మొక్కలూ మాట్లాడుకుంటయ్

‘‘అబ్బా.. ఈ కీటకంగాడెవడో కాళ్లు తెగ కొరికేస్తున్నాడురోయ్. నా తర్వాత నీ దగ్గరికే వచ్చేటట్లున్నాడు. జర జాగ్రత్తగా ఉండు’ ‘అవునా.. చచ్చాంరా బాబోయ్.. పెద్ద ముప్పే వచ్చింది. అందరం మూకుమ్మడిగా పోతామేమో. ‘మనోళ్లందరికీ వార్నింగ్ ఇయ్యండి’ మన చుట్టూ ఉన్న మొక్కలు మాట్లాడుకునే భాష ఇట్లే ఉంటుందట. మొక్కలు మాట్లాడటమేంటి? అంటారా? వాటి భాషకు మనలా సౌండ్ అవసరం లేదు. కెమికల్ లాంగ్వేజ్. ఇదంతా తమ రీసెర్చ్ లో తెలిసిందని న్యూయార్క్ కార్నెల్ వర్సిటీ సైంటిస్టులు
చెప్పారు.

ఎలా తెలిసింది?

కెనడాలో ఉండే సోలిడాగో అల్టిసిమా అనే జాతి మొక్కలపై అవి సహజంగా పెరిగే చోట కార్నెల్ యూనివర్సిటీ సైంటిస్టులు ప్రయోగం చేశారు. కుండీల్లో పెంచిన అల్టిసిమా మొక్కలను తీసుకెళ్లి ఒక సర్కిల్ లాగా ఉంచారు. ప్రతి సర్కిల్ మధ్యలో ఒక్కో మొక్కను ఉంచారు. మధ్యలో ఉన్న మొక్కపైకి కొన్ని కీటకాలను వదిలారు. దీంతో ఆ కీటకాలు దాడి చేయడంతో ఆ మొక్క కెమికల్స్ విడుదల చేయడం, ఆ వాసనను ఇతర మొక్కలు గ్రహించి, ప్రత్యేక కెమికల్స్ ను రిలీజ్ చేయడాన్ని గుర్తించారు. మొక్కలు వేర్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయని ఇదివరకే పలు రీసెర్చ్ లలో తేలింది. అందుకే వీరు కుండీల్లో పెంచిన మొక్కలతో ఈ ప్రయోగం చేసి ప్లాంట్ లాంగ్వేజ్ లో మరో రెండాకులు చదివేశారన్నమాట!

వీటి భాషే సెపరేట్

మొక్క ఆకులు, కాండం లేదా పూలను కీటకాలు కొరికినప్పుడు ఆ మొక్క నుంచి ప్రత్యేక వాసనతో ఉండే వోలెటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీ) విడుదల అవుతాయట. ఒక్కో జాతి మొక్కలు ఒక్కో రకం వాసన ఉండే వీఓసీ రసాయనాలను రిలీజ్ చేస్తాయట. ఏ జాతి మొక్క ఈ ప్రత్యేక వాసనను విడుదల చేసినా.. దాని చుట్టుపక్కల ఉన్న అన్ని జాతుల మొక్కలకూ మెసేజ్ చేరిపోతుందట. కానీ పెద్ద ఎత్తున ప్రమాదం ఉందనిపిస్తే మాత్రం.. కొన్ని మొక్కలు తమ జాతి మొక్కల కోసమే మరింత ప్రత్యేకంగా హెచ్చరికలు పంపుతాయని తమ రీసెర్చ్ లో తేలినట్లు యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆండ్రీ కెస్లర్ వెల్లడించారు. ‘‘సాధారణంగా మొక్కలపై కీటకాలు దాడి చేయగానే హెచ్చరికలు జారీ చేసే కెమికల్స్ విడుదల చేస్తాయి. అలాగే తమను తాము కాపాడుకునేందుకు కూడా ఆటోమేటిక్ గా మొక్కల్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి” అని కెస్లర్ పేర్కొన్నారు. ఇక వార్నింగ్స్ అందుకున్న మొక్కలు కూడా తమను తాము రక్షించుకోవడం కోసం కెమికల్స్ రిలీజ్ చేస్తాయన్నారు. అయితే మన మాదిరిగా మొక్కలకు ఇమ్యూన్ సిస్టం ఉండదు కాబట్టి, ఇవి కెమికల్స్ రిలీజ్ చేయడం, మెటబాలిజంలో మార్పులు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాయని వివరించారు.

మొక్కలకు నొప్పి ఎలా తెలుస్తుంది?

మొక్కలకు నాడీ వ్యవస్థ ఉండదు కాబట్టి మనలాగా నొప్పిని ఫీలయ్యే చాన్స్ ఉండదు. కానీ.. గాయాలకు అవి కూడా రెస్పాండ్ అవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఏదైనా  ఓ కీటకం ఆకులను కొరకగానే.. అక్కడ కాల్షియం రిలీజ్ అవుతుందట. ఆ తర్వాత వెంటనే మొక్క కాండం, కొమ్మలన్నింట్లోనూ విడతల వారీగా చైన్ రియాక్షన్ జరుగుతుందట. ఒకటి, రెండు నిమిషాల్లోనే మొక్కలోని ప్రతి భాగమూ రెస్పాండ్ అవుతుందట. గతేడాది అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ విస్కాన్సిన్ సైంటిస్టుల రీసెర్చ్‌‌‌‌లో ఈ విషయాలు తెలిశాయి. ఆకులను రక్షించుకునేందుకు హార్మోన్లు విడుదలవడం కోసమే కాల్షియం రిలీజ్ అవుతుందని వారు కనుగొన్నారు. కొన్ని మొక్కలు కీటకాలకు విషపూరితమైన, చెడు వాసనతో ఉండే కెమికల్స్ ను విడుదల చేస్తాయని, మరికొన్ని మొక్కలు పురుగులను తినే కీటకాలను ఆకర్షించడం కోసం హార్మోన్లను విడుదల చేస్తాయని గుర్తించారు.

Latest Updates