స్కూల్ ఫీజుకు బదులు ప్లాస్టిక్ ఇస్తే చాలు

స్కూల్​ బెల్లు మోగిందంటే చాలు.. మోపెడు బరువుండే బ్యాగులతో గుంపులు గుంపులుగా పిల్లలు పరుగెత్తడం చూస్తుంటాం. కానీ భుజాన బ్యాగులతో పాటు.. చేతిలో పాలిథేన్​ బ్యాగుల నిండా వాడి పారేసే ప్లాస్టిక్​ చెత్తతో  స్కూల్​కెళ్లడం చూశారా? అసోం రాష్ట్రంలోని ‘అక్షర్​ స్కూల్​’ గేట్​ దగ్గర రోజూ ఇలాంటి సన్నివేశమే కనిపిస్తుంది. ఇదంతా ఏంటబ్బా అనుకుంటున్నారా? ఏ స్కూల్లోనైనా ఫీజు కట్టి చదువుకోవాలి. కానీ మజిన్​ ముక్తర్​, పర్మిత శర్మ దంపతులు స్థాపించిన స్కూల్లో పిల్లలు…  తమ ఇంట్లో నుంచి వాడి పారేసే ప్లాస్టిక్​ని రోజూ తీసుకెళ్లాలి. అదే స్కూల్​ ఫీజు కిందకు లెక్కన్నమాట.

అసలు ఎందుకీ ప్లాస్టిక్​ చెత్త? వీటితో ఏం చేస్తారు? అసలు ఎవరైనా డబ్బుల రూపంలో ఫీజు తీసుకుంటారు. కానీ వీళ్లేంటి ఇలా? అని ఆశ్చర్యపోతున్నారా? ఇదంతా ఆ దంపతులు సామాజిక బాధ్యతతో చేస్తున్న పని.

ఎవరీ మజిన్, పర్మిత్​లు​?

ఒక స్కూల్​ ప్రాజెక్ట్​ మీద మజిన్​ అనే యువకుడు 2013లో న్యూయార్క్​ నుంచి మన దేశానికి వచ్చాడు. అప్పుడు తన పనిలో భాగంగా ‘టాటా ఇని​స్టిట్యూట్​ ఆఫ్​ సోషల్​ సైన్సెన్స్​’లో మాస్టర్స్​ చేసే పర్మిత అనే అమ్మాయితో పరిచయమైంది. ఆమె కూడా మజిన్​లాగే విద్యారంగంలో పని చేయాలనే ఆశయంతో ఉండేది. అలా వాళ్ల పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.

‘పమోహీ’నే ఎందుకు?

దేశంలో ప్రతిచోటా ప్లాస్టిక్​ వాడకం ఉంది. అయితే అసోంలోని పమోహీ ప్రాంతం ప్రజలు ప్లాస్టిక్​ వాడకం ఒక్కటే కాదు… మరో అనర్థానికీ పాల్పడుతుండేవాళ్లు. అదేంటంటే… మంట వేసుకోవడానికి ప్లాస్టిక్​ చెత్తను వాడటం. అక్కడ చలిగా ఉందంటే చాలు, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉండే ప్లాస్టిక్​ కవర్లు, బాటిళ్ల వంటి చెత్తను కాల్చేవాళ్లు. ఆ విషయం తెలుసుకున్న పర్మిత, మజిన్​లు… ఎలాగైనా ఆ ఊరివాళ్ల అలవాటును మాన్పించి, దానివల్ల ఆరోగ్యానికి కలిగే హానిని ఆపాలనుకున్నారు.

‘అక్షర్​ స్కూల్​’ ఎలా పుట్టింది?

పమోహీలో ఉండే చాలామంది పేద పిల్లలు బడికి వెళ్లేవాళ్లు కాదు. రాళ్లు కొట్టడానికి వెళ్లి రోజుకు రూ.150 నుంచి రూ.200 సంపాదించి తల్లిదండ్రులకు తెచ్చి ఇచ్చేవాళ్లు. ఏ నిరుపేద బతుకు మారాలన్నా, వాళ్ల పిల్లలకు విద్య అవసరమని నమ్ముతారు పర్మిత, మజిన్​లు. అందుకే అక్కడి పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలనుకున్నారు. 2016 జూన్​ నెలలో పేద పిల్లల కోసం ‘అక్షర్​ స్కూల్​’ని ప్రారంభించారు.

అక్షర్​ స్కూల్లో విద్యార్థులు మొదట ఇరవై మందే చేరారు.
తర్వాత అక్కడి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చి పిల్లలను స్కూల్​కి పంపడం ప్రారంభించారు. అలా విద్యార్థుల సంఖ్య వందకి చేరింది. వాళ్లంతా నాలుగు నుంచి పదిహేనేళ్ల మధ్య వయసున్న పిల్లలు. వారానికి ఒక్కో విద్యార్థి కచ్చితంగా 25 ప్లాస్టిక్​ చెత్త పదార్థాలు తీసుకురావాలని చెప్తుంది స్కూల్​ యాజమాన్యం. స్కూల్​ మిగతా వాటిలా కాకుండా… ప్రతిదాంట్లోనూ వైవిధ్యంగా ఉంటుంది. క్లాస్​రూముల నుంచి సబ్జెక్ట్స్​, హోంవర్క్​ వరకు అన్నీ డిఫరెంట్​గానే ఉంటాయి. వచ్చే ఐదేళ్లలో ఇలాంటి స్కూళ్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ప్రయత్నిస్తున్నారు.

ఏమేం సబ్జెక్ట్స్​ ఉంటాయి?

అన్ని స్కూళ్లలో ఉండే సబ్జెక్ట్స్​ ఉండవు ఇక్కడ. ప్రత్యేకంగా సంగీతం, నాట్యం, సోలార్​ ప్యానెలెంగ్​, ఎంబ్రాయిడరీ, కాస్మొటాలజీ, కార్పెంట్రీ, గార్డెనింగ్​, ఆర్గానిక్​ ఫార్మింగ్​, ఎలక్ట్రానిక్స్​, రీసైక్లింగ్​ వంటి ఒకేషనల్​ కోర్సులు ఉంటాయి. చదువు పూర్తయిన వెంటనే, ప్రతి విద్యార్థికి ఏదో ఒక ఉపాధి లభించాలన్నదే ఈ స్కూల్​ లక్ష్యం.

ప్లాస్టిక్… ఫీజుగా ఎలా మారింది?

ప్లాస్టిక్​ కాల్చడం వల్ల వచ్చే పొగ ఆరోగ్యానికి హానికరం అని వాళ్లకు తెలియదు. ఆ విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు. దాని కోసం ఊరూరూ తిరిగి ప్రచారం చేశారు. అంతేకాదు, స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. ప్రతి విద్యార్థీ తమ ఇంట్లో నుంచి రోజూ స్కూల్​కి ప్లాస్టిక్​ చెత్త తేవాలని చెప్పారు. తెచ్చిన దానిని ఏదో ఒక అవసరానికి ఉపయోగపడేలా రీసైక్లింగ్​ చేయడం ప్రారంభించారు. ఆ దిశగా పిల్లలకు శిక్షణ కూడా ఇస్తున్నారు.

Latest Updates