గోల్కొండ బోనాల వేడుకల్లో ప్లాస్టిక్ నిషేదం..

ఈసారి బోనాల పండగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని నిర్ణయించారు గోల్కొండ జాతర నిర్వాహకులు.  నెల రోజుల పాటు కోటలో జరిగే ఈ వేడుకల్లో ప్లాస్టిక్ ను నిషేధించారు.  మట్టి, పేపర్ గ్లాసుల్లో నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి అమ్మవారికి సమర్పించే తొట్టెలను కూడా పేపర్లతోనే తయారు చేస్తున్నారు. అవసరానికి మించిన ప్లాస్టిక్ ఉత్పత్తి… అడ్డగోలు వాడకం పర్యావరణానికి  ముప్పు తెచ్చిపెడుతోంది. అందుకే ఈఏడాది గోల్కొండ బోనాల్లో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని నిర్ణయించారు అధికారులు. పర్యావరణంతో పాటు ఫోర్ట్ హెరిటేజ్ ను కాపాడేందుకు ప్రణాళికలు రెడీ చేశారు.

వచ్చే నెల 4 నుంచి నుంచి ఆగస్టు 1 వరకు గోల్కొండ కోటపై బోనాలు జరుగుతాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ  ఏడాది పర్యావరణహితంగా పండుగ జరపడానికి  ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జాతరకు వచ్చే భక్తులకు మట్టి గ్లాసులు, పేపర్ గ్లాసుల్లో నీళ్లు సరఫరా చేస్తారు. మట్టి కుండల్లోనే అమ్మవారికి బోనం సమర్పించేలా కుండలు అందుబాటులో ఉంచుతున్నారు.

అమ్మవారికి సమర్పించే తొట్టెలు కూడా ప్లాస్టిక్ వి కాకుండా ..పేపర్ తొట్టెలను ఓల్డ్ సిటీలో చేయిస్తున్నారు. 10అడుగుల పేపర్ తోట్టెల కోసం 18వేలు ఖర్చు చేస్తున్నారు. బోనాలు, వంటలతో కోట కళ తప్పకుండా చర్యలు తీసుకుంటున్నారు. కోటలోని మొదటి బావి దగ్గర మాత్రమే బోనం వండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈఏడాది 15లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అధికారులు.

Latest Updates