జాన్సన్‌‌ అండ్‌‌ జాన్సన్‌:‌ ప్లాంట్​ రెడీ, మెషిన్లు రెడీ..ప్రొడక్షనే నిల్

బహుళజాతి కంపెనీ జాన్సన్‌‌ అండ్‌‌ జాన్సన్‌‌ (జే ఎండ్‌‌ జే) మహబూబ్‌‌నగర్ జిల్లా పెణిజెర్లలో నిర్మించిన మాన్యుఫ్యాక్చరింగ్‌‌ యూనిట్‌‌ నిర్మాణం పూర్తై మూడేళ్లు గడుస్తున్నా ఇక్కడ ఉత్పత్తి మాత్రం మొదలుకావడం లేదు. ఇది 3 ఏళ్ల కిందటే ఉత్పత్తి మొదలెట్టాల్సి ఉంది. జే ఎండ్‌‌ జేకు ఇది ఇండియాలోనే అతిపెద్ద ప్లాంటు.   కాస్మొటిక్స్‌‌, బేబీ ప్రొడక్ట్స్‌‌ను తయారు చేయడానికి దీనిని చేపట్టారు. దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో 47 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్లాంటులో భారీ యంత్రాలు, కాన్ఫరెన్స్‌‌ రూములు, ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం సైట్‌‌ మేనేజర్‌‌ శ్రీరామ్‌‌ ఒక్కరే ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ పనులు మొదలైతే స్థానికంగా 1,500 మందికి ఉపాధి దొరుకుతుంది. బేబీ ప్రొడక్ట్స్‌‌, కాస్మొటిక్స్‌‌కు డిమాండ్‌‌ పెరగకపోవడం వల్లే ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించడం లేదని జే ఎండ్‌‌ జే సీనియర్‌‌ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. 2016 నవంబరులో పెద్దనోట్ల రద్దు, మరుసటి ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ అమలు వల్ల తమ వస్తువులకు డిమాండ్ పెరగడం లేదని వీరిలో ఒక అధికారి అన్నారు. ఈ విషయంపై అధికారికంగా స్పందించడానికి జే ఎండ్‌‌ జే కార్యాలయం గానీ, ప్రధాన మంత్రి కార్యాలయం గానీ ఇష్టపడలేదు. అవినీతి, నల్లధనాన్ని నిర్మూలించడంలో భాగంగా మోడీ ప్రభుత్వం నోట్లరద్దు, జీఎస్టీని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాలు ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి బదులు తగ్గించాయి. కన్సూమర్‌‌ డిమాండ్‌‌ తగ్గడమే ఇందుకు కారణం. నోట్లను రద్దు చేసిన నెల తరువాత షాంపూలు, సబ్బుల వంటి వస్తువుల అమ్మకాలు 20 శాతం తగ్గాయని బిజినెస్‌‌ సర్వేలు తెలిపాయి. ఉద్యోగాలు, సాగు ఆదాయం భారీగా తగ్గాయి. ఇవి ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నష్టం కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ మాత్రం ఈసారి కూడా కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్నది.

భారీ పెట్టుబడులు, ఎన్నో ఆశలు…

మోడీ ప్రభుత్వం అనుసరించిన వ్యాపార విధానాలు విదేశీ కార్పొరేట్‌‌ కంపెనీలకు ఇబ్బందిగా మారాయి. వైద్యపరికరాల ధరలకు పరిమితులు విధించడం, టెక్నాలజీ కంపెనీలు.. వినియోగదారుల డేటాను దేశీయంగా స్టోర్‌‌ చేయాలని ఆదేశించడం, ఈ–కామర్స్‌‌ కంపెనీలు సొంతగా వస్తువులు అమ్మకూడదని నిర్దేశించడంతో జే ఎండ్‌‌ జే, మాస్టర్‌‌కార్డ్‌‌, అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ వంటి కంపెనీలకు సమస్యలు వచ్చాయి. 2014లో పెణిజెర్లలో జే ఎండ్‌‌ జే ప్లాంటు పనులు మొదలయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్లాంటు వల్ల స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఇందులో బేబీ ఆయిల్‌‌, బేబీ షాంపూ, బేబీ లోషన్‌‌, బేబీ హేర్‌‌ ఆయిల్‌‌, ఫేస్‌‌వాష్‌‌, క్రీమ్స్‌‌ తయారు చేస్తామని తెలంగాణ ప్రభుత్వానికి 2017లో సమర్పించిన జాబితాలో జే ఎండ్‌‌ జే తెలిపింది. ఈ ప్లాంటు దగ్గర టీ దుకాణం నడుపుకునే షౌకత్‌‌ అలీ మాట్లాడుతూ జే ఎండ్‌‌ జేలో ఉద్యోగాల కోసం రోజూ ఎంతో మంది అడుగుతున్నారని, కంపెనీ ఏమీ చెప్పడం లేదని అన్నారు. స్థానిక కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి  స్పందిస్తూ ప్లాంటును ప్రారంభించడానికి అవసరమైన అన్ని అనుమతులూ జే ఎండ్‌‌ జేకు ఉన్నాయని, పనులు ఎందుకు మొదలుకావడం లేదో తనకు తెలియదని అన్నారు. ‘‘ఇంతటి పెద్ద కంపెనీ ప్లాంటు ఇన్నేళ్లు ఖాళీగా ఉండటం విచిత్రం. మావైపు నుంచి అన్ని అనుమతులు ఇచ్చాం’’ అని పేర్కొన్నారు. డిమాండ్‌‌ లేకపోవడం వల్లే ప్లాంటును ప్రారంభించడం లేదని జే ఎండ్‌‌ జే అధికారులు తనకు చెప్పినట్టు తెలంగాణ పరిశ్రమలశాఖ ఉన్నతాధికారి చంద్రశేఖర్‌‌ బాబు అన్నారు. ఇండియా మార్కెట్‌‌ను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమయ్యామని జే ఎండ్‌‌ జే సీనియర్‌‌ అధికారి ఒకరు అన్నారు. ఈ ప్లాంటు విజయవంతమైతే మరింత విస్తరించాలని కూడా అనుకున్నామని తెలిపారు. ఈ ప్లాంటు పక్కనే ఉన్న ప్రోక్టర్‌‌ అండ్‌‌ గ్యాంబిల్‌‌ ప్లాంటు కూడా పూర్తిస్థాయి సామర్థ్యంతో నడవడం లేదని అక్కడి ఉద్యోగులు అన్నారు. ఇందులో డైపర్లు, డిటర్జెంట్లు తయారు చేస్తున్నామని అన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తరువాత.. జే ఎండ్‌‌ జే, పీ అండ్‌‌ జీతోపాటు హిందుస్థాన్‌‌ యూనిలీవర్‌‌ కంపెనీల అమ్మకాలు కూడా పడిపోయాయి.

Latest Updates