్ష్మి చాలా యాక్టివ్‌గా ఉండేవారని ఆమె అల్లుడు ఎస్వీ ఎల్ నారాయణన్ చెప్పారు. 2013 వరకు ఆమె ఉల్సూర్‌లోని తన ఇంట్లో ఒంటరిగానే ఉంటూ వచ్చారని, ఆ తర్వాత బెంగళూరులోని తమ ఇంట్లో ఉంటున్నారని తెలిపారు. 96 ఏళ్ల వయసు వచ్చినా ఆమె చాలా ఎనర్జిటిక్‌గా ఉండేవారని, అయితే గత వారం ఉన్నట్టుండి స్పృహతప్పపోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని నారాయణన్ తెలిపారు. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ కమాండ్ హాస్పిటల్‌లో ఆమె కండిషన్ మళ్లీ స్టేబుల్ అయిందని, అయితే ఉన్నట్టుండి ఆదివారం రాత్రి నిద్రలో ప్రశాంతంగా ఆమె కన్నుమూశారని చెప్పారు.

విజయలక్ష్మి ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్‌లో ఎన్ని హోదాల్లో పని చేసినా ఆమె తనను డాక్టర్‌గానే గుర్తించాలని కోరుకునేవారని నారాయణన్ అన్నారు. ఆమె చిన్నతనంలోనే కర్ణాటక సంగీతం నేర్చుకున్నారని, 15 ఏళ్ల వయసు నుంచి మిలటరీలో చేరే ముందు వరకు  ఆలిండియా రేడియోలో పాటలు పాడేవారని, ఢిల్లీ, లక్నో, బెంగళూరు, సికింద్రాబాద్ రేడియోల్లో ఆమె ప్రోగ్రామ్స్ వచ్చేవని తెలిపారు. 1940ల్లో ఆమె మద్రాస్ కాలేజీలో మెడిసిన్ చదువుకునేటప్పుడు కూడా కాలేజీ తరఫున మ్యూజిక్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసేవారని అన్నారు. విజయలక్ష్మి తండ్రి కూడా డాక్టరేనని, ఆయన కూడా తొలి ప్రపంచ యుద్ధం సమయంలో ఆర్మీకి సేవలదించారని చెప్పారు.

 

Latest Updates